యాసిడ్ బాధితురాలు పక్కన కూర్చుని సెల్ఫీలు | UP Women Cops Click Selfies Near Acid Attack Survivor, Suspended | Sakshi
Sakshi News home page

యాసిడ్ బాధితురాలు పక్కన కూర్చుని సెల్ఫీలు

Published Sat, Mar 25 2017 10:18 AM | Last Updated on Sat, Aug 25 2018 5:10 PM

యాసిడ్ బాధితురాలు పక్కన కూర్చుని సెల్ఫీలు - Sakshi

యాసిడ్ బాధితురాలు పక్కన కూర్చుని సెల్ఫీలు

లక్నో : సెల్ఫీ పిచ్చి ఎంత దారుణంగా ఉందంటే.. ఓ వైపు యాసిడ్ బాధితురాలు బెడ్పై విషమ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతుంటే ఆమెకు సంరక్షణగా ఉండాల్సిన మహిళా పోలీసులు ఆమె బెడ్ పక్కనే కూర్చుని సెల్ఫీలు దిగుతున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. కూతురు పరీక్షల కోసం లక్నో వెళ్లి తిరిగి రైలులో వస్తున్న ఓ 35 ఏళ్ల మహిళపై నిన్న గ్యాంగ్ రేప్ జరిగింది. గ్యాంగ్ రేప్ చేసిన కామాంధులు ఆమెకు బలవంతంగా యాసిడ్ కూడా తాగించారు. ఈ ఘటన అనంతరం మాట్లాడలేని స్థితిలోకి వెళ్లిన మహిళ లక్నో పోలీసులను ఆశ్రయించింది. వెంటనే ఫిర్యాదు నమోదుచేసుకున్న పోలీసులు, ఆమెను కింగ్ జార్జ్స్ మెడికల్ యూనివర్సిటీ ఆసుపత్రిలో చేర్పించారు. ఆమెకు సంరక్షణగా ముగ్గురు మహిళా పోలీసులను నియమించారు.
 
అయితే ఆమెకు ప్రొటక్షన్ గా వచ్చిన ఈ మహిళా పోలీసులు మాత్రం బాధితురాలి బెడ్ పక్కన కూర్చుని నవ్వుతూ ఫోటోలు దిగారు. ఈ ఫోటోలు ఒక్కసారిగా దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతికి గురిచేశాయి.  ఓ వైపు బాధితురాలు గ్యాంగ్ రేప్, యాసిడ్ అటాక్తో కొట్టుమిట్టాడుతుంటే, మహిళా పోలీసులై ఉండి నవ్వుతూ ఫోటోలు దిగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ పోలీసులపై వెంటనే యాక్షన్ తీసుకుంటూ వారికి సస్పెన్షన్ ఆదేశాలు జారీచేశారు. ఈ ముగ్గురు పోలీసులకు కనీసం ఎలా ప్రవర్తించాలో కూడా తెలియదని, వెంటనే వీరిపై చర్యలు తీసుకుంటామని  సీనియర్ పోలీసు ఆఫీసర్ ఏ సతీష్ గణేష్ చెప్పారు. అయితే ఈ బాధితురాల్ని  పరామర్శించేందుకు యూపీ కొత్త సీఎం యోగి ఆదిత్యానాథ్ ఆసుపత్రికి వచ్చి వెళ్లాక ఈ సెల్ఫీల ఘటన చోటుచేసుకుంది.
 
ఆసుపత్రికి వచ్చిన యోగి ఆదిత్యానాథ్ వెంటనే ఆ ఆగంతుకులను అరెస్టు చేసి, చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఈ ఘటన జరిగిన గంటల వ్యవధిలో ఇద్దరు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. ఈ మహిళపై 2008 నుంచి ఇప్పటికీ పలుసార్లు గ్యాంగ్ రేప్లు జరిగాయి. పలుసార్లు ఆమెకు ఈ దిగ్భ్రాంతికర సంఘటనలు ఎదురవుతుండటంతో  ఆమె ఎప్పటినుంచో ప్రొటక్షన్ కూడా కోరుతున్నారు. కానీ ఆమెకు ఇప్పటివరకు ఎలాంటి ప్రొటక్షన్ అందలేదు. యాసిడ్ అటాక్ బాధితుల కోసం ఈమె ఓ కేఫ్ లో పనిచేస్తోంది. తన కూతురు పరీక్షల కోసం లక్నో వెళ్లి రైలులో వస్తున్న మహిళపై ఈ ఘటన చోటుచేసుకుంది. ట్రైన్ లక్నో వచ్చిన వెంటనే ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. యాసిడ్ ను బలవంతంగా తాగించడంతో మాట్లాడలేని స్థితిలో ఉన్న ఈమె, జరిగిన విషయమంతా రాతపూర్వకంగా తెలియజేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement