జీవితేచ్ఛ ఆవిరై! | Farmer killing themselves | Sakshi
Sakshi News home page

జీవితేచ్ఛ ఆవిరై!

Published Wed, Nov 19 2014 11:35 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

జీవితేచ్ఛ ఆవిరై! - Sakshi

జీవితేచ్ఛ ఆవిరై!

కొండంత ఆశలతో వర్షాధార పంటలే పంచప్రాణాలుగా అందినంత అప్పు చేసి చెమటోడ్చి సేద్యం చేస్తున్న రైతన్నలు.. కరవు కాటుకు తమ కళ్లెదుటే పంటలు గిడసబారి ఎండుతుంటే జీవితేచ్ఛ ఆసాంతమూ ఆవిరై బలవన్మరణాల పాలవుతున్నారు. వరుణుడి వంచన, విద్యుత్ వెతలు, రద్దుకాని రుణ బాధలు, తోడేళ్లలా వేటాడుతున్న వడ్డీ వ్యాపారుల పీడ.. వెరసి విధిలేక మెట్ట సేద్యాన్నే నమ్ముకున్న బడుగు రైతును బలిగొంటున్నాయి. వాతావరణానికి అనువైన పంటల మార్పిడితోపాటు ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు చెప్పి పచ్చని బాట పట్టించే ఆసరా అంతకుముందే కొడిగట్టింది. ఈ నేపథ్యంలో నీటి వసతి లేని తేలిక నేలల్లోనూ అధిక ఖర్చుతో కూడిన పత్తి, మిరప వంటి వాణిజ్య పంటలు వేస్తూ అమావాస్య దీపం చుట్టూ ముసిరే ఉసుళ్ల మాదిరిగా నేలరాలుతున్న విషాదకర దృశ్యాలు ముఖ్యంగా తెలంగాణ పల్లెసీమలను నిస్తేజంగా మార్చుతున్నాయి. గత కొద్ది నెలల్లో వందలాది మంది రైతన్నలు ప్రాణత్యాగం చేస్తూ పంటపొలంలో వటవృక్షం మాదిరి బలిసిన సంక్షోభాన్ని, ఎవరికీ పట్టని తమ నిస్సహాయతను ఎలుగెత్తి చాటుతున్నారు. అటువంటి ఒకానొక అభిమన్యుడు మాలోతు రవి నాయక్! పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆయన కుటుంబాన్ని ‘సాక్షి’ ఇటీవల పరామర్శించింది. బంధువులు, గ్రామస్తుల సమాచారం మేరకు మెట్ట వ్యవసాయం యువ రైతుకు ప్రాణాంతకంగా పరిణమించిన తీరును ఆవిష్కరించే ప్రయత్నమే ఈ కథనం..
 
గిరిజన యువ రైతైన రవి నాయక్ గత నెల 15న తన మిరప చేలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వయసు 34 ఏళ్లు. స్వగ్రామం నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం కల్లేపల్లి. భార్య భారతి(32) రెక్కలు ముక్కలు చేసుకుంటూ వ్యవసాయ పనుల్లో భర్తకు చేదోడుగా ఉంటుంది. పిల్లలు ఈ ఏడాది నుంచే మనోహర్(10), జస్వంత్(8) ప్రైవేటు రెసిడెన్షియల్ స్కూల్‌లో చదువుకుంటున్నారు. పదో తరగతి వరకు చదివి ఉమ్మడి కుటుంబ వ్యవసాయాన్ని కొనసాగిస్తున్న రవి మూడేళ్ల నుంచి సొంతంగా సేద్యం చేస్తున్నాడు. శ్రద్ధగా వ్యవసాయం చేస్తూ ఆర్థికాభివృద్ధి సాధించాలని, పిల్లలను బాగా చదివించాలన్న తపన కలిగిన రైతుగా అతనికి గ్రామంలో గుర్తింపుంది.
 
అసలే కౌలు.. ఆపై పత్తి, మిరప సాగు..


