చలితిళ్లు
ఈ సీజన్‌లో దవడపళ్లపై లోడ్ ఎక్కువ!
చలికి పళ్లు పటపట కొట్టుకుంటుంటాయి.
ఆకలికి... పిండిమరలా ఆడుతుంటాయి.
పళ్లు పటపటలాడినా, పిండిమరలా ఆడినా...
కాస్త వెచ్చదనం కోసమే!
షాళ్లు, మఫ్లర్లు, మంకీ క్యాప్‌లు, స్వెటర్లు...
ఇవన్నీ... బయటి వెచ్చదనాలు.
మరి లోపలి బాడీకి?
అసలే అలవికాని కాలం, ఆవురావురు కాలం.
బెల్లీ మాటిమాటికీ బెల్ కొడుతుంది.
ఏదో ఒకటి పడేయ్ బాస్ అంటుంది.
ఈ వేడుకోలంతా ఉష్ణోగ్రత కోసమే.
అలాగని ఏది పడితే అది పడేస్తే లావైపోతాం!
కడుపునిండా లాగిస్తే కదల్లేకపోతాం!
మరేది సుఖం? మరేది శ్రేష్ఠం? మరేది ఉష్ణం?
ఓసారి ఈ పేజ్ చూడండి.
మీకు నచ్చిన ఐటమ్‌కి టిక్ పెట్టుకోండి.
ఇవి చిరుతిళ్లు మాత్రమే కాదు, చలితిళ్లు కూడా!
రవ్వ ఊతప్పం
కావలసినవి: బొంబాయిరవ్వ - కప్పు, పెరుగు - కప్పు, ఉల్లితరుగు - అర కప్పు, టొమాటో తరుగు - అర కప్పు, ఉప్పు - తగినంత, పచ్చిమిర్చి తరుగు - రెండు టేబుల్ స్పూన్లు, అల్లం తురుము - టీ స్పూను, కొత్తిమీర తరుగు - కొద్దిగా, నూనె - తగినంత
తయారి: ఒక గిన్నెలో బొంబాయిరవ్వ, పెరుగు, ఉప్పు వేసి కలపాలి ఉల్లితరుగు, టొమాటో తరుగు, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర తరుగు, అల్లం తురుము జత చేసి బాగా కలిపి సుమారు రెండు గంటలు నాననివ్వాలి స్టౌ మీద పెనం ఉంచి కాగాక, నానబెట్టుకున్న పిండిని గరిటెడు తీసుకుని, పెనం మీద మందంగా వేసి, చుట్టూ నూనె వేసి మూత ఉంచాలి ఎర్రగా కాలాక రెండవవైపు తిప్పి కాల్చి తీసేయాలి.
చలైటీగా...
ఇంట్లో పెద్దవాళ్లు ఎవ్వరూ లేరు. కడుపులో నకనకలాడుతోంది. మరి ఏం చేయాలి? మరమరాలు/ అటుకులు, ఉల్లిపాయ ఉంటే చాలు... ఒక గిన్నెలో అటుకులు లేదా మరమరాలు/ అటుకులు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కారం వేసి బాగా కలపండి. నిమ్మకాయ పిండండి. ఇవేవీ లేకుంటే మరో పని చేయవచ్చు. అటుకులకు లేదా మరమరాలకు ఆవకాయనో, గోంగూర పచ్చడినో జత చేసి బాగా కలపండి. అంతే మీరు చేసిన, మీకు నచ్చిన సరదా సరదా చిరుతిండి ఈ చలికాలంలో కారకారంగా రెడీ అయినట్లే.
