18 గంటలు పనిచేయండి.. లేదా ఇంటికే: యోగి
తాపీగా 10.30-11 గంటలకు ఆఫీసుకు రావడం, తర్వాత టీ తాగి కాసేపు కబుర్లు చెప్పుకొని తీరిగ్గా పని ఏమైనా చూడటం, మరీ విసుగ్గా ఉంటే అది కూడా మానేసి కాసేపు కునుకు తీయడం, సాయంత్రం 5 గంటలు కొట్టగానే తట్టా బుట్టా సర్దుకుని ఎంచక్కా ఇంటికి వెళ్లిపోవడం. ప్రభుత్వ ఉద్యోగం అంటే సర్వసాధారణంగా ప్రజలకు ఉన్న అభిప్రాయం ఇదే. కానీ, ఉత్తరప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పుణ్యమాని ఈ పరిస్థితి పూర్తిగా మారిపోతోంది. రోజుకు కనీసం 18-20 గంటల పాటు పనిచేయడానికి సిద్ధపడాలని, లేదా ఉద్యోగాలు వదిలి ఇళ్లకు వెళ్లిపోడానికి సిద్ధం కావాలని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వ పథకాల అమలులో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని గోరఖ్‌పూర్‌లో జరిగిన ఓ సమావేశంలో ఆయన స్పష్టం చేశారు. తాను పని రాక్షసుడినని, అధికారులు కూడా అలాగే పనిచేయాలని ఆశిస్తానని అన్నారు. కష్టపడి పనిచేయడం ఇష్టం లేనివాళ్లు మాత్రం ఎంచక్కా వెళ్లిపోవచ్చని తెలిపారు.
మంత్రులు కూడా తమ అధికారాన్ని దుర్వినియోగం చేయడానికి వీల్లేదని, అణకువగా పనిచేయాలని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడం తన తొలి ప్రాధాన్యమని బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులతో నిర్వహించిన సమావేశంలో యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం చాలా ముఖ్యమని, ప్రభుత్వ పథకాల లబ్ధి నిరుపేదల్లో చిట్టచివరి వ్యక్తికి కూడా దక్కేలా చూడటం కార్యకర్తల విధి అని ఆయన చెప్పారు. అదే సమయంలో ప్రభుత్వ కార్యకలాపాలలో మాత్రం వేలు పెట్టొద్దని పార్టీకి స్పష్టం చేశారు. కాంట్రాక్టుల కోసం అధికారుల మీద ఒత్తిడి చేస్తే సహించేది లేదన్నారు. లోక్‌సభ ఎన్నికలకు ఇక రెండేళ్లు మాత్రమే ఉందని, అందువల్ల ఇప్పటినుంచే సిద్ధం కావాలని సూచించారు. ప్రభుత్వ పనితీరులో ఏమైనా లోపం ఉంటే నేరుగా తన దృష్టికి తేవాలన్నారు.
పేద కుటుంబాలలోని అమ్మాయిల పెళ్లిళ్లకు ప్రభుత్వం సాయం చేస్తుందని, రాష్ట్రం నుంచి యువత వలసలు వెళ్లకుండా చూసేందుకు తగిన ఉపాధి అవకాశాలు కల్పిస్తామని కూడా యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ఎన్నికల్లో పార్టీకి లభించిన భారీ ఆధిక్యం వల్ల పార్టీ నాయకులు, కార్యకర్తల బాధ్యత మరింత పెరిగిందని ఆయన చెప్పారు. తమ ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకుందని అన్నారు.
యోగి ఆదిత్యనాథ్ గురించిన మరిన్ని కథనాలు..
రాష్ట్రాన్ని వదిలిపోతే మీకే మంచిది: సీఎం వార్నింగ్
సీఎం బంగ్లాలో ఆవుల మంద
గూండాలు లేరు.. సంతోషం
యోగి ఎఫెక్ట్: దుకాణాల్లో ఏమైందంటే..
కాబోయే ప్రధానమంత్రి యోగినే!
యోగిపై పిచ్చిరాతలు.. మండిపడ్డ భారత్
అందరికీ అభివృద్ధే లక్ష్యం: యూపీ సీఎం