చిక్కుల్లో వసుంధర రాజే! | Lalit Modi Had Loaned Crores to Vasundhara Raje's Son Dushyant, Say Sources | Sakshi
Sakshi News home page

చిక్కుల్లో వసుంధర రాజే!

Published Thu, Jun 18 2015 12:47 AM | Last Updated on Sun, Sep 3 2017 3:53 AM

దుష్యంత్ సింగ్, వసుంధర రాజే, లలిత్ మోదీ

దుష్యంత్ సింగ్, వసుంధర రాజే, లలిత్ మోదీ

ఐపీఎల్ మాజీ కమిషనర్, మనీ ల్యాండరింగ్ సహా పలు కేసుల్లో నిందితుడుగా పరారీలో ఉన్న లలిత్ మోదీ వ్యవహారం రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది.

తనయుడు దుష్యంత్ కంపెనీల్లో లలిత్ మోదీ పెట్టుబడులు
రూ.10 షేరుకు రూ.96,180; మొత్తం రూ.11.36 కోట్ల పెట్టుబడులు
అది తెలివైన వ్యాపార నిర్ణయమన్న బీజేపీ ఎంపీ దుష్యంత్
లలిత్ మోదీని భారత్ రప్పించాలని చిదంబరం డిమాండ్
ఆత్మరక్షణలో బీజేపీ.. మౌనాన్ని ఆశ్రయించిన పార్టీ నేతలు

న్యూఢిల్లీ: ఐపీఎల్ మాజీ కమిషనర్, మనీ ల్యాండరింగ్ సహా పలు కేసుల్లో నిందితుడుగా పరారీలో ఉన్న లలిత్ మోదీ వ్యవహారం రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది.

విదేశాంగ మంత్రి  సుష్మా స్వరాజ్, రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజేల తరువాత ‘మోదీగేట్’లో తాజాగా తెరపైకి వచ్చిన మరో పేరు దుష్యంత్ సింగ్. వసుంధర రాజే తనయుడైన దుష్యంత్‌కు చెందిన కంపెనీ ‘నియంత్ హెరిటేజ్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్’లో 2008లో లలిత్ మోదీ రూ. 11.63 కోట్లు పెట్టుబడిగా పెట్టిన విషయం బుధవారం వెలుగులోకి వచ్చింది. వాటిలో రూ. 3.8 కోట్లు రుణం కాగా, మిగతా మొత్తాన్ని 815 షేర్ల కొనుగోలుకు వెచ్చించారు. ఈ లావాదేవీలో రూ. 10 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు అసాధారణ రీతిలో రూ. 96,180ల భారీమొత్తం చెల్లించారు. లలిత్ ఆర్థిక అవకతవకలపై  ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్(ఈడీ) జరుపుతున్న దర్యాప్తులో ఈ విషయం వెల్లడైంది. దుష్యంత్ ప్రస్తుతం బీజేపీ ఎంపీ. దీనిపై ప్రశ్నించగా.. ఆ షేర్ల కొనుగోలు కంపెనీ విలువను, భవిష్యత్ వృద్ధి సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకున్న తెలివైన వ్యాపార నిర్ణయమంటూ దుష్యంత్ స్పందించారు.
 
ఆ లేఖలు బయటపెట్టాలి: చిదంబరం
లలిత్ కేసుకు సంబంధించి బ్రిటన్ అధికారులకు యూపీఏ ప్రభుత్వం రాసిన అన్ని లేఖలను బహిర్గతం చేయాలని మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ నేత పి.చిదంబరం డిమాండ్ చేశారు. తనపై, కాంగ్రెస్‌పై, యూపీఏపై లలిత్ చేస్తున్న ఆరోపణలకు ఆ లేఖలే సమాధానమిస్తాయన్నారు. ఆయనను భారత్ రప్పించి, ఈడీ సహా దర్యాప్తు సంస్థల విచారణకు హాజరయ్యేలా చూడాలని కేంద్రానికి సూచించారు. లలిత్ మోదీ బ్రిటన్ ట్రావెల్ డాక్యుమెంట్స్ పొందేందుకు సుష్మా స్వరాజ్ సహకరించడం కచ్చితంగా నిబంధనల ఉల్లంఘన, ఆశ్రీత పక్షపాతమేనని వ్యాఖ్యానించారు.

