రైతు ఆత్మహత్యలు పట్టవా?
చంద్రబాబు తీరుపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి, కడప : రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నా.. భరోసా కల్పించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తిగా విఫలమయ్యారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. పరిహారం అందించి ఆదుకోవాల్సిన ప్రభుత్వం.. డబ్బులు ఇవ్వకుండా మాటల గారడీ చే స్తోందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవాలని ఆయన రాష్ర్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం సాయంత్రం వైఎస్సార్ జిల్లా పులివెందుల మండలం మోట్నూతలపల్లె గ్రామంలో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు పాలగిరి రాజశేఖర్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు.
‘రాజశేఖర్ సంఘటనే చూసుకుంటే ఆ రైతు ఆత్మహత్య చేసుకొని 18రోజులు గడిచాయి... పురుగుల మందు తాగి రాజశేఖరన్న చనిపోతే గవర్నమెంటోళ్లు ఈ పక్కకు తిరిగి చూడలేదంటే ఏమనాలి?’ అని ఆయన ప్రశ్నించారు. ఆ రైతు గ్రామీణ బ్యాంకులో లక్ష రూపాయలు, భార్య పేరు మీద డ్వాక్రా రుణం 20వేలు తీసుకున్నారని, అయితే ఏ రుణమూ మాఫీ కాలేదని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. తనకున్న మూడు ఎకరాల పొలంతోపాటు మరో మూడు ఎకరాలను కౌలుకు తీసుకొని 5బోర్లు వేశారని, కానీ ఒక్క బోరులో మాత్రమే అరకొర గా నీళ్లు వస్తాయన్నారు. బ్యాంకుల్లోనే కాకుండా బయట కూడా రాజశేఖర్ రూ.10లక్షలు వ్యవసాయంపై అప్పు చేసి అవి తీర్చలేక, బతికే దారిలేక మరణించినా ప్రభుత్వం కరుణ చూపకపోవడం దుర్మార్గమని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. పేద రైతు కుటుంబాలు ఎలా బ్రతుకుతాయన్న ఆలోచన కూడా బాబుకు రాకపోవడం శోచనీయమన్నారు.
ఒక్క అధికారి రాడు..
‘వ్యవసాయంపై చేసిన అప్పులు తీర్చే దారిలేక చాలామంది రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. సంఘటన జరిగిన తర్వాతనైనా ఒక్క అధికారి రాడు.. ఎందుకు రావడంలేదో నాకైతే అర్థం కావడంలేదు. చనిపోయిన రైతు రైతుగా కనిపించడంలేదా.. లేక చనిపోయింది పులివెందులలో కాబట్టి వివక్ష చూపుతూ రాలేదా’ అని వైఎస్ జగన్ నిలదీశారు. ‘రాష్ట్రంలో రైతులు చనిపోతున్నా.. భరోసా కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అనంతపురంలో 46మంది ఆత్మహత్యలు చేసుకున్న రైతుల ఇళ్లకు వెళ్లా.. అందులో 20కి పైగా ఇళ్లకు గవర్నమెంటోళ్లు పోలేదు. ఇప్పటికైనా ఏం జరుగుతుందో కళ్లు తెరిచి చూడాలి.’ అని ఆయన చంద్రబాబును కోరారు.
పరిహారం అందించని ప్రభుత్వం
రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.5లక్షలు పరిహారం అందిస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు ఆచరణలో ఏమీ అందించడంలేదని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రూ.1.50లక్షలు అప్పులోళ్లకిచ్చి మిగిలిన రూ.3.50లక్షలు బ్యాంకులో వేస్తామంటారు.. తీరా చూస్తే అకౌంటులో మాత్రం ఏమీ ఉండదు.. ఇలా ఎంతమంది రైతు కుటుంబాలను మభ్యపెడతారు’ అని ఆయన ఘాటుగా ప్రశ్నించారు. ‘అసలు ప్రభుత్వం ఏమి చేస్తోంది? ఎందుకు చేయలేకపోతోంది.. చనిపోయిన రైతులకు ఎందుకు పరిహారం ఇవ్వడం లేదో చెప్పాలి’ అని జగన్ నిలదీశారు. ‘పులివెందుల మండలంలో చనిపోయిన రాజశేఖర్ కుటుంబాన్నే చూడండి.. అధికారులు కూడా రాలేదు.. కనీసం మీరైనా(మీడియా) చూడండి.. మానవత్వంతో పరిస్థితిని అర్థం చేసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేలా స్పందించండి’ అని కోరారు.
పబ్లిసిటీ వస్తే తప్ప.. బాబు స్పందించరు..
ఇంత మంది రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నా.. పట్టించుకోని చంద్రబాబు ఏదైనా పబ్లిసిటీ వస్తుందంటే.. ముందు వరుసలో ఉంటారని జగన్ ఎద్దేవా చేశారు. పబ్లిసిటీ వస్తుందంటేనే పరిహారం ఇవ్వాలన్న ఆలోచనను పక్కనపెట్టి ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబానికి పరిహారం అందించి న్యాయం చేయాలని ఆయన కోరారు. ఏ రైతు ఎక్కడ చనిపోయినా పరిహారం ఇవ్వాలని చంద్రబాబు మనసుకు తట్టేలా పనిచేయాలని మీడియాకు సూచించారు.