రేపటి నుంచి సీమాంధ్ర 175 నియోజకవర్గాల్లో ఒకేసారి నిరహార దీక్షలు
గాంధీ జయంతి నుంచి రాష్ట్ర అవతరణ దినోత్సవం వరకు నిరసనలు
ఎక్కడికక్కడ ఏర్పాట్లు పూర్తి చేసిన ప్రజా ప్రతినిధులు, సమన్వయ కర్తలు, పార్టీ నేతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న డిమాండ్‌తో గాంధీ జయంతి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రలో పోరాటం ఉధృతం చేయబోతున్నది. అక్టోబర్ రెండో తేదీన విభజనను వ్యతిరేకిస్తూ ఒకేసారి 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరాహార దీక్షలు చేపట్టనుంది. పార్టీ పిలుపు మేరకు చేపడుతున్న ఈ ఆందోళన కార్యక్రమానికి పార్టీ కార్యకర్తలు, నేతలు ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. ఈ 175 నియోజకవర్గాల్లో మంగళవారం నుంచి ప్రారంభమయ్యే నిరసనలు నవంబర్ ఒకటి రాష్ట్ర అవతరణ దినోత్సవం వరకు కొనసాగుతాయి. ఈ మేరకు ఉద్యమ కార్యాచరణను పార్టీ ఇప్పటికే విడుదల చేశారు. కార్యక్రమాల వివరాలు: అక్టోబర్ 2 :నుంచి శాసనసభ నియోజకవర్గాల సమన్వయకర్తలు, ఇతరులు నిరాహార దీక్షలు చేపడతారు. అక్టోబర్ 7:పదవులకు రాజీనామాలు చేయాలని కోరుతూ శాంతియుతంగా మంత్రులు, కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాసాల ఎదుట ధర్నాలు ఉంటాయి. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ప్రజా ప్రతినిధులకు పూలు అందజేసి నిరసన తెలుపుతారు.
అక్టోబర్ 10 :అన్ని మండల కేంద్రాల్లో రైతుల ఆధ్వర్యంలో దీక్షలు నిర్వహిస్తారు.
అక్టోబర్ 17:శాసనసభ నియోజకవర్గ కేంద్రాల్లో ఆటోలు, రిక్షాలతో ర్యాలీ.
అక్టోబర్ 21:నియోజకవర్గ కేంద్రాల్లో మహిళలతో కార్యక్రమాలు - మానవహారం.
అక్టోబర్ 24:అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో యువజనులతో బైక్ ర్యాలీలు.
అక్టోబర్ 26:జిల్లాల్లోని సర్పంచ్‌లు, సర్పంచ్ పదవికి పోటీ చేసిన అభ్యర్థులు జిల్లా కేంద్రాల్లో ఒక రోజు దీక్ష.
అక్టోబర్ 29:అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో విద్యార్థులు, యువకులతో శాంతియుతంగా ఆందోళన కార్యక్రమాలు
నవంబర్ 1:అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభల నిర్వహణ- సమైక్యాంధ్రను కోరుతూ తీర్మానాలు.