వరంగల్: దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిల వరంగల్ జిల్లాలో చేపట్టిన రెండో విడత పరామర్శయాత్ర శుక్రవారంతో ముగిసిందని ఆ పార్టీ నేత కొండా రాఘవరెడ్డి వెల్లడించారు. శుక్రవారం వరంగల్ నగరంలో కొండ రాఘవరెడ్డి మీడియాతో మాట్లాడుతూ... రెండో విడతలో వరంగల్ జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో 30 కుటుంబాలను వైఎస్ షర్మిల పరామర్శించారని తెలిపారు.
ఈ నెల 21, 22 తేదీల్లో వరంగల్ జిల్లాలో మూడో విడత పరామర్శయాత్రను ఆమె చేపట్టనున్నారని ఆయన వివరించారు. అలాగే ఈ నెల 23 నుంచి కరీంనగర్ జిల్లాలో షర్మిల పరామర్శయాత్ర ప్రారంభంకానుందని చెప్పారు. మహానేత వైఎస్ఆర్ మరణించి ఆరు ఏళ్లు అయినా ప్రజలు ఆయన్ని మరచిపోలేకపోతున్నారన్నారు.
వరంగల్ లోక్సభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికపై ఈ నెల 13,14 తేదీల్లో జరిగే కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్య చేసుకోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై టీఆర్ఎస్ ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమన్నారు. అధైర్యపడవద్దని రైతులకు ఆయన ఈ సందర్భంగా సూచించారు. మీ పక్షాన తమ పార్టీ పోరాడుతుందని వైఎస్ఆర్ సీపీ నేత కొండా రాఘవరెడ్డి రైతులకు భరోసా ఇచ్చారు.