
పర్యావరణ కాలుష్యాన్ని గుర్తించే చేతిపట్టీలు..
మన చుట్టూ ఎన్నో రకాలు కాలుష్యాలు.. భయంకరమైన వ్యాధులకు కారణమయ్యే రసాయనాలు.. పురుగుమందులు.. గాలి పీల్చినా, ఏదైనా తిన్నా, చివరికి దేనినైనా ముట్టుకున్నా ఏదో ఒక రసాయనం మన శరీరంలోకి చేరుతుంది.
వాషింగ్టన్: మన చుట్టూ ఎన్నో రకాలు కాలుష్యాలు.. భయంకరమైన వ్యాధులకు కారణమయ్యే రసాయనాలు.. పురుగుమందులు.. గాలి పీల్చినా, ఏదైనా తిన్నా, చివరికి దేనినైనా ముట్టుకున్నా ఏదో ఒక రసాయనం మన శరీరంలోకి చేరుతుంది. మరి మనం పనిచేసే చోటనో, మనం తరచూ వెళ్లే ప్రదేశంలోనో... ఏ వాయువులు, రసాయనాలున్నాయి.. అవి మనపై ఎంత ప్రభావం చూపిస్తున్నాయి.. అనేది తెలిసేదెలా అనుకుంటున్నారా? ఇందుకు తోడ్పడే ఒక చేతి పట్టీ (రిస్ట్ బ్యాండ్)లాంటి స్మార్ట్ పరికరాన్ని అమెరికాకు చెందిన ఒరెగాన్ వర్సిటీ శాస్త్రవేత్తలు రూపొందించారు. సిలికాన్‌తో తయారు చేసిన ఈ పట్టీ.. మనం ఉండే ప్రదేశంలోని వాయువులు, రసాయనాలను పీల్చుకుంటుందని పరిశోధనకు నేతృత్వం వహించిన కిమ్ అండర్సన్ చెప్పారు.
ఈ పట్టీని పరిశీలించి రసాయనాల స్థితిని తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. దీంతో పురుగు మందులు, అగ్నిమాపక రసాయనాలు, కర్బన సహిత వాయువులు, పరిశ్రమలు, వివిధ వినియోగ వస్తువుల నుంచి వెలువడే వాయువులు.. ఇలా వెయ్యి రసాయనాలు, వాటి గాఢతను గుర్తించవచ్చన్నారు. ఏదైనా కర్మాగారంలో సాధారణ పనులు చేసేవారితో పోలిస్తే.. ప్రత్యేక యంత్రాల వద్ద, ప్రత్యేక పరిస్థితుల్లో పనిచేసేవారిపై వ్యక్తిగతంగా రసాయనాల ప్రభావం ఎంత ఉందో తెలుసుకుని, తగిన జాగ్రత్తలు చేపట్టవచ్చని తెలిపారు.