సాగర్ ఎడమ కాలువ నీరు పారే చివరి గ్రామాల్లో కల్లేపల్లి ఒకటి. గ్రామంలోని 500 రైతు కుటుంబాలు కాలువ నీరందే 200 ఎకరాల్లో వరి, మిగతా వెయ్యి ఎకరాల్లో మెట్ట పంటలు సాగు చేస్తున్నాయి. రవికి కాలువ కింద సెంటు భూమి లేదు. మెట్ట ప్రాంతంలో 6 ఎకరాల భూమి ఉంది. కాలువ నీరు లేదు. బోరు వసతీ లేదు. గుట్టల మధ్యన ఎత్తయిన ప్రాంతంలో రెండెకరాల ఎర్రని ఇసుక దువ్వ నేలలో మిరప తోట వేశాడు. మరోచోట రాళ్లు రప్పలతో కూడిన తేలికపాటి నేల 4 ఎకరాల్లో పత్తి వేశాడు. మరో 4 ఎకరాలను కౌలు(ఎకరానికి రూ.5 వేలు)కు తీసుకొని పత్తి, మిరప పంటలు సాగు చేస్తున్నాడు రవి. తోటి రైతుల మాదిరిగానే ఖర్చుకు వెనకాడకుండా అప్పోసొప్పో చేసి కాంప్లెక్స్ ఎరువులు, పురుగుమందులు విరివిగా వాడుతున్నాడు. అతనికి జత ఎడ్లు, రెండు గేదెలున్నాయి. వీటి పేడ ఎరువును ఒక్కో ఏడాది ఒక్కో పొలంలో రొటేషన్ పద్ధతిలో చల్లుతుంటాడు. ఈ ఏడాది 4 ట్రాక్టర్ల పశువుల ఎరువును మిరప తోటకు వేశాడు. అతని తమ్ముడు రాజు కూడా తన రెండెకరాలతోపాటు మరో 6 ఎకరాలను కౌలుకు తీసుకొని పత్తి, మిరప పంటలు సాగు చేస్తున్నాడు. పక్క రైతు బోరు నుంచి నీటిని తీసుకునే అవకాశం రాజుకు దొరికింది. రవికి దొరకలేదు.

కీలక దశలో పడిన వర్షం 30% మాత్రమే!

దామరచర్ల మండలాన్ని గత ఏడాది ప్రభుత్వం కరవు మండలంగా ప్రకటించింది. ఈ ఏడాది మేలో రోహిణీ కార్తె ప్రారంభం రోజున పెద్ద వాన పడింది. దీంతో ఈ ఏడాదైనా మంచి వర్షాలు పడతాయని, అప్పులన్నీ తీర్చేయొచ్చన్న కొండంత ఆశతో రైతులు ఖరీఫ్ సాగుకు ఉపక్రమించారు. ఒకటీ అరా జల్లులు కురుస్తుండడంతో రవి నాయక్ 8 ఎకరాల్లో ఖరీదైన బీటీ పత్తి విత్తనాలు కొని వేశాడు. పత్తి విత్తనాలు సరిగ్గా మొలకెత్తక రెండోసారి మళ్లీ కొని బీటీ విత్తనాలు వేశాడు. అయితే, రైతులు ఆశించిన విధంగా వర్షాలు పడలేదు. మండల అధికారుల సమాచారం మేరకు.. ఖరీఫ్ పంట కాలం మొదటి 3 నెలల్లో (జూన్- ఆగస్టు నెలల్లో) సాధారణ వర్షపాతంతో పోల్చితే కేవలం 30% వర్షం కురిసింది. సెప్టెంబర్- అక్టోబర్ 15వ (రవి నాయక్ ఆత్మహత్య చేసుకున్న) తేదీ మధ్య 45% నమోదైంది. అయితే, తుపాన్ వల్ల అక్టోబర్ 18న భారీ వర్షం కురిసింది. దీంతో మండలంలో జూన్-నవంబర్(15వ తేదీ) మధ్య 85% వర్షం నమోదైనందున.. ఈ ఏడాది కరువు మండలంగా ప్రకటించలేదు. ఈ పరిస్థితుల్లో నెల నెలా తగినంత వర్షం లేక, బోర్ల ద్వారా నీరందక వర్షాధార పంటలు గిడసబారి దిగుబడి మరీ తగ్గిపోయింది.

బోర్లెన్ని వేసినా ఫలితం శూన్యం..

తన మెట్ట పొలానికి బోర్ల ద్వారా నీటి వసతిని సమకూర్చుకోవడానికి రవి రెండేళ్లలో పది బోర్లు వేసినా ఫలితం దక్కలేదు. గత ఏడాది వేసిన 4 బోర్లు విఫలమయ్యాయి. ఈ ఏడాది 6 బోర్లు వేశాడు. ఈ లోగా పాతవి, కొత్తవి కలిపి భూమిని, పాస్‌బుక్‌ను తనఖా పెట్టి బ్యాంకులో తెచ్చిన అప్పు రూ. 5 లక్షలకు, ప్రైవేటు అప్పులు రూ. 6 లక్షలకు పెరిగాయి. రెండు బోర్లలో కొంచెం నీరు కనపడింది. ఆ నీటినైనా తోడి పంటను రక్షించుకుందామని విశ్వప్రయత్నం చేశాడు. పుట్టెడు అప్పులకు కష్టాలు తోడయ్యాయి. కరెంటు వచ్చేది రాత్రి 12 గంటల నుంచి 3 గంటల వరకు. వచ్చిన కరెంటు ఎంత సేపుంటుందో తెలీదు. ఎన్నిసార్లు పోయి, వస్తుందో లెక్కలేదు. ఈ ఏడాది 4 సార్లు మోటారు కాలిపోయింది. కాలిన ప్రతి సారీ రూ.5 వేల ఖర్చు. అయినా మొండి ధైర్యంతో మోటారు రిపేర్లు చేయించి చేను తడిపే ప్రయత్నం చేశాడు. అక్టోబర్ 14 రాత్రి మిరప తోటకు నీళ్లు పెట్టడానికి వెళ్లాడు రవి. రాత్రి 3 గంటలు 2 మోటార్లు ఆడినా ఒక సాలు కూడా సరిగ్గా తడవని దుస్థితి. వర్షమూ పడటం లేదు. కళ్లెదుటే ఎండిపోతున్న పంటను రక్షించుకోలేనన్న అధైర్యం రవిని కమ్ముకుంది. పొలానికి పిచికారీ చేయడానికి తెచ్చిన పురుగుమందు తాగి, అక్కడే తుది శ్వాస విడిచాడు. తెల్లారి పొద్దున అన్నం తీసుకెళ్లిన అతని భార్య భారతి తొలుత నిద్రిస్తున్నాడనుకుంది. నోటి నురగ చూసి భీతిల్లి గొల్లుమనడంతో ఇరుగుపొరుగు రైతులు వచ్చి ఆస్పత్రికి తీసుకెళ్లే అంతా అయిపోయింది.. ప్రస్తుతం ఈ పొలాన్ని భారతి అన్న రమేశ్ చూస్తున్నాడు. 8 ఎకరాల్లో ఇప్పటికి 6 క్వింటాళ్ల పత్తి తీశారు. మరో 2 క్వింటాళ్లు రావచ్చన్నాడు. గిడసబారిన మిరప తోట పూతమీదుంది. ఎంత దిగుబడి వస్తుందో ఆ దేముడికే ఎరుక!
 
వ్యవసాయ సూచనలిచ్చే వారే లేరు!

