ప్రధాని వెంటే.. | we support PM Modi: CM KCR on demonetisation | Sakshi
Sakshi News home page

ప్రధాని వెంటే..

Published Sat, Dec 17 2016 2:45 AM | Last Updated on Wed, Aug 15 2018 6:32 PM

ప్రధాని వెంటే.. - Sakshi

ప్రధాని వెంటే..

- నోట్ల రద్దును స్వాగతిస్తున్నాం: సీఎం కేసీఆర్‌
- ‘రద్దు’ అసాధారణ నిర్ణయం.. ప్రజలను భయోత్పాతానికి గురిచేయొద్దు
- అన్ని రకాల నల్లధనాన్ని కట్టడి చేయాలి
- మోదీ అమాయకుడేం కాదు
- ఆయన ఆశించిన లక్ష్యాలు నెరవేరితే అద్భుతాలే
- వ్యక్తిగతంగా నాకేం లాభం లేదు.. రహస్య ఒప్పందమేమీ లేదు
- జనం ఇబ్బందులు నిజమే.. క్యాష్‌లెస్‌ లావాదేవీలు అనివార్యం
- 31 తర్వాత రాష్ట్రమంతటా ఉద్యమంలా నగదు రహిత లావాదేవీలు
- చిన్న నోట్లు పంపాలని కోరాం.. ప్రధానికి సలహాలు, సూచనలు అందిస్తా
- అసెంబ్లీలో నోట్ల రద్దుపై చర్చలో సీఎం


సాక్షి, హైదరాబాద్‌:
దేశ ప్రయోజనాల కోసం పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం మనస్ఫూర్తిగా స్వాగతిస్తోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. అన్ని రూపాల్లో ఉన్న నల్లధనాన్ని నిర్మూలించే దిశగా కేంద్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపడుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. కరెన్సీ రూపంలోనే కాకుండా.. వజ్రాలు, బంగారం నిల్వలు, షేర్లు, విదేశీ కరెన్సీ, క్రోనీ క్యాపిటలిజం (ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం), బ్రిటిష్‌ వర్జిన్‌ ఐలాండ్స్, మారిషస్, సింగపూర్‌ దేశాల నుంచి మనీ ల్యాండరింగ్‌ ద్వారా వచ్చే నల్లధనాన్ని పూర్తిగా కట్టడి చేయాలని సూచించారు.

పూర్ణక్రాంతిని సాధించేంత వరకు ఈ ప్రక్రియ కొనసాగితే ఆశించిన లక్ష్యాలు నెరవేరుతాయన్నారు. ఈ నిర్ణయం అమల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం, ఆర్‌బీఐతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోందన్నారు. ‘పెద్ద నోట్ల రద్దు–రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ప్రభావం’ అంశంపై అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో తొలిరోజైన శుక్రవారం జరిగిన లఘు చర్చను ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం విపక్ష నేతలు లేవనెత్తిన పలు అంశాలకు సమాధానం ఇచ్చారు. సీఎం ఏమన్నారో ఆయన మాటల్లోనే..

అద్భుతాలు జరుగుతాయి
ఒక్కసారిగా 86 శాతం పెద్ద నోట్ల చెలామణి ఆగిపోతే అన్ని రాష్ట్రాలకు ఉండే ఇబ్బందే తెలంగాణకు ఉత్పన్నమైంది. దేశంతో పాటు అన్ని రాష్ట్రాల ఆదాయం తగ్గిపోయింది. పట్టణ ప్రాంతాలు ఎక్కువగా ఉన్నందున ఈ ప్రభావం కర్ణాటకతోపాటు తెలంగాణకు కొంత తక్కువే. నగదు రహిత లావాదేవీల నిర్వహణలో దేశంలో గుజరాత్‌ తర్వాత మన రాష్ట్రమే ఉంది. నోట్ల రద్దు అసాధారణ నిర్ణయం. ప్రజలకు కష్టాలుంటాయి. కానీ ప్రధాని యాభై రోజుల సమయం అడిగారు. ఆయనేం అమాయకుడు కాదు. మూడు సార్లు సీఎంగా పనిచేసి ఇప్పుడు ప్రధానిగా ఉన్నారు. ప్రజలకు కష్టనష్టాలు పెట్టాలని తీసుకున్న నిర్ణయం కాదని నాతో చెప్పారు. మనం విశ్వసించాలి. అంత గొప్ప మార్పు జరిగేటప్పుడు అంతా సంపూర్ణంగా సహకరించాలి. ప్రధాని ఆశించిన లక్ష్యాలు నెరవేరితే అద్భుతాలు జరుగుతాయి. చిన్న స్కీం పెడితేనే పైరవీకారులు పుట్టుకొస్తున్నారు. రేషన్‌ కార్డులు మొదలు ఇళ్ల నిర్మాణంలో కుంభకోణాలు జరుగుతున్నాయి. ఉన్నోడికే ఉంటోంది. లేనోడు లేకనే పోతుండు. ప్రధాని అమాయకంగా ఈ నిర్ణయం తీసుకోలేదు. మార్పును స్వాగతించాలి. వ్యక్తిగతంగా నాకేం లాభాలు లేవు. రహస్య ఒప్పందమేమీ లేదు.

ప్రజల్లో భయోత్పాతం సృష్టించొద్దు..
నోట్ల రద్దుపై ప్రజల్లో భయోత్పాతం సృష్టించవద్దు. నిర్ణయం మన పరిధిలో లేనందున అనుసరించటం తప్ప గత్యంతరం లేదు. పెద్దనోట్ల రద్దు ప్రభావం రాష్ట్రంపైనా కొంతమేర ఉంటుంది. రెవెన్యూ తగ్గిపోతుంది. ఆదాయం పడిపోకుండా ఉండాలంటే ఎంత తొందరగా ప్రజలను నగదు రహిత లావాదేవీల దిశగా మళ్లిస్తే అంత ఆదాయం పెరుగుతుంది. ప్రపంచంలో ఎక్కడా నూటికి నూరు శాతం నగదు రహిత లావాదేవీలు సాధ్యం కాదు. బ్రస్సెల్స్‌లో 83 శాతం, అమెరికాలాంటి దేశాల్లో 75 శాతం అమలవుతోంది. 90 శాతం లక్ష్య సాధన దిశగా తెలంగాణ పురోగమిస్తుంది.

బంగారు కడ్డీలుంటే లాక్కోవాల్సిందే
అన్ని రకాల నల్లధనాన్ని నిర్మూలించేంత వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని ప్రధాని మాటల్లో నాకు అర్థమైంది. చేతికి ఉన్న బంగారు రింగులు, ఆభరణాలను తీసుకుంటారనేది అపోహ. కానీ బంగారు కడ్డీలు, బిస్కెట్లు, వజ్రాలు నిల్వ చేసుకున్న వారి నుంచి తప్పనిసరిగా లాక్కోవాల్సిందే. నగదు రహితం అంటే స్వైపింగ్‌ మిషన్లపై ఆధారపడడం కాదు. దాదాపు 51కి పైగా మొబైల్‌ అప్లికేషన్లు అందుబాటులో ఉన్నాయి. స్వైపింగ్‌ మిషన్లను ప్రభుత్వం సరఫరా చేయదు. బ్యాంకులే అందజేస్తాయి. దేశంలో ప్రస్తుతం 15 లక్షల స్వైపింగ్‌ మిషన్లుంటే పది కోట్ల డిమాండ్‌ ఉంది. వాటిపై డ్యూటీ ఎత్తివేయాలని ఇటీవల ప్రధానిని కోరితే మాఫీ చేశారు. త్వరలో ‘గోమొబైల్‌’ నినాదం రాబోతోంది.

31 తర్వాత నగదు రహిత ఉద్యమం
నగదు రహిత లావాదేవీలపై డిసెంబర్‌ 31 తర్వాత తెలంగాణ అంతటా ఉద్యమ స్ఫూర్తితో కార్యక్రమాలు చేపడతాం. చదువుకున్న ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాములు కావాలి. ప్రజలకు డిజిటల్‌ లావాదేవీలపై అవగాహన పెంచాలి. నగదు రహిత లావాదేవీల భద్రతపై అనుమానాలు వద్దు. నేరాలు ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. సైబర్‌ నేరాలు జరుగతాయనే కోణంలో ఈ అంశాన్ని ముడిపెట్టవద్దు. ప్రజల కష్టాలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్రానికి సరిపడేన్ని చిన్న నోట్లు రావాల్సి ఉంది. ఎక్కువ నగదు రావాలి. రైతులు, చిన్న వ్యాపారులు, దినసరి కూలీలు, కార్మికుల ఇబ్బందులు తొలిగిపోవాలి. విద్యార్థులు, యువకులు, న్యాయవాదులు, డాక్టర్లు, విద్యావంతులందరూ కథానాయకులు కావాలి. కొవ్వొత్తితో మరో కొవ్వొత్తి వెలిగించాలి. లేకుంటే మొత్తం క్రాంతి రాదు. కేంద్రం నిర్ణయానికి సహకరిస్తున్నామని తప్పుగా అర్థం చేసుకోవద్దు.. నాకేం వ్యక్తిగత లాభాలు, రహస్య ఒప్పందాలు లేవు.

