బ్లాక్‌మనీ యుద్ధం..జ్యువెలర్స్కు షాక్!
న్యూఢిల్లీ: ‘ఆపరేషన్ బ్లాక్ మనీ’ నల్లధనం కుబేరులగుండెల్లో గుబులు పుట్టిస్తోంది. రూ.1000, రూ.500 నోట్ల రద్దు ప్రకటనతో తమ నిధులను బంగారం కొనుగోళ్లపై మళ్ళిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అన్నివైపుల నుంచి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా నవంబరు 8 రాత్రి 8 గం.టల నుంచి సీసీటీవీ ఫుటేజీ సమర్పించాలంటూ జ్యువెల్లరీ షాపు యజమానులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. భారీ ఎత్తున అక్రమ నగదు లావాదేవీలు చోటు చేసుకుంటున్నాయన్న ఫిర్యాదులతో ఆర్థిక మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
పెద్ద నోట్ల రద్దుపై ప్రధాని మోదీ (నవంబరు 8) ప్రకటన రోజు రాత్రి రాజధాని నగరంలోని మూరుమూల షాపులతో సహా అన్ని ప్రముఖ నగల దుకాణాలన్నీ ఎక్కువసేపు తెరిచే వున్నాయనీ, పెద్ద మొత్తంలో బంగారు కొనుగోళ్లు జరిగాయన్నవార్తలో ప్రభుత్వం ఈ చర్యలకు దిగింది. ఒకే రోజు వివిధ నగల షాపులో ఒక వ్యక్తి ఎన్నిసార్లు షాపింగ్ చేశాడు. లేదా ఒకే కుటుంబంలోని పలువురు.. వివిధ నగల దుకాణాల్లో చేసిన షాపింగ్ తదితర వివరాలను పరిశీలిస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో పోలీసులు ఇలాంటి సమాచారాన్ని అందించినట్టు తెలుస్తోంది. అలాగే కొన్ని నగల వ్యాపారులపై ఇప్పటికే చర్యలు ప్రారంభమైనట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఐటీ అధికారులు పలు దుకాణాలపై దాడులు నిర్వహించారు. నల్లధనంతో బంగారం కొనుగోలు చేస్తున్నారనే ఫిర్యాదులు రావడంతో, ఐటీ అధికారులు అప్రమత్తమయ్యారు. సీబీడీటీ ఆదేశాలపై ఈ దాడులు నిర్వహించినట్టు అధికారులు వెల్లడించారు. ఢిల్లీలో కరోల్ బాగ్, దారిబా కలాన్, చాందినీ చౌక్, ముంబై జవేరీ బజార్ సహా మూడు ప్రముఖ వ్యాపార కేంద్రాలలో ఈ దాడులు నిర్వహించారు. చండీగఢ్, లుధియానా, అమృత్సర్, జలంధర్, కోలకతా, అహ్మదాబాద్ తదితర నగరాల్లో కూడా తనిఖీ చేశారు. ఈ దాడులు ఇంకా కొనసాగనున్నట్టు అధికారులు తెలిపారు. అక్రమ నగదు లావాదేవీలపై కఠిన చర్యలకు తమకు స్పష్టమైన ఆదేశాలందాయని స్పష్టం చేశారు.
కాగా అక్రమ పసిడి అమ్మకాల్లో బుధవారం పది గ్రా. పుత్తడి ధర రూ..35 వేల నుంచి మొదలై రూ.49 వేల దగ్గర ముగిసింది. ఇది గురువారం నాటికి మరింత ఎగిసి రూ.40 వేల దగ్గర ప్రారంభమై సుమారు 55 వేల రూపాయలు పలకడం కలకలం రేపింది. మరోవైపు బంగారు కొనుగోళ్లపై కచ్చితంగా ప్యాన్ కార్డు నమోదును తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే.