
వెంకయ్య కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్: పార్టీ ఫిరాయింపులపై కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన వ్యక్తులు ఆ పార్టీతో వచ్చిన పదవులకు రాజీనామా చేయాలని ఆయన అన్నారు. ఈ మేరకు చట్టం తేవాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ఇందుకోసం అన్ని పార్టీలు కలిసి రావాలని సూచించారు. 2019 ఎన్నికల్లో తెలంగాణలో ఒంటరిగా పోటీ చేస్తామని తెలిపారు.
మతపరమైన రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. మత ఛాందసవాదశక్తులతో చేతులు కలపబోమని చెప్పారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కమ్యూనిస్టులు ఒక్క సీటు కూడా గెల్చుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ సింగిల్ మేన్ ఎంటర్ ప్రైజెస్ గా మారిందని దుయ్యబట్టారు. బీసీల కమిషన్ కు రాజ్యాంగ భద్రత కల్పిస్తూ మోదీ నిర్ణయం తీసుకున్నారని, ఇందుకు సంబంధించి త్వరలోనే పార్లమెంట్ లో బిల్లు పెడతామని వెల్లడించారు.
బీఎస్పీ, ఎంఐఎం, సమాజ్ వాదీ పార్టీలో యూపీఏలో భాగమన్నారు. ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారని, ప్రతిపక్షాలు ప్రభుత్వంతో కలిసి పని చేయాలని సూచించారు. అమాయకులకు శిక్ష పడరాదని, సత్యం బాబు కేసు విషయంలో పునః విచారణ చేపట్టాలని వెంకయ్య అభిప్రాయపడ్డారు.