
చట్టాలు అమలైతేనే రక్షణ
నిర్భయ చట్టం వచ్చాక కూడా మహిళలపై అఘాయిత్యాలు జరగడం దురదృష్టకరం: విజయమ్మ
నల్లగొండ జిల్లాలో అత్యాచారానికి గురైన బాలికలకు పరామర్శ
హైదరాబాద్, న్యూస్‌లైన్: ప్రభుత్వాలు ఎన్నిరకాల చట్టాలు తెచ్చినప్పటికీ వాటిని పూర్తిస్థాయిలో అమలు చేయనంతవరకు మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉంటాయని, ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి మహిళలకు రక్షణ కల్పించాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం ఏనిమీది తండా ప్రభుత్వ బాలికల వసతి గృహంలో అత్యాచారానికి గురైన 12 మందిచిన్నారులను పోలీసులు హైదరాబాద్‌లోని బాలికల వసతి గృహానికి(స్టేట్ హోం) తరలించారు.
బుధవారం విజయమ్మ వారిని పరామర్శించారు. ఆందోళన చెందవద్దని అభయమిచ్చారు. అన్ని విధాలా తాము అండగా ఉంటామని, బాగా చదువుకుని ఉన్నతస్థితికి చేరుకోవాలని చెప్పారు. స్టేట్‌హోం అధికారులతో చర్చించి చిన్నారులను కంటికిరెప్పలా కాపాడాలని సూచించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆమెమాట్లాడుతూ చిన్నారులపై అత్యాచారానికి ఒడిగట్టిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వైఎస్‌ఆర్ ఉన్న సమయంలో ఎవరైనా మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే వారిని చట్టం ద్వారా కఠినంగా శిక్షించేవారని, దాంతో మరోసారి ఇలాంటివి చేయాలన్నా భయపడేవారన్నారు.
ఆయన మరణానంతరం వచ్చిన ప్రభుత్వం ఇలాంటి ఘటనలు జరుగుతున్నా పట్టించుకోవడంలేదన్నారు. నిర్భయ చట్టం వచ్చిన తర్వాత కూడా దేశంలో అధికశాతం మహిళలపై దాడులు జరగడం దురదృష్టకరమన్నారు. అఘాయిత్యాల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని, ఇందుకు పోలీసుల వైఫల్యం ఎంతో ఉందన్నారు. 108, 100 నెంబర్లకు ఫోన్లు చేస్తే పలికేవారే కరువయ్యారని చెప్పారు. బాలికలను పరామర్శించిన వారిలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మేకతోటి సుచరిత, కేంద్రకమిటీ సభ్యులు పాదూరి కరుణ, నల్లగొండ జిల్లా కన్వీనర్ బి. సోమిరెడ్డి, నల్లగొండ జిల్లా మహిళా విభాగం నాయకులు నూకాలమ్మ, వైఎస్‌ఆర్‌సీపీ సేవాదళ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కోటింరెడ్డి వినయ్‌రెడ్డి తదితరులున్నారు.
ఆదర్శ రైతులకు కనీస వేతనం ఇవ్వాలి..
రాష్ట్రంలోని రైతులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారికి కనీస వేతనం చెల్లించేలా సర్కారుపై ఒత్తిడి తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదర్శ రైతుల అసోసియేషన్ (అప్సర) వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మకు విజ్ఞప్తి చేసింది. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.శేఖర్, ఉపాధ్యక్షుడు పుచ్చకాయల ఏడుకొండలుతోపాటు పలు జిల్లాల ప్రతినిధులు బుధవారం ఇక్కడ విజయమ్మను ఆమె నివాసంలో కలుసుకుని వినతిపత్రం సమర్పించారు. ఆదర్శ రైతులకు వెయ్యి రూపాయలే గౌరవ వేతనంగా ఇస్తున్నారని.. దాంతో కుటుంబ పోషణ సాధ్యం కాద ని వివరించారు. కాగా, వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదర్శరైతుల సమస్యలను సానుభూతితో పరిష్కరిస్తామని విజయమ్మ హామీ ఇచ్చినట్లు అసోసియేషన్ నేతలు ఒక ప్రకటనలో మీడియాకు తెలిపారు.