'చంద్రబాబు ఇప్పుడు నీ రక్తం మరగడం లేదా'
హైదరాబాద్: ప్రధాని నరేంద్రమోదీ ఆంధ్రప్రదేశ్ గుండెలపై పొడిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాత్రం ఎప్పటిలాగే మరోసారి వెన్నుపోటు పొడిచారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా అంశంపై చర్చ జరగాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో పట్టుబట్టడంతో ప్రభుత్వం అంగీకరించలేదు. దీంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం సభ శుక్రవారానికి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ చంద్రబాబు సర్కార్ పై నిప్పులు చెరిగారు.
ప్రత్యేక హోదాపై రెండేళ్లు ఎదురు చూసేలా చేసి దారుణంగా వంచించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదాపై మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరిగినా ముఖ్యమంత్రి నోటి నుంచి ఒక్క మాట కూడా రావడం లేదని, ప్రత్యేక హోదాపై చర్చ జరగాలా వద్ద అనే విషయం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పడం లేదని మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ ప్రత్యేక హోదా కోరుకుంటున్నారని, కేంద్రం తెగేసి చెప్పినా సీఎం పట్టించుకోకపోవడం లేదంటే ప్రభుత్వ వైఖరి తెలుసుకోవచ్చని అన్నారు. కేంద్రం ప్రకటనలు చూస్తుంటే రక్తం మరుగుతోందని రెండు నెలలముందు చెప్పిన చంద్రబాబు ఇప్పుడు కేంద్రం తెగేసి చెప్పినా కూడా ఆ రక్తం మరగడం లేదా అని నిలదీశారు. ఇప్పటి వరకు ప్రత్యేక హోదాపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలో పోరాటం చేశామని, ఇక ముందు కూడా ప్రత్యేక హోదా కోసం అలుపు లేకుండా పోరాడుతామని ఆయన స్పష్టం చేశారు.