కల్లేపల్లిలో మెట్ట రైతులు పత్తి, మిరప తప్ప మరో పంట వేయడం లేదు. రవి బాబాయి లక్‌పతి (సొంత భూమి 4 ఎకరాల్లో పంటల మార్పిడి పాటిస్తూ కూరగాయలు, పత్తి, మిరప పండిస్తున్నాడు) వంటి ఒకరిద్దరికి తప్ప పంటల మార్పిడి అలవాటు అసలే లేదు. ఎప్పుడు ఏం చేస్తే పంట బాగుంటదో చెప్పాల్సిన వ్యవసాయాధికారి, విస్తరణాధికారులూ పత్తాలేరని కల్లేపల్లి రైతులు చెప్పారు. రవి చనిపోయినప్పుడు పంచనామాకు తప్ప వ్యవసాయ సూచనలివ్వడానికి వారు ఈ ఏడాది ఒక్కసారీ తమ గ్రామానికి రాలేదన్నారు. కల్లేపల్లిలో మాత్రమే కాదు.. తెలుగు రాష్ట్రాల్లోని గ్రామాల్లో పరిస్థితి ఇదే. పూర్తిస్థాయి వాతావరణ బీమా రక్షణతోపాటు పంటల మార్పిడి, మిశ్రమ పంటల సాగు, ఖర్చు తగ్గే సుస్థిర సాగు పద్ధతులను వ్యవసాయాధికారుల నిరంతర ప్రత్యక్ష పర్యవేక్షణలో ప్రతి గ్రామంలో రైతులకు అందించడం తప్ప సాగు సంక్షోభ నివారణకు దగ్గర దారేదీ లేదు. రవి విషాద గాథ చెబుతున్నది ఇదే.
 - పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్
 ఇన్‌పుట్స్: వల్లపురెడ్డి, మహేశ్వరరెడ్డి; ఫొటోలు: ముచ్చర్ల శ్రీనివాస్  
 
కౌలు సేద్యమే కొంపముంచింది!

తనకున్న పొలంతో సరిపెట్టుకోకుండా నీళ్లు లేని పొలాలను కౌలుకు చేయడం వల్లే రవి అప్పులపాలయ్యిండు. ‘కొంచెం చేసేది తన కొరకు.. మరింత చేసేది మంది కొరకు’ అన్నట్లయింది. సంపాయించుకొని పైకి రావాలని తాపత్రయపడ్డాడు. దేముడు అట్ల చేసిండు. వర్షాల్లేవు, కరెంటూ లేక రైతుల చావుకొచ్చింది.
 - మాలోతు లక్‌పతి, మృతుడు రవి పినతండ్రి,
 అభ్యుదయ రైతు, కల్లేపల్లి
 
గ్రామాల్లోకొచ్చి రైతులను చైతన్యవంతం చేయాలి

 వాతావరణంలో మార్పులొచ్చాయి. గతంలో మబ్బులొస్తే వర్షం పడేది. ఇప్పుడు మబ్బులొచ్చినా వర్షం పడటం లేదు. ఒక ఊళ్లో పడితే ఇంకో ఊళ్లో పడటంలేదు. ఈ ఏడాది వర్షాలు తక్కువుంటాయి.. పంటలు మార్చండి, పెట్టుబడులు తగ్గించండని మాకు ఏ అధికారీ చెప్పలేదు. పెట్టుబడులు పెరిగిపోయి రైతు దెబ్బతింటున్నాడు. వ్యవసాయాధికారులు ప్రతి గ్రామంలో  నెలకోసారి గ్రామసభలు పెట్టి రైతులను చైతన్యవంతం చేయాలి. పదేళ్లుగా మట్టి నమూనాలు ఇచ్చినా.. ఒక్కసారీ ఫలితం ఏమిటో చెప్పే స్థితిలో అధికారుల్లేరు. ఈ పరిస్థితి మారాలి. కరెంటు పగలు 3 గంటలు, రాత్రి 3 గంటలు టైంటేబుల్ ప్రకారం కచ్చితంగా ఇవ్వాలి.
 - మాలోతు రాంమోహన్ నాయక్, మాజీ ఆదర్శ రైతు, రవి దాయాది, కల్లేపల్లి
 
 బ్యాంకు రుణాలన్నీ రద్దు చేయాలి!  ఎట్ల బతకాలో తెలియటం లేదు. బ్యాంకు అప్పులన్నీ రద్దుచేసి, మా పిల్లలను  చదివించాలి. గవర్నమెంటే ఆదుకోవాలి. పత్తి విత్తనాలకు  రూ.16 వేలు ఖర్చుపెట్టినం.  అవి కూడా తిరిగొచ్చేలా లేవు..
 నాకొచ్చిన కష్టం ఇంకొక ఆడకూతురికి రాకుండా చూడాలి.

 - భారతి, మృతుడు రవి భార్య
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement