వెనక్కి వెళ్లండి లేదా చచ్చిపోతారు: చైనా
భారత్‌కు మూడు ఆప్షన్లు ఇచ్చిన చైనా మాజీ రాయబారి
దాడి రాతలు కొనసాగిస్తున్న చైనా మీడియా
'వెనక్కివెళ్లండి. లేదా బంధీలుగా పట్టుబడండి. లేదంటే చనిపోతారు' ఇవి భారత్‌కు చైనా మాజీ రాయబారి ఇచ్చిన మూడు ఆప్షన్స్... సిక్కిం సరిహద్దుల్లో డొక్లామ్ ప్రాంతంలో భారత్-చైనా సైన్యాల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న నేపథ్యంలో ఇటు చైనా మీడియా, అటు ఆ దేశం అధికారులు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. ఒకవైపు చైనా మీడియా యుద్ధం తప్పదన్న రీతిలో రాతలు కొనసాగిస్తుండగా.. ఈ ప్రతిష్టంభనకు దౌత్యపరమైన పరిష్కారం లేనేలేదని, బేషరతుగా భారత్ తన బలగాలను డొక్లామ్ నుంచి ఉపసంహరించుకోవాల్సిందేనని డ్రాగన్ బుసలు కొడుతోంది. ఈ నేపథ్యంలో ముంబైలో చైనా కౌన్సెల్ జనలర్‌గా పనిచేసిన మాజీ రాయబారి, విదేశీ వ్యవహారాల నిపుణుడు లియు యౌఫా చైనా తాజాగా సెంట్రల్ టెలివిజన్ ఇంగ్లిష్ చానెల్‌తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు.
'సైనిక దుస్తులు ధరించిన వ్యక్తులు మరొక దేశం భూభాగంలోకి ప్రవేశించారంటే.. వాళ్లు సహజంగానే శత్రువులు అవుతారు. అందుకు వారు మూడు పరిణామాలను ఎదుర్కొంటారు. ఒకటి స్వచ్ఛందంగా వెనుకకు తగ్గడం, లేదా పట్టుబడటం.. అప్పటికీ సరిహద్దు వివాదం సమసిపోకపోతే.. ఆ సైనికులు చంపపడొచ్చు' అని ఆయన చెప్పుకొచ్చాడు. ఈ మూడు ఆప్షన్లలో భారత్ ఏది ఎంచుకుంటుందో చైనా వేచి చూస్తున్నదని, భారత్ అర్థవంతమైన సున్నితమైన ప్రత్యామ్నాయాన్ని ఎంచుకుంటుందని భావిస్తున్నామని ఆయన అన్నారు.