గోరక్షణ పేరుతో హింస వద్దు: భగవత్
న్యూఢిల్లీ: గోరక్షణ పేరుతో హింసకు పాల్పడడం సమర్థనీయం కాదని ఆరెస్సెస్ అధ్యక్షుడు మోహన్ భగవత్ అన్నారు. దేశంలో గోవధను నిషేధిస్తూ చట్టం తేవాలని తాము కోరుకుంటున్నట్టు చెప్పారు. 'గోరక్షణ పేరుతో ఎటువంటి హింసకు దిగినా మన లక్ష్యానికి చెడ్డపేరు వస్తుంది. చట్టాన్ని తప్పనిసరిగా పాటించాల'ని ఆయన అన్నారు. గోరక్షణ పేరుతో దాడులు పెరిగిపోవడంతో భగవత్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
రాజస్థాన్ లోని అల్వార్ జిల్లాలో పెహ్లు ఖాన్(55) అనే రైతును గోరక్షకులు హత్య చేయడంతో ఆందోళనలు రేగాయి. బీజేపీ పాలిత రాష్ట్రం రాజస్థాన్ లో రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందని విపక్షాలు పెద్ద ఎత్తున ధ్వజమెత్తాయి. మరోవైపు రాష్ట్రపతి అభ్యర్థిగా భగవత్ పేరును ఇటీవల శివసేన తెరపైకి తెచ్చింది. అయితే రాష్ట్రపతి ఎన్నిక రేసులో తాను లేనని భగవత్ ప్రకటించారు.