జిల్లాలో ఐదు పట్టు విత్తన క్షేత్రాలు.. సేంద్రియ ఎరువులతో మల్బరీ తోటల పెంపకం
పట్టు పరిశ్రమను ప్రోత్సహించడానికి ప్రభుత్వం జిల్లాలో ఐదు పట్టు విత్తన క్షేత్రాలను ఏర్పాటుచేసింది. మొయినాబాద్ మండలంలోని నజీబ్‌నగర్, తాండూరు, వికారాబాద్ మండలంలోని అనంతగిరిపల్లి, దూలపల్లి, మంచన్‌పల్లి గ్రామాల్లో వీటిని ఏర్పాటు చేసింది. వీటిలో మల్బరీ మొక్కలను, చాకీ వామ్స్‌ను పెంచి రైతులకు తక్కువ ధరకు అందజేస్తున్నారు. మల్బరీ మొక్కలను క్షేత్రంలోనే నాటువేసి అవి కొంత పెద్దవైన తర్వాత ఒక్కో మొక్కను రూపాయి పావలాకు అందజేస్తారు.
ఎకరా పట్టు తోటలను సాగు చేయాలంటే ఐదువేల మల్బరీ మొక్కలు అవసరం. నజీబ్‌నగర్ క్షేత్రంలో సేం ద్రియ ఎరువులైన పేడ, వేపపిండిని ఉపయోగించి మొక్కలను పెంచుతున్నారు. దీంతో ఈ మల్బరీ మొక్కలకు ఎక్కువ చీడపీడలు ఆశించకుండా ఉంటాయి. రైతులు మ ల్బరీ తోటలు నాటిన నాలుగో నెల నుంచి పట్టు పురుగుల పెంపకాన్ని చేపట్టాల్సి ఉంటుంది. రైతు ఒక ఎకరంలో మల్బరీ తోట సాగు చేసిన రెండో సంవత్సరం నుంచి పట్టు పురుగులను పెంచి పట్టుగూళ్లను ఉత్పత్తి చేసి విక్రయించడం వల్ల సంవత్సరానికి రూ.లక్షా 20వేలనుంచి రూ.లక్షా 50వేల వరకు ఆదాయాన్ని పొందవచ్చు.
సబ్సిడీకి అర్హతలివే..
పట్టు పరిశ్రమ చేపట్టే రైతులు వ్యవసాయ బావి గానీ, బోరు గానీ కలిగి ఉండి సంవత్సరం పొడవునా నీటి వసతి పుష్కలంగా కలిగి ఉండాలి.
సొంత పట్టా భూమి కలిగిన అన్ని కులాలు, అన్ని కేటగిరీలకు సంబంధించిన రైతులు అర్హులు. ఇసుక భూములు, ఆమ్ల, క్షార భూములు మల్బరీ తోటలు పెంచేందుకు పనికిరావు. సమతుల భూములు అత్యంత శ్రేష్టమైనవి. నీటిని పారించేందుకు ఎరువులు వేసేందుకు అనువుగా ఉండాలి. మట్టి నమూనా పరీక్షలు చేయించటం అవసరం. మల్బరీ తోటకు రెండున్నర ఎకరాలు కేటాయించాలి. అక్కడే పట్టు పురుగులు పెంచేందుకు షెడ్లను నిర్మించుకోవాలి.
పట్టు పరిశ్రమను చేపట్టే రైతులు సబ్సిడీ పొందేందుకు తప్పనిసరిగా 5 సంవత్సరములు మల్బీరీ తోటను పెంచి, పట్టు పురుగుల పెంపకం చేపట్టి, పట్టు గూళ్లను ఉత్పత్తి చేస్తామని అంగీకార పత్రం రాసి ఇవ్వాల్సి ఉంటుంది. లేనిపక్షంలో పట్టు పరిశ్రమ శాఖ ద్వారా పొందిన సబ్సిడీని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఒక ఎకరానికి ఏడాదికి 1000 నుంచి 1200 రింగుల పట్టు గుడ్లు పెంచి 600 కేజీల నుంచి 720 కేజీల నాణ్యత కలిగిన పట్టుగూళ్లు ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. పట్టు పరిశ్రమ శాఖనుంచి సీడీపీ స్కీం కింద రైతులకు ఆయా పనులు చేసేందుకు సబ్సిడీ అందజేస్తారు. సబ్సిడీ కోసం రైతులు ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతాను దరఖాస్తుతోపాటుగా సంబంధిత శాఖ అధికారులకు సమర్పించాలి.
సబ్సిడీ ‘పట్టు’!
Published Mon, Aug 18 2014 11:59 PM | Last Updated on Sat, Sep 2 2017 12:04 PM
Advertisement