ప్రత్యక్ష ప్రసారంలో బ్రెయిన్ సర్జరీ!
రోజులు ఎంతగానో మారిపోయాయి. ఒకప్పుడు లైవ్ ప్రొగ్రామ్లంటే ఏ సంగీత కచేరిలో, ఆడియో ఫంక్షన్లో, వేడుకలు, ఉత్సవాలో చూపించేవారు. ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారాలు కూడా ఒక స్టంట్ గా మారిపోయాయి. ఒక వ్యక్తి తనను అనకొండ సర్పం మింగుతుండగా ప్రత్యక్ష ప్రసారం చేస్తానని ప్రకటించాడు. దీనిపై విమర్శలు కూడా వచ్చాయి. అయితే, తాజాగా ఓ టీవీ చానెల్ వినూత్న లైవ్ కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. వైద్యులు ఒక వ్యక్తి మెదడుకు శస్త్రచికిత్స నిర్వహిస్తుండగా లైవ్ లో ప్రసారం చేసింది. దీనిపై కొందరు ఆశ్చర్యం, కొందరు విస్మయం వ్యక్తం చేశారు.
'బెయిన్ సర్జరీ లైవ్' పేరిట గత ఆదివారం నేషనల్ జియోగ్రాఫిక్ చానెల్ లో ఓ కార్యక్రమాన్ని ప్రసారం చేశారు. క్లీవ్ల్యాండ్ లోని కేస్ మెడికల్ సెంటర్ యూనివర్సిటీ ఆస్పత్రిలో 49 ఏళ్ల గ్రెగ్ గ్రిండ్లే అనే వ్యక్తి మెదడుకు వైద్యుల బృందం శస్త్రచికిత్స నిర్వహించింది. ఈ కార్యక్రమంతా ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఈ ప్రత్యక్ష ప్రసారం వైద్యులు మాట్లాడుతూ ఈ శస్త్రచికిత్సకు సంబంధించిన వివిధ ప్రొసీజర్స్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తాము ఇందుకు సిద్ధపడ్డామని తెలిపారు.
కార్యక్రమం ప్రసారానికి ముందు వ్యాఖ్యాత బ్రియంట్ గంబెల్ మాట్లాడుతూ తాము లైవ్ లో చూపిస్తున్నది సంగీత కచేరి కాదని, ఈ కార్యక్రమం గురించి వీక్షకుల అంచనాలు తమకు తెలుసని పేర్కొన్నారు. పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్న గ్రిండ్లేకు శస్త్రచికిత్స విజయం లేదా వైఫల్యం వల్ల జీవన్మరణ ప్రభావం ఉండకపోయినా.. ఇది విజయవంతమైతే చాలా ఏళ్లపాటు అతని జీవితంపై ప్రభావం ఉంటుందని ఆయన తెలిపారు. ఈ ప్రత్యక్ష ప్రసారం మెదడు గురించి పండుగ జరుపుకోవడం లాంటిదని పేర్కొన్నారు.