లలిత్‌పై అనుసరిస్తున్న తీరుకు సంబంధించి ప్రభుత్వానికి చిదంబరం ఏడు ప్రశ్నలు సంధించారు. ఐపీఎల్ స్కామ్ కారణంగా శశి థరూర్ కేంద్ర మంత్రి పదవి పోగొట్టుకోవడంతో కక్ష పెట్టుకున్న కాంగ్రెస్, నాటి మంత్రి చిదంబరం, యూపీఏ తనను లక్ష్యం చేసుకున్నారని మంగళవారం లలిత్ ఆరోపించడం తెలిసిందే. బ్రిటన్ ట్రావెల్ డాక్యుమెంట్స్ విషయంలో సుష్మ, యూకే ఇమిగ్రేషన్‌లో వసుంధర రాజే తనకు సహకరించారని ఆయన చెప్పారు.
 
ఇన్నాళ్లూ ఏం చేశారు?: ప్రభుత్వం
మోదీని వెనక్కు రప్పించాలన్న చిదంబరం డిమాండ్‌పై కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పందించారు ‘లలిత్‌పై రెడ్ కార్నర్, బ్లూ కార్నర్.. తదితర నోటీసులు జారీ అయి చాలా ఏళ్లే అయింది. అధికారం కోల్పోయాక చిదంబరం తెలివిమీరారు’ అని ఎద్దేవా చేశారు.
 
‘సుష్మ, రాజేలను బర్తరఫ్ చేయాలి’

ఆర్థిక నేరారోపణలు ఎదుర్కొంటున్న లలిత్ మోదీకి సాయం చేసిన సుష్మ, వసుంధర రాజేలను తక్షణం బర్తరఫ్ చేయాలని కాంగ్రె్ ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా డిమాండ్ చేశారు. ఈ అంశంపై ప్రధాని కుట్రపూరిత మౌనాన్ని పాటిస్తున్నారని ఆరోపించారు. రాజే రాజీనామాను కోరుతూ గురువారం రాజస్తాన్ నుంచి ఆందోళన చేపడతామన్నారు.  సుష్మ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు కనుక, ఈ ఇద్దరిపై అవినీతి నిరోధక చట్టం కింద వెంటనే విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.

సుష్మ, రాజేలు రాజీనామా చేయాలని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి కూడా డిమాండ్ చేశారు. కాగా వసుంధర రాజేపై వచ్చిన ఆరోపణలపై బీజేపీ నేతలు ఆత్మరక్షణలో పడ్డారు. ఈ వ్యవహారంపై ఆ పార్టీ నేతలెవరూ స్పందించలేదు. మరోపక్క.. ఈ మేలో లండన్‌లో లలిత్‌ను కలిసినప్పుడు భారత్‌కు తిరిగివచ్చి విచారణను ఎదుర్కోవాలని సూచించానని ఎన్సీపీ నేత శరద్ పవార్ చెప్పారు. తన ప్రాణాలకు ముప్పు ఉన్నందున భారత్ రాలేనని లలిత్ చెప్పారన్నారు.
 
అమిత్‌షాకు వసుంధర వివరణ
న్యూఢిల్లీ: ‘మోదీగేట్’లో తన పేరు కూడా చేరిన నేపథ్యంలో.. రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధరరాజే బుధవారం బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాకు ఫోన్‌చేసి వివరణ ఇచ్చారు. బ్రిటన్‌లో తాను చేసుకున్న విదేశీ ప్రయాణ దరఖాస్తుకు వసుంధర మద్దతు ఇచ్చారని ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్‌మోదీ పేర్కొనటంపై తన వైఖరిని ఆమె అమిత్‌షాకు వివరణ ఇచ్చారని.. లలిత్‌మోదీతో తమకు కుటుంబ సంబంధాలు ఉన్నాయని, ఈ విషయంలో తాను ఎలాంటి తప్పూ చేయలేదని ఆమె వివరించారని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే.. మీడియాలో ప్రచారం జరుగుతున్న పత్రాల గురించి తనకు తెలియదని ఆమె పేర్కొన్నట్లు ఆ వర్గాలు చెప్పాయి.
 
ఈడీ దర్యాప్తు ముమ్మరం: కాగా, లలిత్‌మోదీ సంస్థకు సంబంధించిన ఫెమా (విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం) ఉల్లంఘన కేసుపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్(ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. మారిషస్ కేంద్రంగా ఉన్న ఒక సంస్థ నుంచి లలిత్ డెరైక్టర్‌గా ఉన్న సంస్థలోకి రూ. 21 కోట్లను అక్రమంగా తరలించారన్న ఆరోపణలపై ఈడీ గత అక్టోబర్‌లో దర్యాప్తు చేపట్టింది.
 
వివాదం ఇదీ...
లలిత్ మోదీ.. మోదీ ఎంటర్‌ప్రైజెస్ సీఎండీ.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొలి చైర్మన్‌గా, బీసీసీఐ ఉపాధ్యక్షుడిగా.. రకరకాలుగా భారత క్రికెట్ రంగంతో పెనవేసుకుపోయిన వ్యక్తి.. తాజాగా రాజకీయ సంచలనమయ్యాడు.  ఆయన  2010లో ఐపీఎల్ బిడ్డింగ్‌లో, రెండు కొత్త టీంల ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. పుణె, కొచ్చి టీంలకు కొత్త ఫ్రాంచైజీలు ప్రకటించారు. అదే సమయంలో కొచ్చి టీం భాగస్వాములు ఒప్పందాలను ఉల్లంఘించారని లలిత్  ట్వీట్ చేయటంతో అప్పటి  కేంద్ర మంత్రి శశిథరూర్ తన పదవికి రాజీనామా చేశారు. తర్వాత కొద్దికాలానికే 22 ఆరోపణలపై లలిత్ ఐపీఎల్ చైర్మన్ పదవి నుంచి సస్పెండ్ అయ్యారు. రూ. 425 కోట్ల  అక్రమాల కేసులో ఈడీ  ఆయనపై కేసు నమోదు చేసింది. అప్పుడే లలిత్ లండన్ పారిపోయారు.

బ్రిటన్ ఇమిగ్రేషన్‌లో రాజస్థాన్ సీఎం వసుంధర రాజే సాయం పొందారు. విచారణకు భారత్‌కు రమ్మని సమన్లు పంపించినా ప్రాణానికి ముప్పుందంటూ రాలేదు. భారత్ అతని పాస్‌పోర్ట్‌ను రద్దు చేసినా తమ దేశంలో ఉండొచ్చని బ్రిటన్ తెలిపింది. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చాక లలిత్, తన భార్యకు కేన్సర్ చికిత్స కోసం పోర్చుగల్ వెళ్లేందుకు కుటుంబ స్నేహితురాలైన  సుష్మ సాయం పొందారు. పోర్చుగల్ వెళ్లేందుకు ట్రావెల్ డాక్యుమెంట్లు ఇప్పించాలని కోరగా సుష్మ బ్రిటన్  ఎంపీ కీత్‌వాజ్‌ను, భారత్‌లోని బ్రిటన్ హైకమిషనర్‌ను ‘మానవతా కోణం’లో పరిశీలించాలని కోరారు. 18 రోజుల్లోనే లలిత్ బ్రిటన్ అధికారుల నుంచి ట్రావెల్ డాక్యుమెంట్లను సంపాదించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement