
దూసుకొస్తోంది.. 5జీ!
రెప్పపాటులో సినిమా డౌన్‌లోడ్ అయిపోతుంది...
రెప్పపాటులో సినిమా డౌన్‌లోడ్ అయిపోతుంది. వాయిస్, వీడియో కాల్స్ చేస్తే ఒక్క సెకను కూడా అంతరాయం కలగదు. మొబైల్‌ఫోన్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లు.. డివైస్ ఏదైనా సరే.. ఇలా బటన్ నొక్కి కమాండ్ ఇచ్చేలోపే అలా సమాచారం ప్రత్యక్షమైపోతుంది. కొత్త తరం టెలికమ్యూనికేషన్స్ టెక్నాలజీ ‘5జీ’ రాకతో ఇవన్నీ సాధ్యం కానున్నాయి! మరో సమాచార విప్లవాన్ని సాకారం చేయనున్న ఈ 5జీ టెక్నాలజీకి ప్రముఖ కంపెనీ నోకియా నాంది పలికింది.
బోస్టన్‌లో జరిగిన ‘బ్రూక్లిన్ 5జీ వార్షిక సదస్సు’లో 5జీ టెక్నాలజీని ఆవిష్కరించింది.
5జీతో మనకేంటి..?
⇒ మొబైల్‌ఫోన్ సేవలు 4జీ కన్నా 40 రెట్లు వేగంగా అందుతాయి
⇒ 4జీ వేగం 42 ఎంబీపీఎస్ కాగా, 5జీ వేగం సెకనుకు 10 గిగాబిట్స్
⇒ ఫుల్‌లెంగ్త్ హెచ్‌డీ సినిమాను ఒక్క సెకనులోనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
⇒ వీడియోలు, ఫొటోలు, ఫోన్‌కాల్స్ ఇప్పటి కన్నా 16 రెట్లు స్పష్టంగా
అందుతాయి
⇒ మొబైల్‌ఫోన్, ఇంటర్‌నెట్ సేవల ప్రసారంలో విరామం 4జీ నెట్‌వర్క్‌లో 60 మిల్లీ సెకన్లు. 5జీ నెట్‌వర్క్‌లో ఈ విరామం దాదాపుగా జీరో సెకన్లు
⇒ 5జీ రాకతో టెలీకమ్యూనికేషన్స్‌లో సమూల మార్పులు వస్తాయి
5జీ అంటే..?
ఫిఫ్త్ జనరేషన్ మొబైల్‌ఫోన్ టెక్నాలజీ. మొబైల్‌ఫోన్, ఇంటర్నెట్ సేవలు అందించే ఐదో తరం నెట్‌వర్క్ టెక్నాలజీ అన్నమాట. కొంచెం వివరంగా చూస్తే.. మొబైల్‌ఫోన్ నెట్‌వర్క్ టెక్నాలజీ సుమారుగా ప్రతి పదేళ్లకోసారి సమూలంగా మారిపోతోంది. తొలుత 1980వ దశకంలో మొదటి తరం(1జీ) టెక్నాలజీ ఆధారంగా మొబైల్‌ఫోన్ సేవలు అందాయి. తర్వాత 1990వ దశకంలో రెండో తరం(2జీ), 2000 నుంచి మూడోతరం (3జీ), 2004 నుంచి నాలుగో తరం(4జీ)
టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. తరం మారుతున్న కొద్దీ నెట్‌వర్క్ సేవలు అనూహ్యంగా వేగం పుంజుకున్నాయి. ప్రస్తుతం అత్యధిక వేగంగా పనిచేసే 4జీ నెట్‌వర్క్ 1800 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీలో పనిచేస్తుంది. ఇది ఇప్పటికీ నగరాలకు మాత్రమే పరిమితం అయింది. అయితే, 5జీ నెట్‌వర్క్‌లో సిగ్నళ్లు 73,000 మెగా హెర్ట్జ్ హైఫ్రీక్వెన్సీలో ప్రసారమవుతాయి. 5జీ సిగ్నళ్లను వాడుకోవాలంటే మొబైల్‌ఫోన్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లకు కొత్త సాంకేతిక మార్పులు తప్పనిసరి. కొత్త వైఫైలు, రిసీవ ర్లు, కొత్త మొబైల్‌ఫోన్ టవర్లు కూడా అవసరం. అందుకే.. 5జీ సేవలు అందుబాటులోకి రావడానికి మరో ఐదేళ్లు పట్టవచ్చని అంచనా.