-
దాని సవరణ దిశగా మా పోరాటానికి కలసిరండి
-
బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌కు జగన్ బృందం విజ్ఞప్తి
-
రాజకీయ లబ్ధి కోసం ఆర్టికల్-3 దుర్వినియోగమవుతోంది
-
చట్ట సభల్లో మూడింట రెండొంతుల మెజారిటీతోనే
-
నాడు ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు జరిగింది
-
కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు అదే విధానాన్ని అవలంబించాలి
-
దీని కోసం ఆర్టికల్-3 సవరణకు కృషి చేయాలని వినతి
-
తమది చిన్న రాష్ట్రాల విధానమని చెబుతూనే
-
ఈ ప్రతిపాదనను పార్టీ దృష్టికి తీసుకెళతానన్న రాజ్‌నాథ్
దేశంలో కొత్త రాష్ట్రాలను ఏర్పాటుచేసే అధికారాలను కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 సవరణకు కృషి చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలోని పార్టీ నాయకుల బృందం బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌కు గట్టిగా విజ్ఞప్తి చేసింది. ఒక రాష్ట్రాన్ని విభజించాలన్నా, కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్నా ఆ ప్రతిపాదనను అసెంబ్లీలోనూ, పార్లమెంట్‌లోనూ మూడింట రెండొంతుల మెజారిటీతో ఆమోదించడం తప్పనిసరి చేయాలని ఉద్ఘాటించింది. ఈ ప్రతిపాదనను అమలు చేసే దిశగా ఆర్టికల్ 3ను సవరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, ఆ సవరణ కోసం తాము చేపట్టిన పోరాటానికి బీజేపీ కలసిరావాలని రాజ్‌నాథ్ సింగ్‌ను జగన్‌మోహన్‌రెడ్డి కోరారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న ఏ పార్టీ ప్రభుత్వమైనా సరే రాజకీయ లబ్ధి దృష్టితో ఆర్టికల్ 3ను దుర్వినియోగం చేయవచ్చని, ఇది ఎంతమాత్రం మంచి సంప్రదాయం కాదని, దీనిపై వెంటనే చర్చ జరగాలని అన్నారు. మరో ఆరు మాసాల్లో పదవీకాలం ముగుస్తున్న కేంద్ర ప్రభుత్వం, అదీ మైనారిటీలో ఉన్న ప్రభుత్వం కేవలం రాజకీయ లబ్ధి కోసం ఎన్నికల ముంగిట ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని అమలుచేయడం ఎంత అసమంజసమో చూడాలన్నారు. దీనికి స్పందించిన రాజ్‌నాథ్, ఆర్టికల్ 3 సవరణ ప్రతిపాదనను పార్టీ దృష్టికి తీసుకెళ్తానని, అలాగే, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కోసం ఆనాడు హైదరాబాద్ స్టేట్, ఆంధ్ర రాష్ట్రం మూడింట రెండొంతుల మెజారిటీతో తీర్మానాలు చేయాలంటూ ఫజల్ అలీ కమిషన్ సూచించిన అంశం కొత్త విషయమని, దీన్ని సైతం పార్టీ దృష్టికి తీసుకెళ్తానని చెప్పినట్టు సమాచారం. తమది చిన్న రాష్ట్రాల విధానమని అంటూనే ఆయన ఈ అంశాలను పార్టీ దృష్టికి తప్పకుండా తీసుకెళ్తానని పేర్కొన్నట్టు తెలిసింది.
ఐదు పేజీల వినతిపత్రం..
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా జాతీయస్థాయిలో అన్ని పార్టీల మద్దతు కూడగట్టడానికి ఢిల్లీ వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి.. ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, పార్టీ నాయకులు ఎం.వి.మైసూరారెడ్డి, కొణతాల రామకృష్ణ, బాలశౌరి, గట్టు రామచంద్రరావుతో కలసి ఆదివారం జాతీయస్థాయిలో ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ నివాసానికి వెళ్లి భేటీ అయ్యారు. అశోకారోడ్‌లోని రాజ్‌నాథ్ నివాసంలో రాత్రి 6.10 నుంచి 7.10 వరకు గంటపాటు జరిగిన చర్చల్లో రాజ్‌నాథ్‌తోపాటు బీజేపీ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది పాల్గొన్నారు. సమైక్యాంధ్రకు తోడ్పడాలని, ఆర్టికల్ 3 సవరణకు కలసిరావాలని కోరుతూ తొలుత జగన్ బృందం ఐదుపేజీల వినతిపత్రాన్ని రాజ్‌నాథ్‌కు అందజేసింది. విభజన వ్యతిరేక పోరాటంలో దేశంలోని అన్ని ప్రధాన పార్టీల మద్దతు కూడగట్టే క్రమంలో జగన్ బృందం శనివారం సీపీఐ, సీపీఎం అగ్ర నేతలతో సమావేశమై రాష్ట్ర సమైక్యత, ఆర్టికల్ 3 సవరణ అంశాలపై విస్తృతంగా చర్చించిన సంగతి విదితమే. తాజాగా రాజ్‌నాథ్‌తో భేటీ కావడంతో మొత్తం మూడు ముఖ్యమైన పార్టీలను జగన్ బృందం కలిసినట్టయింది. తమ పార్టీ అధినేతతో జగన్ బృందం చర్చలు మంచి వాతావరణంలో జరిగాయని, రాష్ట్ర విభజన తాలూకు పలు అంశాలను ప్రస్తావించడంతోపాటు ఆర్టికల్ 3 సవరణ ఆవశ్యకతను జగన్ బృందం నొక్కిచెప్పిందని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి.
