ఎమ్మెల్యేలకు శశికళ ఉద్వేగభరిత విజ్ఞప్తి!
చెన్నై: ఒకవైపు ఉక్కిరిబిక్కిరి చేస్తున్న పన్నీర్ సెల్వం వర్గం. ఒక్కొక్కరుగా జారుకుంటున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు. మరోవైపు సహకరించిన కేంద్ర ప్రభుత్వం, గవర్నర్. అయినా తన మాట నెగ్గించుకోవాలన్న పంతం. తాను ముఖ్యమంత్రి అయి తీరాలన్న పట్టుదల.. ఈ పరిణామాల అన్నింటి నడుమ చిన్నమ్మ శశికళ శనివారం గోల్డెన్ బే రిసార్ట్‌లో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. వారితో మాట్లాడుతూ ఉద్వేగానికి లోనయ్యారు. ఎమ్మెల్యేలను నిర్బంధించి తనవైపు తిప్పుకుంటానన్న ఆరోపణలను ఆమె కొట్టిపారేశారు. ఎమ్మెల్యేల నిర్బంధం ఆరోపణలు అవాస్తవనమి పేర్కొన్నారు. ఈ రిసార్ట్‌లో తనకు మద్దతుగా ఎమ్మెల్యేల క్యాంపు రాజకీయాన్ని శశికళ నడుపుతున్న సంగతి తెలిసిందే.
గోల్డెన్ బే రిసార్ట్‌లో దాదాపు 90 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో 20 మంది ఎదురుతిరిగారని, వారు ఏక్షణమైనా పన్నీర్ సెల్వం గూటిలో చేరేందుకుసిద్ధంగా ఉన్నారని కథనాలు గుప్పమంటున్న నేపథ్యంలో శశికళ ఇక్కడికి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అసంతృప్త ఎమ్మెల్యేలను బుజ్జగించే దారిలోకి తెచ్చుకునేందుకు ఆమె ఇక్కడికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇక్కడ చాలామంది అసంతృప్త ఎమ్మెల్యేలు ఉన్నారన్న వార్తలను ఖండించడానికి అన్నట్టు.. రిసార్ట్‌లో శశికళ, ఎమ్మెల్యేలతో కలిసిన ఫొటోలను విడుదల చేశారు. ఇక్కడి నుంచి నేరుగా చిన్నమ్మ జయలలిత సమాధి వద్దకు వెళుతారని, సమాధి వద్ద అమ్మకు నివాళులర్పించనున్నారని సమాచారం.