లాభాలు పట్టుకోండి | benifits with silk industry | Sakshi
Sakshi News home page

లాభాలు పట్టుకోండి

Published Mon, Nov 3 2014 3:02 AM | Last Updated on Sat, Sep 2 2017 3:46 PM

benifits with silk industry

ఖమ్మం వ్యవసాయం: పట్టుదల ఉంటే పట్టు పరిశ్రమలో మంచి ఫలితాలు సాధించవచ్చు. ఈ పరిశ్రమను అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకోవచ్చు. దీని ఏర్పాటుకు ప్రభుత్వం కూడా తోడ్పాటునిస్తోంది. పట్టు పరిశ్రమ నిర్వహణలో షెడ్ నిర్మాణం, నిర్వహణ ముఖ్యమైనది. పట్టు పురుగుల మేత కోసం మల్బరీ తోటలు పెంచుకోవాలి.

జిల్లాలో మొత్తం 365 ఎకరాల్లో మల్బరీ సాగు చేస్తున్నారు. ఈ ఏడాది 138 ఎకరాల్లో నూతనంగా మల్బరీ సాగు చేపట్టారు. తిరుమలాయపాలెం, ముదిగొండ, రఘునాథపాలెం, ఖమ్మం అర్బన్, ఖమ్మం రూరల్, కొణిజర్ల, కొత్తగూడెం, భద్రాచలం, కూసుమంచి తదితర మండలాల్లో పట్టుపరిశ్రమలను నిర్వహిస్తున్నారు. పట్టుపరిశ్రమల నిర్వహణకు ప్రభుత్వం అందిస్తున్న చేయూత, పరిశ్రమల ఏర్పాటు, మల్బరీ తోటల పెంపకం గురించి జిల్లా పట్టుపరిశ్రమల అధికారి మడికంటి ఆదిరెడ్డి వివరించారు.

 ప్రభుత్వ చేయూత
 మల్బరీ తోటల పెంపకానికి, షెడ్ ఏర్పాటుకు ప్రభుత్వం సీడీపీ (క్యాటలైటిక్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం) పథకం కింద నిధులను మంజూరు చేస్తుంది.

 దీనికి రైతులు కనీసం 2 ఎకరాలు ఒక యూనిట్‌గా మల్బరీ తోటలను పెంచుకోవాలి.
 మల్బరీ సాగు చేసే రైతులు పట్టుపురుగుల పెంపకానికి అవసరమైన షెడ్ విధిగా నిర్మించాలి.
 షెడ్ నిర్మాణానికి రూ. 2 లక్షల వరకు ఖర్చవుతుంది. దీనిలో సుమారు 50 శాతం నిధులను సబ్సిడీపై ప్రభుత్వం అందిస్తుంది.

 షెడ్ 50ఁ20 పొడవు, వెడల్పు సైజులో నిర్మించాలి.
 షెడ్‌లో మెస్సు నిర్మాణానికి రూ.16 వేలు, పరికరాలు, ప్లాస్టిక్ ట్రేలు, ప్లాస్టిక్ నేత్రికలకు రూ.21,500లను ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తుంది.
 పట్టుపరిశ్రమ శాఖ మల్బరీ మొక్కలను సరఫరా చేస్తుంది.
 జిల్లాలోని అశ్వారావుపేట, అక్కినేపల్లి, ఖమ్మం సమీపంలోని టేకులపల్లి, కొత్తగూడెం మండలంలోని గరిమళ్లపాడు నర్సరీల్లో మల్బరీ మొక్కలు పెంచుతున్నారు.
 జిల్లాలోని నర్సరీల్లో వి-1 రకం మొక్కలు లభిస్తున్నాయి.
 ఎకరాకు 5,500 మొక్కలు పడుతాయి. వీటికి రూ.9,500 ఖర్చు వస్తుంది. వీటిలో పట్టుపరిశ్రమశాఖ రూ.6,750లను సబ్సిడీ కింద ఇస్తుం ది. అంటే రైతు మొక్క ల కోసం రూ. 2,250లను భరిస్తే సరిపోతుంది.

 ప్లాంటేషన్
 మల్బరీ మొక్కలను జూన్ నుంచి నవంబర్ నెల వరకు నాటుకోవచ్చు.
 దుక్కిని లోతుగా దున్నాలి. 4 సార్లు దుక్కి దున్నితే మంచిది.
 దుక్కిలో 8 టన్నుల పశువుల ఎరువు వేయాలి. వర్మి కంపోస్టునూ వేసుకోవచ్చు.
 మొక్కల మధ్య, వరుసల మధ్య 3ఁ3 సైజు ఉండే విధంగా నాటు కోవాలి.
 మొక్క నాటిన తొలి రోజుల్లో వారానికి ఒక తడి ఇవ్వాలి. తరువాత 10 రోజులకు ఒకసారి తడులు ఇవ్వవచ్చు.
 నేల రకాలు, పట్టు పరిశ్రమశాఖ అధికారుల సూచనల మేరకు రెండునెలలకు ఒకసారి అవసరమైతేనే రసాయన ఎరువులు వాడాలి.
 4 నెలలకు మొదటి పంట వస్తుంది.
 మొదటి సంవత్సరంలో మూడు పంటలు వస్తాయి. రెండో సంవత్సరం 5 నుంచి 7 పంటలు తీయవచ్చు. ఒకసారి మల్బరీ వేస్తే 12 నుంచి 15 ఏళ్ల వరకు దాన్ని మేతగా ఉపయోగించుకోవచ్చు.
 
పట్టు పురుగుల పెంపకం
 సెంట్రల్ సిల్క్ బోర్డ్ విజయవాడ నుంచి పట్టుగుడ్లను సరఫరా చేస్తుంది.
 100 పట్టుగుడ్ల ధర రూ.550 (మేలు రకమైన పట్టు గుడ్లు)
 నెల రోజుల్లో పట్టు గూళ్లు అల్లుకుంటాయి.
 
ఆదాయం: ఎకరం మల్బరీ సాగు చేస్తే దాని ఆకుతో పెంచిన పురుగులతో సంవత్సరానికి రూ. లక్ష ఆదాయం వస్తుంది.
 ఒక కిలో పట్టు గూడు ధర నాణ్యతను బట్టి రూ.300 నుంచి రూ.340 వరకు ఉంటుంది. ప్రభుత్వం ప్రోత్సహకంగా కిలోకు రూ.50 చొప్పున అందిస్తోంది.
 
మార్కెటింగ్
 రైతులు పండించిన పంటను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అమ్ముకోవచ్చు. తెలంగాణలోని జనగాం, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని హనుమాన్‌జంక్షన్, అనంతపురం, రామ్‌నగర్ (బెంగళూరు)లలో పంటను అమ్ముకునే అవకాశం ఉంది. ఏడాదిలో ఆగస్టు 15, జనవరి 26 మినహా అన్ని రోజుల్లో ఇక్కడ పంటను అమ్ముకోవచ్చు. నిల్వ చేసుకొని మంచి ధర వచ్చినప్పుడే అమ్ముకోవడానికి వీలుకాదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement