
ఇక వేలిముద్రతో నగదు రహిత చెల్లింపులు
న్యూఢిల్లీ: ఇక నగదు రహిత లావాదేవీలకు డిబెట్ కార్డులు, క్రెడిట్ కార్డులు అక్కర్లేదు, పేటీఎం తరహా చెల్లింపులు, నెట్ బ్యాంకింగ్ లావా దేవీలూ అవసరం లేదు. మొబైల్ ఫోన్ తీసుకెళ్లడం, ఓటీపీ నెంబర్లు చూసుకోవడం, పిన్ నెంబర్లు, బ్యాంక్ ఖాతాల నెంబర్లు గుర్తుంచుకోవాల్సిన అవసరమూ లేదు. త్వరలోనే ఇవన్నీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ఆధార్ ఆధారిత భీమ్ యాప్‌తో సాధ్యం కానున్నాయి. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఈ యాప్‌ను మోదీ శుక్రవారం జాతికి అంకితం చేసిన విషయం తెల్సిందే.
1. ఆధార్ ఆధారిత భీమ్ యాప్ బయో మెట్రిక్ విధానంతో నడుస్తుంది. ఆధార్ ఇచ్చేటప్పుడు అధికారులు వేలి ముద్రలు తీసుకున్నారుకనుక, ఆ వేలు ముద్రల ధ్రువీకరణ ద్వారానే లావాదేవీలు నడుస్తాయి.
2. ఇప్పటికే దేశంలోని బ్యాంకులన్నింటికీ ఆధార్ కార్డులకు అనుసంధానం చేశారు. ఇప్పటి వరకు దాదాపు 40 కోట్ల మంది ఖాతాదారుల ఖాతాలు అధార్‌కు అనుసంధానం అయ్యాయి. ఇప్పుడు మన బ్యాంక్ ఖాతాలను భీమ్ యాప్‌కు అనుసంధానం చేస్తున్నారు. మన బ్యాంకు ఖాతాల్లో డబ్బులుంటే చాలు. ఎక్కడైనా వేలి ముద్ర ధ్రువీకరణ ద్వారా నగదు రహిత లావాదేవీలు జరపవచ్చు.
3. వ్యాపారులు మాత్రం వేలి ముద్రలను స్కాన్‌చేసే పరికరాలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. వాటిలో వినియోగదారుడు ఎంత చెల్లించాలో పేర్కొన్నాక వేలిముద్ర ఇస్తే చాలు. వేలి ముద్రను స్కాన్ చేయడం ద్వారా వినియోగదారుడి బ్యాంక్ ఖాతాను గుర్తించి ఆ ఖాతాలోని ఆ సొమ్మును భీమ్ యాప్ వ్యాపారస్థుని ఖాతాలోకి బదిలీ చేస్తుంది.
4. ప్రస్తుతం ప్రైవేటు, ప్రభుత్వ రంగాలకు చెందిన 30 బ్యాంకులు భీమ్ యాప్ లావాదేవీల్లో పొల్గొంటున్నాయి. వాటిల్లో ఆంధ్రాబ్యాంక్, అలహాబాద్ బ్యాంక్, బ్యాంక్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, దేనా బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ తదితర బ్యాంకులు ఉన్నాయి.
5. ఐఓఎస్, ఆండ్రాయిడ్ వర్షన్లలో పనిచేసే భీమ్–ఆధార్ యాప్‌ను గత డిసెంబర్‌లోనే ప్రారంభించగా ఇప్పటి వరకు 1.9 కోటి మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు.
6. కార్పొరేట్ స్థాయి లావాదేవీలకు కాకుండా ప్రస్తుతానికి సాధారణ చెల్లింపులకు పరిమితం చేయనున్నారు.