న్యూఢిల్లీ: కేంద్రంలోని మోదీ సర్కారు తమ ఏడాది పాలనలో సాధించిన విజయాలను ప్రసార మాధ్యమాల ద్వారా ఓవైపు ఏకరువు పెడుతుంటే మరోవైపు ప్రధాని కార్యాలయం (పీఎంవో) మాత్రం దీనిపై తమ వద్ద ఎటువంటి సమాచారం లేదంటూ చెప్పుకొచ్చింది. మోదీ ప్రభుత్వం ఏడాది పాలనలో సాధించిన 20 ముఖ్యమైన విజయాలను తెలియజేయాలంటూ సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద దాఖలైన ఓ దరఖాస్తుకు పీఎంవో ఈ మేరకు బదులిచ్చింది. ఆర్టీఐ కింద కోరిన సంబంధిత సమాచారం ఒకటికన్నా ఎక్కువ ప్రభుత్వ శాఖల పరిధిలో ఉన్నందున ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 6 (3) ప్రకారం దాన్ని ఇతర శాఖలకు బదిలీ చేయట్లేదని పీఎంవోలోని సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (సీపీఐవో) అంబుజ్ శర్మ ఆర్టీఐ దరఖాస్తుకు ఇచ్చిన సమాధానంలో పేర్కొన్నారు.
ఆర్టీఐ అమలు అధ్యయనంపై ఫెలోషిప్
దేశవ్యాప్తంగా ప్రత్యేకించి మారుమూల ప్రాంతాల్లో సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) అమలవుతున్న తీరుపై అధ్యయనం చేసేందుకు జర్నలిజం, ఎన్జీవో రంగాలకు చెందిన వారి సేవలను వినియోగించుకోవాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం మూడు నెలల ఫెలోషిప్‌ను ప్రవేశపెట్టనుంది. 25 ఏళ్ల నుంచి 40 ఏళ్లలోపు వయసుగల జర్నలిస్టులు, ఆర్టీఐకి సంబంధించిన పౌర సమాజ సంఘాల సభ్యులు, పరిశోధకులు, ఆర్టీఐ శిక్షకులెవరైనా ఈ ఆర్టీఐ ఫెలోషిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.
గతంలో న్యాయవాద నేపథ్యం ఉన్న వారికే ఆర్టీఐ ఫెలోషిప్‌లను పరిమితం చేసేవారు. ఈ ఫెలోషిప్‌కు ఎంపికైన వారు ఆర్టీఐ నిబంధనల అమలు, సమాచార వెల్లడి మార్గదర్శకాలు, ఒక్కో రంగంలో అమలవుతున్న అత్యుత్తమ ఆచరణ విధానాల గురించి అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఈ ఫెలోషిప్‌కు ఎంపికైన వారికి మొత్తం రూ. 2 లక్షల స్టైపెండ్ అందుతుంది. కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల మంత్రిత్వశాఖ (డీవోపీటీ)కు దరఖాస్తు పంపాల్సిన చివరి తేదీ జూన్ 22.
సమాచారం లేదు!
Published Sat, Jun 6 2015 3:01 AM | Last Updated on Fri, Aug 24 2018 1:52 PM
Advertisement
Advertisement