సాక్షి, బెంగళూరు/శివమొగ్గ, న్యూస్‌లైన్: తాను తిరిగి బీజేపీలో చేరనున్నట్లు కర్ణాటక జనతా పార్టీ (కేజేపీ) అధ్యక్షుడు యడ్యూరప్ప స్పష్టం చేశారు. సంక్రాంతి తర్వాత ఎప్పుడైనా తాను బీజేపీలో చేరతానని చెప్పారు. మాతృసంస్థలోకి వెళ్తానని యెడ్డీ చెప్పడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. శివమొగ్గ జిల్లా శికారిపుర పట్టణంలో కేజేపీ కార్యాలయం వద్ద నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో యడ్యూరప్ప మాట్లాడుతూ... ‘శికారిపుర పట్టణంలో జరిగే కేజేపీ సమావేశం బహుశా ఇదే చివరిది కావచ్చు. సంక్రాంతి తర్వాత నేను బీజేపీలోకి తిరిగి వెళ్లనున్నాను’ అని చెప్పారు. నరేంద్ర మోడీని ప్రధానిని చేయాలనే ఉద్దేశంతోనే తాను తిరిగి బీజేపీలోకి చేరుతున్నానన్నారు. కాగా, బెంగళూరులో బీజేపీ ఎంపీ అనంతకుమార్ మాట్లాడుతూ... సంక్రాంతి తర్వాత యడ్యూరప్ప బీజేపీలోకి రావడం ఖాయమన్నారు. ఈ మేరకు మోడీ, పార్టీ అధ్యక్షుడు రాజనాథ్‌సింగ్ అంగీకారం తెలిపారన్నారు.