భారత అంతరిక్ష పరిశోధనా సంస్ధ(ఇస్రో) కొత్త చరిత్ర సృష్టించనుంది.
ముంబై: భారత అంతరిక్ష పరిశోధనా సంస్ధ(ఇస్రో) కొత్త చరిత్ర సృష్టించనుంది. ఒకేసారి 82 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపేందుకు సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది జనవరి 15న ఈ ప్రయోగం చేయనున్నట్లు మార్స్ ఆర్బిటార్ మిషన్(మామ్) ప్రాజెక్టు డైరెక్టర్ సుబ్బయ్య అరుణన్ తెలిపారు. అయితే ఇది వాణిజ్య ప్రయోగమని పేర్కొన్నారు. బ్రాండ్ ఇండియా సమ్మిట్ 2016కు హాజరైన అరుణన్ మాట్లాడారు. ఇస్రో పంపనున్న ఉపగ్రహాల్లో 60 అమెరికాకు చెందినవి కాగా 20 యూరప్‌కు, 2 యూకేకు చెందినవి.
ఇప్పటివరకూ కేవలం రష్యా మాత్రమే 37 ఉపగ్రహాలను ఒకేసారి విశ్వంలోకి పంపి చరిత్ర సృష్టించింది. 2014లో జరిగిన ఈ ప్రయోగం విజయవంతంకావడంతో రష్యా పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మొగిపోయింది. ఆ తర్వాతి స్ధానంలో అమెరికా 29 ఉపగ్రహాలు, భారత్ 20 ఉపగ్రహాలు ఉన్నాయి. జనవరిలో ఇస్రో చేపట్టే ప్రయోగం విజయవంతమైతే అత్యధిక ఉపగ్రహాలను ఒకేసారి విశ్వంలో పంపిన తొలిదేశంగా భారత్ పేరు చరిత్రకెక్కుతుంది. అతి తక్కువ ఖర్చుతో మామ్ మిషన్ ను తొలి ప్రయోగంతోనే విజయం సాధించి భారత్ ప్రపంచదృష్టిని ఆకర్షించింది.
ఇప్పటికే ఎన్నో ఘనవిజయాలను అందించిన పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్(పీఎస్ఎల్వీ)తో ఈ ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు. ప్రయోగం జరిగిన 20 నుంచి 25 నిమిషాల్లో 580కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలార్ సన్ సింక్రనస్ కక్ష్యలో 82శాటిలైట్లను ప్రవేశపెడతారు. 2020లో మామ్-2ను ప్రయోగించాలని నిర్ణయించినట్లు అరుణన్ వెల్లడించారు. అరుణ గ్రహంపై పరిశోధనలకు ఇప్పటివరకూ 40 ప్రపోజల్స్ వచ్చినట్లు చెప్పారు. చంద్రయాన్-2 2018లో చంద్రునిపై దిగుతుందని తెలిపారు. ఈ మేరకు ఇప్పటికే పరిశోధనలు ప్రారంభమైనట్లు వివరించారు.