'అబ్బే.. అలాంటివారికి చోటివ్వం, సీట్లివ్వం'
లక్నో: ప్రజలను అవమానించేవారికి, వారిని బాధ పెట్టేవారికి తమ పార్టీలో చోటు ఉండదని, సీట్లు అంతకంటే ఇవ్వబోమని సమాజ్వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ అన్నారు. 2017లో ఉత్తరప్రదేశ్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలతోపాటు త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికలకు ఎలాంటి ఏర్పాట్లలో ఉన్నారో తెలియజేయాలంటూ పార్టీ నేతలను ప్రశ్నించారు.
'పంచాయతీ ఎన్నికల సీట్ల కోసం చాలా పెద్ద క్యూ ఉంది. అంతకంటే ముందు ఈ క్యూలో ఉన్నవారంతా తాము మంచివారిమని నిరూపించుకోవాలి. ఏ మచ్చ లేకుండా కనిపించాలి. ఎందుకంటే ఈ క్యూలో ఉన్నవారిలో కాంట్రాక్టర్లు, కమిషన్ ఏజెంట్లు ఉన్నారు. వీరంతా ప్రజలను అవమానించేవారే. ఇబ్బందులు పెట్టేవారే. అందుకే మేం వీరికి సీట్లు ఇవ్వం' అని ములాయం చెప్పారు. తమ పార్టీ, ప్రభుత్వంపై ఫీడ్ బ్యాక్లో సరైన స్పందన రాలేదని, ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం చేసే కార్యక్రమాలు నేతలు సమర్థంగా ప్రజల మధ్యకు తీసుకెళ్లాలని చెప్పారు. పంచాయతీ ఎన్నికలు ఉత్తరప్రదేశ్లో సెప్టెంబర్ 9, డిసెంబర్ 15న జరగనున్నాయి.