
ఆర్టీసీకి చైర్మన్..?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీకి చైర్మన్‌ను నియమించే దిశగా అడుగులు పడుతున్నాయి. తీవ్ర నష్టాలు, ఆదాయం పెరగక పోవటం, కొత్తగా అప్పులు పుట్టే అవకాశం లేనంతగా గుడ్‌విల్ దెబ్బతినటం... తదితరాలతో ఆర్టీసీ కునారిల్లిపోయింది. ఈ తరుణంలో చురుకైన నేతను ఆర్టీసీకి చైర్మన్‌గా నియమిస్తే పరిస్థితిలో మార్పు వస్తుందని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలని ఇప్పటికే నిర్ణయించి వేగంగా కసరత్తు చేస్తున్న ఆయన.. పనిలోపనిగా ఆర్టీసీ చైర్మన్ విషయంలోనూ నిర్ణయం తీసుకుంటారని సమాచారం.
వాస్తవానికి ప్రస్తుతం ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ సాంబశివరావే సాంకేతికంగా టీఎస్‌ఆర్టీసీకి కూడా చైర్మన్‌గా కొనసాగుతున్నారు. సాంకేతికంగా ఇప్పటికీ ఆర్టీసీ విడిపోనందున ఆయనే చైర్మన్ హోదాలో ఉన్నారు. పాలనాపరంగా ఏపీఎస్ ఆర్టీసీ, టీఎస్ ఆర్టీసీ విడివిడి కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పటికీ నిజానికి ఇప్పటికీ ఏపీఎస్ ఆర్టీసీగానే ఉంది. ఈ విభజన తంతు కేంద్ర ఉపరితల రవాణాశాఖ పరిధిలో ఉంది. ఆస్తులు అప్పుల వాటా తేలిస్తేగాని తుది విభజన పూర్తి కాదు.
ఇప్పటికీ అది పీటముడిగానే ఉంది. దీనిపై నిర్ణయం వెల్లడించాల్సిన షీలాభిడే కమిటీ గడువు ముగిసినా దాన్ని తేటతెల్లం చేయలేదు. ఫలితంగా అది గందరగోళంగా మారింది. ఈ కారణంగానే తెలంగాణ ఆర్టీసీకి ప్రత్యేకంగా పాలకమండలి కూడా ఏర్పాటు కాలేదు. ఉమ్మడి పాలకమండలిలో తెలంగాణ ప్రాతినిధ్యం తక్కువగా ఉండటంతో... అది సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకోరాదని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి విన్నవించింది. ఈ కారణంతోనే పాలకమండలి సమావేశాలూ జరగటం లేదు.
తెలంగాణ అభ్యంతరం మేరకు... తెలంగాణ ప్రాతినిధ్యం పాలకమండలిలో పెంచుకునేలా కేంద్రం కూడా ఆమోదం తెలుపుతూ లేఖ కూడా రాసింది. ఇది ఇలా ఉండగా... తెలంగాణకు సొంతంగా ఓ పాలకమండలిని ఏర్పాటు చేసి చైర్మన్ పదవిని భర్తీ చేయాలని తాజాగా ముఖ్యమంత్రి భావిస్తున్నట్టు తెలిసింది. కేవలం తెలంగాణ ఆర్టీసీకి సంబంధించి సాధారణ నిర్ణయాలు తీసుకునేలా ఈ పాలకమండలి చూస్తుంది. ముఖ్యంగా నష్టాలను అధిగమించటంపై మాత్రమే దృష్టి సారిస్తుందని చెబుతున్నాయి.
తీవ్ర నష్టాలతో జీతాలు చెల్లించటం కూడా కష్టంగా మారిన దుస్థితిలో ఉన్న ఆర్టీసీ ఇలాగే కొనసాగితే... బాగుచేయలేనంత దారుణంగా దెబ్బతింటుందని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. దీనికి చైర్మన్‌ను నియమించటం కొంతవర కు మేలు చేస్తుందని ముఖ్యమంత్రి భావిస్తున్నట్టు సమాచారం. మరోవైపు కీలక పదవుల కోసం ముఖ్యమంత్రిపై పార్టీ నేతల నుంచి ఒత్తిడి కూడా ఉంది. ఆర్టీసీ చైర్మన్‌గిరీ ప్రముఖమైందిగా భావిస్తున్న నే తలు దానికోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
నేతలను సంతృప్తి పరిచే క్రమంలో కూడా ఈ నిర్ణయం ఉపకరిస్తుందని సీఎం భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికీ రెండు ఆర్టీసీల మధ్య బస్సు పర్మిట్ల విభజన జరగలేదు. ఫలితంగా తెలంగాణకు రావాల్సిన 550 సర్వీసులు ఏపీఎస్‌ఆర్టీసీ పరిధిలోనే ఉండటంతో తెలంగాణ ఆర్టీసీ రోజుకు రూ.2 కోట్ల మేర ఆదాయాన్ని కోల్పోతోందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నష్టాలను అధిగమించాలంటే చైర్మన్ ఉండటం అవసరమనే ఒత్తిడి కూడా ప్రభుత్వంపై ఉండటం విశేషం.