పెద్దగా ప్రభావం లేదు
రాష్ట్రంపై నోట్ల రద్దు ప్రభావం ఊహించినంత పెద్దగా లేదు. రిజిస్ట్రేషన్ల ఆదాయం రోజుకు రూ.16 కోట్లు రావాల్సి ఉంటే.. రూ.11 కోట్లు వస్తోంది. ఎక్సైజ్‌ ఆదాయం కొంతమేరకు తగ్గింది. ఈ తరహా నష్టాలను పూడ్చేందుకు స్వచ్ఛంద ఆదాయ పన్ను వెల్లడి పథకంలో కేంద్రానికి వచ్చిన రూ.27 వేల కోట్లను రాష్ట్రాలకు పంచాలని ప్రధానికి సూచించాను. వీటితో పాటు నవరత్న కంపెనీలు, ప్రభుత్వ రంగ సంస్థల పెట్టుబడుల ఉపసంహరణతో వచ్చిన వాటాలను పంచాలని కోరాను.

ఇబ్రహీంపూర్, సిద్దిపేట ఆదర్శం
పెద్ద నోట్ల రద్దు తర్వాత రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గాడి తప్పకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. వెంటనే నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే చర్యలు ప్రారంభించింది. నగదు రహిత లావాదేవీల్లో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా ఉంది. ప్రయోగాత్మకంగా సిద్దిపేట నియోజక వర్గాన్ని నగదు రహిత నియోజకవర్గంగా, అదే నియోజకవర్గంలోని ఇబ్రహీంపూర్‌ గ్రామాన్ని నగదు రహిత గ్రామంగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రతీ జిల్లాలో కొన్ని గ్రామాలను ఇదే తీరుగా తయారు చేసేందుకు కలెక్టర్లు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. విధానపరమైన నిర్ణయాలకు ప్రభుత్వం కేబినెట్‌ సబ్‌ కమిటీ వేసింది. అమలును వేగవంతం చేసేందుకు టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ప్రజల్లో విశ్వాసం కలిగించేందుకు ప్రభుత్వం తరఫున టీ వ్యాలెట్‌ తయారవుతోంది. ఆర్‌బీఐ లెక్కల ప్రకారం ఇప్పటి దాకా మన రాష్ట్రానికి వచ్చిన నగదు రూ.19,109 కోట్లు. బ్యాంకులలో ప్రజలు డిపాజిట్‌ చేసిన మొత్తం రూ.57,479  కోట్లు.

విమర్శించే అధికారం మనకు లేదు
కేంద్రాన్ని. ప్రధానిని విమర్శించే అధికారం మనకు లేదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పలుమార్లు సభలో ప్రస్తావించారు. విపక్ష నేతలు కేంద్రం నిర్ణయాన్ని తప్పు పట్టే ప్రయత్నం చేసినప్పుడల్లా సీఎం అడ్డుకున్నారు. ‘‘నోట్ల రద్దు నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది కాదు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని చర్చించటం మన పరిధిలో లేని అంశం. ఇది అసెంబ్లీలో జరగాల్సిన చర్చ కాదు. కేంద్రాన్ని, ప్రధానిని విమర్శించే అధికారం మనకు లేదు. సభా గౌరవాన్ని భంగపరిచినట్లవుతుంది. ప్రజలు పడుతున్న ఇబ్బందులు, రాష్ట్రంపై పడే ప్రభావానికే ఈ చర్చ పరిమితం కావాలి. ప్రధాని నిర్ణయంతో దేశానికి మంచి జరుగుతుందని, రాష్ట్ర ప్రభుత్వం ఆయన నిర్ణయానికి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. సభలో వచ్చే సూచనలు, సలహాలు ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్తా.. ’’ అని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement