బీఫ్ తిన్నాడు.. గోల్డ్ మెడల్స్ గెలిచాడు
ఒలంపిక్స్లో ఆశించిన రీతిలో పతకాలు సాధించకపోవడానికి మౌలిక సదుపాయాల లేమినే ప్రధాన కారణంగా ఎత్తిచూపుతూ తీవ్ర చర్చలు జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ ఎంపీ ఉదిత్ రాజ్ చర్చనీయాంశమైన కామెంట్ చేశారు. తొమ్మిది బంగారు పతకాలు గెలుచుకున్న జమైకా ప్లేయర్ ఉసేన్ బోల్ట్, రోజుకి రెండు సార్లు ప్రొటీన్ ఆహారం బీఫ్ తినడం వల్లనే విజయాన్ని సాధించాడని ఆయన ట్వీట్ చేశారు. . బోల్ట్ది పేదకుటుంబమైనప్పటికీ రోజుకి రెండు సార్లు బీఫ్ తినాలని తన ట్రైనర్ సలహా ఇచ్చాడని పేర్కొన్నారు. ఓ వైపు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బీఫ్ను నిషేధిస్తున్న నేపథ్యంలో ఉదిత్ రాజ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. భారత్లో అథ్లెటిక్స్కు సరియైన సదుపాయాలు లేకపోవడం వల్లనే పతకాలు ఆర్జించలేకపోతున్నారనే ఆరోపణలపై స్పందనగా ఆయన ఈ ట్వీట్ లు చేశారు.ఆయన చేసిన ఈ ట్వీట్లు 200 సార్ల కంటే ఎక్కువగా రీట్వీట్ అయ్యాయి.
అథ్లెటిక్స్ వారి వైఫల్యాలకు, చుట్టూ ఉన్న పరిస్థితులను, ఆహార విషయాలను అంటకట్టకూడదని వ్యాఖ్యానించారు. మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల తాము రాణించలేకపోయామని సాకులు చెప్పడం సరియైనది కాదని పేర్కొన్నారు. ఉసేన్ బోల్ట్ నుంచి భారత్ ప్లేయర్లు కూడా అకింతభావం నేర్చుకోవాలని, విజయాలకు మార్గాలను అన్వేషించాలని ఆయన తెలిపారు. భారత్లో స్పోర్ట్స్కు అందించే సదుపాయాల్లో లోటు లేదని, జమైకా, కెన్యా దేశాలతో పోలిస్తే మన దేశంలోనే ఎక్కువగా నిధులను స్పోర్ట్స్కు వెచ్చిస్తున్నారని వెల్లడించారు. మరోవైపు మాంసాహారంలో ప్రొటీన్ల శాతం ఎక్కువగా ఉంటుందని అథ్లెటిక్స్ ఈ పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల అలసట శాతం తక్కువగా ఉంటుందని వాదన లేకపోలేదు.