పరుగుల వీరాధివీరుడు ఉసేన్ బోల్ట్ ఏం తింటాడు? పెద్దకూర (బీఫ్) తినడం వల్లే అతడు ఫిట్‌గా ఉన్నాడా?.. అన్నది దేశంలో పెద్ద చర్చనీయాంశమైంది. ఇప్పటికే దేశంలో బీఫ్‌పై పెద్ద చర్చే నడుస్తోంది. ఈ చర్చకు మరింత ఆజ్యం పోసేలా బీజేపీ దళిత ఎంపీ ఉదిత్ రాజ్ వ్యాఖ్యలు చేశారు. ఉసేన్ బోల్ట్ బీఫ్ తింటాడని, అందుకే అతను ఒలింపిక్స్‌లో తొమ్మిది స్వర్ణాలు సాధించాడని ఆయన చెప్పుకొచ్చారు.
( బోల్టు డైట్.. జరిగిన కల్పిత ప్రచారం ఇది! ) నిజానికి బోల్ట్ బీఫ్ తింటానని ఎక్కడా చెప్పుకోలేదు. కానీ, ఒక ఫేక్ మెమె మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారమైంది. తాను పేద కుటుంబం నుంచి రావడం వల్ల శక్తిమంతమైన ఆహారం తీసుకునే అవకాశం ఉండేది కాదని, అందుకే తన కోచ్ గ్లెన్ మిల్స్ సూచన ప్రకారం రోజుకు రెండుసార్లు బీఫ్ తిన్నానని, మొదట్లో పెద్దకూరపై కొంత సందేహం ఉన్నా రానురాను దాని ప్రయోజనాలను గుర్తించానని, కాబట్టి ఆరోగ్యకరమైన జీవితం కోరుకునేవారు బీఫ్ తినాలని తాను సూచిస్తానని బోల్ట్ చెప్పినట్టు ఎవరో సోషల్ మీడియాలో కల్పిత ప్రచారానికి పూనుకున్నారు. ఈ కల్పిత ప్రచారం నిజమేనని నమ్మిన బీజేపీ ఎంపీ.. బీఫ్ వల్లే బోల్ట్‌కు పతకాలు వచ్చాయని పేర్కొని నాలుక కర్చుకున్నారు.
రియో ఒలింపిక్స్‌లో మూడు స్వర్ణాలు సాధించడం ద్వారా మొత్తం 9 స్వర్ణాలు తన ఖాతాలో వేసుకొని కెరీర్‌కు వీడ్కోలు చెప్పిన ఉసేన్ బోల్ట్ తాను బీఫ్ తిన్నట్టు ఎప్పుడూ చెప్పలేదు. సాధారణ జమైకా ఆహారమైన అన్నం, దుంపలు, చేపలను మొదట్లో అధికంగా తీసుకునేవాడినని బోల్ట్ మీడియాకు తెలిపాడు. ఇప్పుడు సొంతంగా చెఫ్‌ను అపాయింట్ చేసుకోవడంతో తనకు నచ్చిన ఆహారాన్ని, హై ప్రోటీన్, కార్బోహైడ్రెట్లు ఉన్న ఆహారాన్ని తీసుకుంటున్నట్టు చెప్పాడు.
'నేను మంచి డైట్‌ను ఫాలో అవుతాను. నాకు కావాల్సిన ఆహారాన్ని అందించడానికి సొంతంగా చెఫ్ ఉన్నాడు. చికెన్, రైస్, కూరగాయలు నేను అధికంగా తీసుకుంటాను. ఇది మంచి జమైకన్ ఆహారం. ఇందులో హైడ్రెటెడ్ పోషకాలు ఉండేలా చూసుకుంటాను. విదేశాలకు వెళ్లినప్పుడు కింగ్ బర్గర్, మెక్‌డొనాల్డ్ వంటకాలు తీసుకుంటాను. కానీ నా వెంట చెఫ్ ఉండటంతో నాకు కావాల్సిన ఆహారాన్ని అతడు సమకూరుస్తాడు' అని బోల్ట్ మీడియాకు తెలిపారు.
( బోల్ట్ తీసుకునే అసలైన ఆహారం ఇదే)