ఎదురుతిరిగిన ఎమ్మెల్యేలు.. రంగంలోకి శశి!
చెన్నై: అధికార అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఉన్న గోల్డెన్ బే రిసార్ట్ వేదికగా తమిళనాడు రాజకీయాలు సాగుతున్నాయి. ఈ రిసార్ట్‌లో తనిఖీ చేసిన అధికారులు.. ఇక్కడ కేవలం 90మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నట్టు తేల్చారు. ఈ 90 మందిలోనూ 20 మంది ఎమ్మెల్యేలు శశికళకు ఎదురుతిరుగుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే అధినేత్రి వీకే శశికళ.. ఈ అసంతృప్త ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు నేరుగా రంగంలోకి దిగారు. ముగ్గురు మంత్రులను వెంటపెట్టుకొని పోయెస్ గార్డెన్ నుంచి బయలుదేరిన చిన్నమ్మ రిసార్ట్‌కు చేరుకున్నారు.
తనకు అండగా ఉన్న ఎమ్మెల్యేలతోపాటు, అసంతృప్త నేతలతో కూడా ఆమె భేటీ అయ్యారు. ఎదురుతిరిగిన 20 మంది ఎమ్మెల్యేలను ప్రధానంగా బుజ్జగించేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. పన్నీర్ సెల్వానికి మద్దతు ఇస్తామంటూ మొండికేస్తున్న ఎమ్మెల్యేలను దారిలోకి తెచ్చుకునేందుకు శశికళ ఇక్కడికి వచ్చారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ రిసార్ట్ నుంచి ఆమె ఎమ్మెల్యేలతో కలిసి నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లాలని భావిస్తున్నారని, అక్కడ ఎమ్మెల్యేలతో పరేడ్ చేయించి.. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశాన్ని కల్పించాలని గవర్నర్‌ను కోరనున్నారని సమాచారం. తనకు ప్రజా వ్యతిరేకత, పన్నీర్ సెల్వానికి పెరుగుతున్న మద్దతు నేపథ్యంలో మధ్యేమార్గంగా సీఎం అభ్యర్థిగా కొత్త పేరు శశివర్గం తెరపైకి తేవొచ్చునని, నిన్న అన్నాడీఎంకే ప్రీసిడియం చైర్మన్‌గా ఎన్నికైన సెంగొట్టాయన్‌ను సీఎంగా ముందుకు తెచ్చే అవకాశముందని వినిపిస్తోంది.
ముఖ్యమంత్రి పదవి కోసం శశికళ, పన్నీర్ సెల్వం వర్గాలు ప్రస్తుతం హోరాహోరీగా తలపడుతున్న సంగతి తెలిసిందే. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకొనేందుకు ఇద్దరు ఎత్తులు, పైఎత్తులు వేస్తుండటంతో తమిళనాట రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి.