
‘బొత్స’కు సమైక్య సెగ
రాష్ట్రం ముక్కలవుతున్నా మంత్రి బొత్స సత్యనారాయణ, ఆయన సతీమణి ఎంపీ ఝాన్సీ రాజీనామాలు చేయకపోవడంపై విజయనగరం వాసులు నిప్పులు చెరిగారు.
సాక్షి ప్రతినిధి, విజయనగరం : రాష్ట్రం ముక్కలవుతున్నా మంత్రి బొత్స సత్యనారాయణ, ఆయన సతీమణి ఎంపీ ఝాన్సీ రాజీనామాలు చేయకపోవడంపై విజయనగరం వాసులు నిప్పులు చెరిగారు. ఉదయం 5.30 గంటలకే ఆయన ఇంటిని ముట్టడిం చేందుకు యత్నించారు. ఈ సందర్భం గా పోలీసులకు, సమైక్యవాదులకు మధ్య తోపులాట జరిగింది. పలువురు ఆందోళనకారులు పట్టణంలోని బొత్సకు చెందిన సత్య కళాశాలపై రెండుసార్లు రాళ్లతో దాడిచేశారు. అదే మార్గంలో ఉన్న డీసీసీబీ కార్యాలయంలోని అద్దాలను, ఏసీలను ధ్వంసం చేశారు. అనంతరం మరోమారు బొత్స ఇంటి దగ్గరకు దూసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. ఘటన స్థలానికి చేరుకున్న ఎస్పీ కార్తికేయ ఆదేశం మేరకు ఆందోళనకారులపై 30రౌండ్లు బాష్పవాయువును ప్రయోగించారు.
దీంతో మరింత ఆగ్రహానికిలోనైన సమైక్యవాదులు పెద్దఎత్తున రాళ్లు రువ్వుతూ దాడి చేశారు. పట్టణంలోని మినర్వా థియేటర్‌లో పార్కింగ్ చేసి ఉన్న ఎస్పీ, ఏఎస్పీ, డీఎస్పీలకు చెందిన వాహనాలతో సహా మొత్తం ఆరు పోలీసు వాహనాల అద్దాలను ధ్వంసం చేశారు. అలాగే, బొత్సకు చెందిన సత్యకేబుల్ చానల్ కార్యాలయాన్ని, ఆయన బినామీలతో భాగస్వామ్యం ఉన్న మద్యం దుకాణాలనూ ధ్వంసం చేశారు. చీపురుపల్లి నియోజకవర్గం గరివిడిలో బొత్స క్యాంపు కార్యాలయంపై సమైక్యవాదులు రాళ్ల వర్షం కురిపించారు. సాలూరులో కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి నిప్పుపెట్టగా.. విజయనగరంలో ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదుట ఉన్న కాంగ్రెస్ దీక్షా శిబిరాన్ని ధ్వంసం చేసి, టెంట్‌ను తగులబెట్టారు.
మంత్రి శత్రుచర్ల ఇంటిపై రాళ్ల దాడి : పార్వతీపురంలో మంత్రి శత్రుచర్ల విజయరామరాజు ఇంటిపై రాళ్లురువ్వడంతో ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాయి.