
ఎన్నాళ్లయినా.. అదే అభిమానం
సాక్షి ప్రతినిధి, వరంగల్: పేద ప్రజల పెన్నిధి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించి ఆరేళ్లు గడిచాయి. అయినా ఇప్పటికీ ఎక్కడ చూసినా ఆయన పథకాల ప్రస్తావనే. వరంగల్ జిల్లాలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల పరామర్శయాత్ర సందర్భంగా ఏ పల్లెను చూసినా, ఎవరి నోట విన్నా వైఎస్సార్ గొప్పతనం ప్రస్తావనే. ‘మాకు రేషన్ కార్డు వైఎస్సే ఇచ్చిండు.. మా ఇల్లు అప్పుడు కట్టినం.. నాకు పింఛను ఇచ్చిన దేవుడు.. నా గుండెకు ఆపరేషన్ చేయించిండు..
అప్పుడు రైతుల పరిస్థితి బాగుండె.. ఉచిత కరెంటు ఇచ్చిండు, లోన్లు మాఫీ జేసిండు. మా అబ్బాయి ఉట్టిగ ఎంబీఏ చదివిండు...’ ఇలా ప్రజలంతా వైఎస్ రాజశేఖరరెడ్డిని స్మరిస్తూనే ఉన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక చనిపోయినవారి కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల వరంగల్ జిల్లాలో చేపట్టిన రెండోదశ పరామర్శయాత్ర శుక్రవారం ముగిసింది. ఈ యాత్రలో పాలకుర్తి, మహబూబాబాద్, నర్సంపేట, పరకాల, భూపాలపల్లి, ములుగు నియోజకవర్గాల్లోని 30 కుటుంబాలను ఆమె పరామర్శించారు.
ఈ కుటుంబాల వద్దకు వెళ్లినప్పుడు ఆయా గ్రామాల్లో ఎక్కడ విన్నా వైఎస్ పాలన గురించే చెప్పుకోవడం కనిపించింది. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి విషయంలో అప్పటి, ఇప్పటి పరిస్థితి పోల్చిచూసుకోవడం వినిపించింది. షర్మిల వెళ్లిన ప్రతి చోటా వైఎస్ తనయ వచ్చిందన్న సంతోషం... వైఎస్‌ను, తమవారిని గుర్తు చేసుకున్న ఉద్వేగం కలగలిసి కనిపించింది. వైఎస్ మరణాన్ని తట్టుకోలేక వరంగల్ జిల్లాలో 77 మంది చనిపోయారు.
ప్రస్తుతం ఇక్కడ 73 కుటుంబాలు ఉంటున్నాయి. వారిని ఓదార్చేందుకు పరామర్శయాత్ర చేపట్టిన షర్మిల.. ఆగస్టు 24 నుంచి 28 వరకు మొదటిదశలో 32 కుటుంబాలను, సెప్టెంబరు 7 నుంచి 11 వరకు జరిపిన రెండో దశలో మరో 30 కుటుంబాలను ఓదార్చారు. రెండోదశ యాత్ర భూపాలపల్లి నియోజకవర్గం మొగుళ్లపల్లి మండలం ఇసిపేటలో శుక్రవారం మధ్యాహ్నం ముగిసింది.
పేరుపేరునా పలకరిస్తూ..
పరామర్శించేందుకు వెళ్లిన షర్మిలను అందరూ ఆత్మీయతతో ఆదరించారు. రెండు చేతులతో నమస్కరించి పేరుపేరునా షర్మిల పలకరించినప్పుడు వారంతా ఎంతో ఉద్వేగానికి లోనయ్యారు. వారి కుటుంబంలో ఒకరిగా కలసిపోయి షర్మిల మాట్లాడుతున్నప్పుడు... ‘రాజన్న బిడ్డ మా ఇంటికి వచ్చింది. ఇది మేం కలలో కూడా ఊహించలేదు. ఆమె మా ఇంటికి వచ్చి వెళ్లిందంటే ఇన్నాళ్ల మా బాధ తీరినట్టే..’’అని వారంతా ఆనందించారు. షర్మిల ప్రతిచోటా ఆయా కుటుంబాల బాధలు, సమస్యలు తెలుసుకుని ఓదార్చారు. వారందరికీ వైఎస్ కుటుంబం అండగా ఉంటుందని భరోసా కల్పించారు.
ఐదో రోజు నాలుగు కుటుంబాలకు..
వరంగల్ జిల్లాలో రెండోదశ పరామర్శయాత్ర చివరి రోజు శుక్రవారం నాలుగు కుటుంబాలను షర్మిల పరామర్శించారు. పరకాల మండలం మల్లక్కపేటలో రాసమల్ల తిరుపతి కుటుంబాన్ని ఓదార్చి... తిరుపతి తండ్రి బుచ్చయ్యను యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇదే మండలం నాగారంలో కాంబత్తుల శ్రీహరి భార్య శ్రీదేవిని పరామర్శించి భరోసా కల్పించారు. తర్వాత లక్ష్మీపురం గ్రామంలో చెల్పూరి ఉప్పలయ్య కుటుంబాన్ని కలుసుకుని ఆయన భార్య లక్ష్మికి ధైర్యంగా ఉండాలని ఓదార్చారు.
చివరగా మొగుళ్లపల్లి మండలం ఇసిపేటలోని యార రాజయ్య కుటుంబ సభ్యులను షర్మిల పరామర్శించారు. రాజయ్య భార్య కమలమ్మను ఓదార్చారు. మంచి రోజులు మళ్లీ వస్తాయని చెప్పారు. ఇసిపేటలో పరామర్శ ముగిసిన తర్వాత వరంగల్ మీదుగా హైదరాబాద్‌కు వెళ్లారు. వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ యాత్రలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, నల్లా సూర్యప్రకాశ్‌రావు, ముఖ్య అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు బీష్వ రవీందర్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు ఎం.విలియం, ఎన్.శాంతికుమార్, ఎన్.భిక్షపతి, జార్జ్ హెర్బర్ట్, షర్మిల సంపత్, కె.నగేశ్, ఎం.శంకర్, టి.నాగరావు, డి.శ్వేత, ఎ.సంతోష్‌రెడ్డి, జి.శివకుమార్, వనజ పాల్గొన్నారు.