ఏపీది ప్రత్యేక పరిస్థితి...
రాజ్‌నాథ్‌తో భేటీలో జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు ఆంధ్రప్రదేశ్ పూర్వాపరాలను, ఆర్టికల్ 3 దుర్వినియోగానికి ఉన్న ఆస్కారాన్ని వివరించారు. తెలిసిన సమాచారం మేరకు.. ఆంధ్రప్రదేశ్ విషయంలో బీజేపీకి ఓ వైఖరి ఉండవచ్చునని, అయితే రాష్ట్రానిది ఓ ప్రత్యేక పరిస్థితి అని వారు ఆయనకు చెప్పారు. భాషాప్రయుక్త ప్రాతిపదికన మొదటి ఎస్సార్సీ చేసిన సిఫార్సుల మేరకు ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందని, ఇతర భాషా ప్రయుక్త రాష్ట్రాలకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్ విషయంలో ఓ షరతు కూడా పెట్టారని గుర్తుచేశారు. హైదరాబాద్ స్టేట్, ఆంధ్ర రాష్ట్రం శాసనసభలు మూడింట రెండొంతుల మెజారిటీతో తీర్మానాలను ఆమోదిస్తేనే విలీనం జరగాలన్న షరతు మేరకే రెండు శాసనసభలు తీర్మానాలు చేశాయని, ఆ తర్వాతే ఆంధ్రప్రదేశ్ అవతరించిందని తెలిపారు. రెండు రాష్ట్రాల శాసనసభలు తీర్మానాలను మూడింట రెండొంతుల మెజారిటీతో ఆమోదించిన తర్వాతే ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్‌ను విభజించడానికి రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానాన్ని అదే మెజారిటీతో చేయాల్సి ఉన్నా దానికి భిన్నంగా విభజనను చేపడుతున్నారంటూ కేంద్రం చేస్తున్న తప్పును ఎత్తిచూపారు.
సమాఖ్య భావనకు విరుద్ధం..
రాష్ట్ర విభజనకు కేంద్రం తీసుకున్న నిర్ణయంపై రాష్ట్రంలో ప్రజాగ్రహం తీవ్రస్థాయిలో వ్యక్తమవుతోందని, అయినా సరే అధికార కాంగ్రెస్ పార్టీ దాన్నేం పట్టించుకోకుండా ఇష్టానుసారం తన ప్రణాళికను అమలు చేస్తూ ముందుకెళ్తోందని జగన్‌మోహన్‌రెడ్డి బృందం రాజ్‌నాథ్‌కు తెలియజేసింది. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలన్న 75 శాతం మంది ప్రజలవాణిని ప్రతిబింబించని విభజన బిల్లును పార్లమెంట్‌లో గట్టిగా వ్యతిరేకించాలని కోరింది. నిజమైన సమాఖ్య భావనకు సదరు బిల్లు విరుద్ధమైనదని, దీన్ని తిరస్కరించాలని విన్నవించింది. ఆంధ్రప్రదేశ్‌కు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా జాతీయ పార్టీలన్నీ కలసి నిలవాల్సిన తరుణమిదని పేర్కొంది. ఇది ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే చెందిన సమస్య ఏమాత్రం కాదని, మున్ముందు కేంద్రంలో అధికారంలో ఉన్న ఓ ప్రభుత్వమైనా స్వప్రయోజనాల కోసం ఎక్కడైనా ఇలాంటి విభజనకే దిగే ప్రమాదం ఉందని ఆందోళన వెలిబుచ్చింది. ప్రజాస్వామ్యానికి, విలువలతోకూడిన రాజకీయాలకు ప్రాధాన్యమిచ్చే రాజకీయ పార్టీలు ఈ సమస్యను చూస్తూ కూర్చోరాదని, ప్రస్తుత పరిస్థితి భవిష్యత్తులో మరెక్కడా పునరావృతం కాకుండా చూడటానికి ఆర్టికల్ 3 సవరణకు పట్టుబట్టాలని, ప్రజాస్వామ్య పరిరక్షణకు చేతులు కలపాలని జగన్ బృందం కోరింది.
నేడు హైదరాబాద్‌కు జగన్!
రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా మద్దతు కూడగట్టేందుకు దేశ రాజధానిలో రెండ్రోజులపాటు వామపక్షాలు, బీజేపీ అగ్రనేతలతో చర్చలు జరిపిన జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ఉదయం హైదరాబాద్‌కు విమానంలో బయలుదేరుతారు.