
లలిత్ వివాదంలోకి రాజే!
ఐపీఎల్ స్కామ్‌స్టర్, తాజా వివాదానికి కేంద్ర బిందువైన లలిత్ మోదీ మంగళవారం నోరు విప్పారు. బ్రిటన్‌లో తన ఇమిగ్రేషన్‌కు సంబంధించిన
బ్రిటన్ ఇమిగ్రేషన్‌లో వసుంధర రాజే తనకు లిఖితపూర్వకంగా సహకరించారన్న లలిత్ మోదీ
సుష్మా స్వరాజ్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్నాయని వెల్లడి
ఇండియా టుడే చానల్ ఇంటర్వ్యూలో పలు సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఐపీఎల్ స్కామ్‌స్టర్, తాజా వివాదానికి కేంద్ర బిందువైన లలిత్ మోదీ మంగళవారం నోరు విప్పారు. బ్రిటన్‌లో తన ఇమిగ్రేషన్‌కు సంబంధించిన అభ్యర్థనకు రాజస్థాన్ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత వసుంధర రాజే లిఖిత పూర్వక సహకారం అందించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కుటుంబంతో తనకు సన్నిహిత సంబంధాలున్నాయని, సుష్మా స్వరాజ్ భర్త, ఆమె కూతురు తనకు ఉచితంగా న్యాయ సహాయం అందించారని పేర్కొన్నారు. యూరప్‌లోని మాంటెనెగ్రో దేశంలో విహారయాత్రంలో ఉన్న లలిత్ ఇండియా టుడే చానెల్‌లో సీనియర్ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భార్య మినాల్ కేన్సర్ చికిత్స కోసం రెండేళ్ల క్రితం పోర్చుగల్ వెళ్లినప్పుడు.. వసుంధర రాజే ఆమెకు తోడుగా వెళ్లారని మోదీ వెళ్లడించారు. ‘వసుంధర రాజె నాకు 30 ఏళ్లుగా తెలుసు.
ఇది అందరికీ తెలిసిన విషయమే. మా కుటుంబానికి, నా భార్యకు ఆమె సన్నిహితురాలు. ఇమిగ్రేషన్ అధికారుల వద్ద సాక్ష్యమిచ్చేందుకు ఆమె సంతోషంగా అంగీకరించారు. అయితే, విచారణ ప్రారంభమయ్యేనాటికే ఆమె ముఖ్యమంత్రి కావడంతో ఆమె సాక్షిగా రావడం కుదరలేదు. ఇవన్నీ కోర్టు రికార్డుల్లో కూడా ఉన్నాయి. నా భార్యకు ఆరోగ్యం బాలేనప్పుడు వసుంధర, సుష్మ నాకెంతో అండగా నిలిచారు. వారే కాదు రాజకీయ నేతలెందరో నాకు అత్యంత సన్నిహితులు’ అని మోదీ తెలిపారు. ఐపీఎల్‌లో నిధుల దుర్వినియోగం, మనీ లాండరింగ్, బెటింగ్ తదితర ఆరోపణలపై కేసులు నమోదైన తరువాత లలిత్ బ్రిటన్ వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో మోదీకి మద్దతుగా ఇమిగ్రేషన్ అధికారుల ముందు రాజే లిఖిత పూర్వక సాక్ష్యమిచ్చారని వార్తలు వచ్చిన కొన్ని గంటల తరువాత లలిత్ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.
ఎన్సీపీ నేత శరద్ పవార్, కాంగ్రెస్ నేత రాజీవ్ శుక్లాలు కూడా తనకు సాయం చేశారని లలిత్ అన్నారు. ఐపీఎల్ స్కాంలో శశిథరూర్ మంత్రి పదవి పోగొట్టుకోవడంతో నాటి యూపీఏ సర్కారు తనపై కక్ష గట్టిందన్నారు. ఈ వార్తలపై రాజే స్పందిస్తూ.. ఆ(లలిత్) కుటుంబం నాకు చాన్నాళ్లుగా తెలుసు. కాకపోతే వారు చెప్పే ఇమ్మిగ్రేషన్ పత్రాల గురించి మాత్రం తెలియదు’ అని అన్నారు. బ్రిటన్ ట్రావెల్ డాక్యుమెంట్స్ విషయంలో సాయం చేయాల్సిందిగా తాను సుష్మను కోరానని లతిత్ నిర్ధారించారు. ‘సుష్మనే కాదు.. విదేశాంగ మంత్రిగా ఎవరున్నా సాయం కోరేవాడిని’ అన్నారు. ‘సుష్మ భర్త స్వరాజ్ కౌశల్ 20 ఏళ్లు నా న్యాయవాదిగా ఉన్నారు. వారి కూతురు బస్సురి నాలుగేళ్ల పాటు నాకు న్యాయ సహకారం అందించారు. అవన్నీకూడా ఉచితంగానే అందించారు’ పేర్కొన్నారు. కేంద్ర మంత్రి జైట్లీ మంగళవారం సుష్మకు మద్దతిస్తూ మాట్లాడిన కాసేపటికే వసుంధర మోదీ ఇమ్మిగ్రేషన్‌కు సహకరించిన విషయం వెలుగులోకి వచ్చింది. ఇమిగ్రేషన్ డాక్యుమెంట్లోని రహస్య నిబంధనలో.. మోదీకి మద్దతుగా తాను సాక్ష్యం ఇచ్చిన విషయం భారత అధికారులకు తెలియకూడదని రాజే పేర్కొన్నట్లు సమాచారం. కాగా, లలిత్‌కు ప్రయాణ పత్రాలు జారీలో నిబంధనల ప్రకారమే నడుచుకున్నామని బ్రిటన్ హోం శాఖ పేర్కొంది.