మోడల్ మృతి; హీరో విక్రమ్‌పై తీవ్ర అభియోగం
కోల్‌కతా: యువ హీరో విక్రమ్ ఛటర్జీ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయాడు. మోడల్, నటి సోనికా చౌహాన్ మృతి కేసులో పోలీసులు ఆయనపై తీవ్ర అభియోగాలు మోపారు. అవి నిరూపణఅయితే విక్రమ్‌కు కనీసం 10 ఏళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉంటుంది.
సంచలనం రేపిన ఈ కేసులో విక్రమ్‌పై తొలుత ర్యాష్ డ్రైవింగ్ అభియోగం మాత్రమే ఉండేది. కానీ దర్యాప్తులో మరిన్ని విషయాలు వెలుగు చూడటంతో అతనిపై ఐపీసీ సెక్షన్ 304(శిక్షార్హ నరహత్య) అభియోగం నమోదయింది. ఈ మేరకు కోల్‌కతా పోలీసులు మంగళవారం ఒక ప్రకటన విడుదలచేశారు.
ఏప్రిల్ 29న కోల్‌కతాలో బెంగాలీ హీరో విక్రమ్- నటి, టీవీ హోస్ట్, మోడల్ సోనికాలు ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో ఆమె స్పాట్‌లోనే చనిపోయింది. తలకు గాయాలైన విక్రమ్‌ను స్థానికులు ఆస్పత్రిలో చేర్పించారు. ప్రమాద సమయంలో కారులో మద్యం ఉన్నా తాను తాగలేదని విక్రమ్ పోలీసులకు వాగ్మూలం ఇచ్చాడు. కానీ పబ్‌లోనే అతను మద్యం సేవించినట్లు ద్యాప్తులో తేలింది. కారును వేగంగా నడిపిన విక్రమ్.. ఉద్దేశపూర్వకంగా సోనికాను హత్యచేయనప్పటికీ, ఆమె మరణానికి కారకుడని తేలింది. దీంతో పోలీసులు అతనిపై ఐసీసీ సెక్షన్ 304 అభియోగాన్ని నమోదుచేశారు.