చివరి వరకూ కాంగ్రెస్లోనే ఉంటా....
న్యూఢిల్లీ : సీమాంధ్రలో పార్టీ బలోపేతానికి కాంగ్రెస్ అధినాయకత్వం దృష్టి సారించింది. రాష్ట్ర విభజనపై ఆగ్రహంగా ఉన్న సీమాంధ్ర ప్రజలను శాంతింప చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా సీమాంధ్ర మంత్రులతో పార్టీ అధినేత్రి సోనియాగాంధీ బుధవారం ప్రత్యేకంగా భేటి అయ్యారు. ఈ సందర్భంగా మంత్రులకు సోనియా పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. భేటీ అనంతరం మంత్రి కొండ్రు మురళి మాట్లాడుతూ విభజన విషయంలో తమ సమస్యలను సోనియా సావధానంగా విని, సానుకూలంగా స్పందించారన్నారు. విభజన నిర్ణయం తీసుకున్న తర్వాత సీమాంధ్రలో పార్టీ కార్యకర్తలు నిస్తేజంగా ఉన్నారని, వారిలో ఉత్తేజం నింపాల్సిన అవసరం ఉందని తెలిపామన్నారు.
విభజన విషయంలో సీమాంధ్ర ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, 2014 ఎన్నికల్లో అన్ని సీట్లు గెలుచుకోలేమని సోనియాకు వివరించినట్లు కొండ్రు చెప్పారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కాకుండా ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. ఎన్నికలకు మరికొంత సమయం ఇస్తే మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉందని సోనియాకు తెలిపామన్నారు. తాను చివరివరకూ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని.... సోనియాగాంధీ, రాహుల్ నాయకత్వంలో పని చేయటం గర్వంగా ఉందని కొండ్రు పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి సీమాంధ్రలో పర్యటించాలన్న మంత్రుల సూచనకు సోనియా అంగీకరించరించినట్టు సమాచారం.