
ఇన్నాళ్లు ఎందుకీ మౌనం..
న్యూఢిల్లీ: ఆవు మాంసం తిన్నారనే ఆరోపణలపై ఉత్తరప్రదేశ్లోని దాద్రిలో ఓ ముస్లిం వ్యక్తిని మూకుమ్మడిగా దాడి చేసి చంపేసిన ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎట్టకేలకు పెదవి విప్పారు. ఆ ఘటన బాధాకరమన్నారు. దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతున్న ఈ ఘటనపై దాదాపు నెలరోజులు మౌనంగా ఉండి.. ఇప్పుడు ప్రధాని మోదీ స్పందించడంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. భారత క్రికెట్ జట్టు విజయం సాధిస్తే వెంటనే శుభాకాంక్షలు తెలిపే మోదీ.. ఈ ఘటనపై ఇంత ఆలస్యంగా ప్రతిస్పందించడమేమిటని నిలదీశాయి. ప్రతిపక్ష నేతలు ఏమన్నారంటే..
నరేంద్రమోదీ మతిమరుపుతో బాధపడుతున్నారు. ఆయన ప్రధానమంత్రి అన్న సంగతి మరిచిపోయారు. దేశ ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ఆయనది. బీజేపీ నేతలు మహేశ్ శర్మ, సంజీవ్ బలియన్ పై ఆయన ఏం చర్యలు తీసుకున్నారు? ఆయన యూపీ సీఎంతో మాట్లాడారా?
- రణ్దీప్ సూర్జేవాలా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి
ఆయన ఏ రకమైన మౌనాన్ని వీడారు? నేను ఈ రోజు ఒక మనిషిని చంపి.. రేపు క్షమాపణలు చెబుతానంటే.. దానికేమైనా అర్థం ఉందా?
- లాలూప్రసాద్ యాదవ్, ఆర్జేడీ అధినేత
ఈ ఘటనపై ఇంత ఆలస్యంగా ఆయన ఎలా మాట్లాడుతారు? క్రికెట్ టీమ్ విజయం సాధించినప్పుడు ఆయన వెంటనే స్పందిస్తారు. ఈ ఘటనపై మాత్రం ఎంతో ఒత్తిడి వచ్చిన తర్వాత స్పందించారు. ఇది గర్హనీయం. ఒక మూక మనిషిని చంపడం చిన్న విషయం కాదు. ఇది తాలిబన్ తరహా ప్రవర్తన. దీనిని వాళ్లు చిన్న ఘటన అని చెప్తున్నారు.
-,శరద్ యాదవ్, జేడియూ అధ్యక్షుడు
దురదృష్టకరం పదం చాలా చిన్నది. మాటలు చెప్పడం ద్వారా ఏమీ మార్చలేం. ప్రజలు మిమల్ని ఎన్నుకున్నారు. వారికి సంబంధించిన బాధ్యత మీమీద ఉంది.
- శశి దేశ్పాండే, రచయిత
ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు, విధానాలు మారుతుంటాయి. కానీ భారత మూల సూత్రాలు మారకూడదు. ప్రభుత్వం తన బాధ్యతను గుర్తెరిగి.. దేశంలోని అన్ని మతాలను, బహుళాత్వాన్ని గౌరవించాలి. కానీ అది ఇప్పుడు జరగడం లేదు. ప్రజలు భవిష్యత్ గురించి భయపడుతున్నారు.
- నయనతారా సెహగల్, రచయిత