దేవయానికి ఊరట లభించే అవకాశం!
భారతీయ దౌత్యవేత్త దేవయాని ఖోబ్రగాదేకు ఐక్యరాజ్యసమితి గుర్తింపు విషయమై సమితి నుంచి వచ్చిన పత్రాలను అమెరికా సమీక్షిస్తోంది. ఐక్యరాజ్యసమితి నుంచి శుక్రవారం రాత్రి తమకు పత్రాలు అందాయని, వాటిని సమీక్షిస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే.. అందుకు ఎంత సమయం పడుతుందన్న విషయాన్ని చెప్పేందుకు మాత్రం ఆయన నిరాకరించారు.
పత్రాల సమీక్ష పూర్తయితే ఖోబ్రగాదేకు ఐక్యరాజ్యసమితి గుర్తింపు కార్డు ఇస్తారు. ఈనెల 12వ తేదీన న్యూయార్క్లో అరెస్టు చేసిన దేవయానీ ఖోబ్రగాదేను ఆ తర్వాత 2.50 లక్షల డాలర్ల పూచీకత్తుపై విడిచిపెట్టారు. ఆమె దౌత్య పాస్పోర్టును సమర్పించాలని కూడా ఆదేశించారు. ఆ తర్వాత భారత ప్రభుత్వం ఖోబ్రగాదేను ఐక్యరాజ్యసమితి శాశ్వత మిషన్కు బదిలీ చేసింది. దానివల్ల ఆమెకు దౌత్యపరమైన రక్షణ లభిస్తుంది. ఆమె బదిలీని ఐక్యరాజ్య సమితి ఆమోదించింది. ఈ మేరకు అవసరమైన పత్రాలను అమెరికా విదేశాంగ శాఖకు పంపింది.