బాబు హయాంలో అన్ని 'స్పెషల్ స్టేటస్లే'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో ఇసుక మాఫియాలో స్పెషల్ స్టేటస్.... లిక్కర్ మాఫియాలో స్పెషల్ స్టేటస్.... మహిళపై దాడుల్లో స్పెషల్ స్టేటస్.... ఎర్ర చందనం స్మగ్లింగ్లో స్పెషల్ స్టేటస్ తీసువచ్చారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా ఎద్దేవా చేశారు.
అంతేకాని కేంద్రం నుంచి ప్రత్యేక హోదా తీసుకురావడంలో మాత్రం విఫలమయ్యారని ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికన చంద్రబాబు... కేంద్రం నుంచి ప్రత్యేక హోదా తీసుకువచ్చేందుకు భయపడుతున్నారని విమర్శించారు. అందుకే కేంద్రం ముందు సాష్టాంగ నమస్కారం చేస్తున్నారన్నారు.
ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని నరేంద్ర మోదీ... తెస్తామని చంద్రబాబు... తిరుపతి వెంకన్న సాక్షిగా చెప్పారు. కానీ మోదీకి పీఎం... బాబుకి సీఎం హోదాలు వచ్చాయి కానీ....ఏపీ మాత్రం ప్రత్యేక హోదా రాలేదన్నారు. బీజేపీ, టీడీపీలకు ఓటు వేయండి అంటూ ఎన్నికల సమయంలో చెప్పిన పవన్ కల్యాణ్ మాత్రం ఇప్పుడు మౌనంగా ఉన్నారని రోజా తెలిపారు.
కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల్లోని నేతలంతా ప్రత్యేక హోదా తీసుకు రావడంలో విఫలమైన నేపథ్యంలో తప్పించుకోవాడాని కుంటి సాకుల చెబుతున్నారన్నారు. ప్రత్యేక హోదా కోసం చట్టంలో సవరణలు చేసి ప్రత్యేక హోదా తీసుకురావడానికి ఎందుకు మనస్సు రావడం లేదని కేంద్రాన్ని ప్రశ్నించారు. చట్టంలో సవరణలు చేసైనా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని రోజా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.