గుంటూరు: ఆర్టీసీ బస్ చార్జీల పెంపునకు నిరసనగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి.
గుంటూరు జిల్లా: మంగళగిరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరసన ప్రదర్శన చేపట్టింది. సోమవారం ఉదయం మంగళగిరిలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఆయన కార్యాలయం నుంచి బస్టాండ్ వరకు కార్యకర్తలు, నాయకులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వం పెంచిన చార్జీలను వెంటనే తగ్గించాలని ఈ సందర్భంగా నినాదాలు చేశారు. ఈ మేరకు బస్టాండ్‌లో డీఎం వెంకటేశ్వరరావుకు వినతి పత్రం అందజేశారు. పొన్నూరులో రావి వెంకట రమణ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
విజయనగరం: బస్సు చార్జీల పెంపుపై విజయనగరం జిల్లా వ్యాప్తంగా నిరసనలు పెల్లుబికాయి. పార్వతీపురం నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్‌లో రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. చార్జీల పెంపుతో బస్సు ప్రయాణం ఎంత భారమవుతోందో ప్రయాణికులకు వివరించారు. అనంతరం డీఎం బీవీఎస్ నాయుడుకు వినతిపత్రం అందజేశారు. బొబ్బిలిలో వైఎస్సార్ సీపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రౌతు రామమూర్తి నాయుడు ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ కూడలిలో ధర్నా, రాస్తారోకో, మానవహారం నిర్వహించారు. చీపురుపల్లిలో వైఎస్సార్‌సీపీ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు గల్లాన చంద్రశేఖర్ ఆధ్వర్యంలో బస్టాండ్ వద్ద ధర్నా చేశారు.
శ్రీకాకుళం: పెంచిన ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలంటూ శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ నాయకులు ఆందోళనలు నిర్వహించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదుట రెడ్డిశాంతి ఆధ్వర్యంలో ధర్నా చేశారు. టెక్కలిలో వైఎస్సార్సీపీ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. మాజీ ఎమ్మెల్యే జగన్నాయకులు ఆధ్వర్యంలో పలాసలో నిర్వహించిన ధర్నాలో భారీ ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కృష్ణా జిల్లా: ఉయ్యూరు ఆర్టీసీ డిపో ఎదుట జరిగిన వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు దేవభక్తుని సుబ్బారావు, రావులపాటి రామచంద్రరావు, మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ వంగవీటి శ్రీనివాసప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు డీఎంకు వినతి పత్రం అందజేశారు. అవనిగడ్డ ఆర్టీసీ డిపోలో వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ సింహాద్రి రమేష్‌బాబు ఆధ్వర్యంలో ధర్నా చేశారు. అలాగే, నందిగామ, తిరువూరులోని బస్టాండ్ల వద్ద ధర్నా జరిగింది. పెంచిన చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.
ప్రకాశం జిల్లా: మార్కాపురంలో ఎమ్మెల్యే జంకె వెంకట్‌రెడ్డి నేతృత్వంలో స్థానిక బస్టాండ్ వద్ద ధర్నా చేపట్టారు. దర్శి నియోజకవర్గ కేంద్రంలో పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి బూచేపల్లి శివప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
చిత్తూరు జిల్లా: మదనపల్లిలోని బస్టాండ్ వద్ద ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. డీఎంకు వినతిపత్రం సమర్పించారు.
వైఎస్సార్ జిల్లా: కేంద్రం కడప నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఎమ్మెల్యే అంజాద్‌బాషా, మేయర్ సురేష్‌బాబు రాస్తారోకో చేపట్టారు.
తూర్పుగోదావరి జిల్లా: మండపేటలో పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ పట్టాభిరామయ్య చౌదరి ఆధ్వర్యంలో బస్టాండ్ వద్ద ధర్నా జరిగింది.
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా: గూడూరులో ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద ధర్నా చేశారు.