ధేబ్రా
కావలసినవి: కార్న్‌ఫ్లోర్ - కప్పు, జొన్నపిండి - అర కప్పు, గోధుమపిండి - అర కప్పు, కసూరీమేథీ - 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర తరుగు - 3 టేబుల్ స్పూన్లు, నువ్వులు - టేబుల్ స్పూను, వాము - టీ స్పూను, బెల్లం - టీ స్పూను, ఉప్పు - తగినంత, పసుపు - పావు టీ స్పూను, పచ్చిమిర్చి తరుగు - 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూను, పెరుగు - 3 టేబుల్ స్పూన్లు, నీరు - కొద్దిగా, నూనె - డీప్ ఫ్రైకి సరిపడా
తయారి: ఒక పాత్రలో నూనె, నీరు, పెరుగు మినహా అన్ని పదార్థాలను వేసి బాగా కలపాలి పెరుగు జత చేసి చపాతీ పిండిలా కలిపి చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి పాలిథిన్ కవర్ మీద కొద్దిగా నూనె రాసి ఒక్కో ఉండను దాని మీద ఉంచి, చెక్కవడల మాదిరిగా చేతితో అద్దాలి స్టౌ మీద బాణలి ఉంచి అందులో నూనె పోసి కాగాక, తయారుచేసి ఉంచుకున్న ఒక్కో ధేబ్రా (గుజరాతీ వంటకం) ను వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించి పేపర్ టవల్ మీదకు తీయాలి ఇవి సుమారు నెలరోజుల వరకు నిల్వ ఉంటాయి.
మిక్స్‌డ్ వెజిటబుల్
రవ్వ పకోడీ
కావలసినవి: బొంబాయిరవ్వ - కప్పు, బియ్యప్పిండి - టేబుల్ స్పూను, కూరముక్కల తురుము - 2 కప్పులు (రెడ్‌క్యాప్సికమ్, క్యాబేజ్, క్యారట్, ఉల్లిపాయ... వీటిని సన్నగా తరగాలి), పెరుగు - అర కప్పు, అల్లం + వెల్లుల్లి + కొత్తిమీర పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు - తగినంత, కారం - అర టీ స్పూను, నూనె - వేయించడానికి తగినంత
తయారి: ఒక పాత్రలో కూరల తురుము, పెరుగు, బొంబాయిరవ్వ, బియ్యప్పిండి వేసి బాగా కలపాలి
స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, కలిపి ఉంచుకున్న పిండిని పకోడీలుగా వేసి వేయించాలి
బాగా వేగాక పకోడీలను పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి వేడివేడిగా సర్వ్ చేయాలి.
సాబూదాన్
క్యారట్ పాయసం
కావలసినవి: సగ్గుబియ్యం (సాబూదాన్) - అరకప్పు, పాలు - ఏడు కప్పులు, పంచదార - 2 కప్పులు, క్యారట్ తురుము - కప్పు, బాదంపప్పులు - పావు కప్పు (దోరగా వేయించి పొడి చేయాలి), ఏలకుల పొడి - టీస్పూను, కుంకుమపువ్వు - చిటికెడు, నెయ్యి - రెండు టేబుల్ స్పూన్లు, జీడిపప్పు, కిస్‌మిస్ - గార్నిషింగ్‌కి సరిపడా
తయారి: సగ్గుబియ్యాన్ని శుభ్రంగా కడిగి కప్పు నీటిలో సుమారు అరగంటసేపు నాననివ్వాలి
పాలను మరిగించాలి సగ్గుబియ్యంలో తగినంత నీరు పోసి ఉడికించి ఎక్కువగా ఉన్న నీటిని ఒంపేయాలి బాణలిలో నెయ్యి వేసి కరిగాక, క్యారట్ వేసి పచ్చివాసన పోయేవరకు వేయించి తీసేయాలి అదే బాణలిలో మరి కాస్త నెయ్యి వేసి జీడిపప్పు, కిస్‌మిస్‌లు వేయించి తీసేయాలి
ఒక చిన్న పాత్రలో టీ స్పూను పాలు, కుంకుమపువ్వు వేసి కలపాలి మరుగుతున్న పాలలో ఉడికించిన సగ్గుబియ్యం, వేయించి ఉంచుకున్న క్యారట్ తురుము, ఏలకులపొడి, కుంకుమపువ్వు పాలు వేసి బాగా కలిపి ఐదు నిముషాలు ఉంచాలి వేయించి ఉంచుకున్న జీడిపప్పులు, కిస్‌మిస్‌లు వేసి కలిపి దించేయాలి.
చిలగడదుంప పూరీ
కావలసినవి: చిలగడదుంపలు - పావు కిలో (ఉడికించి తొక్క తీసి బాగా మెదపాలి), బెల్లంతురుము - పావు కప్పు, గోధుమపిండి - కప్పు, ఉప్పు - తగినంత, ఏలకుల పొడి - టీ స్పూను, నీరు - పిండి కలపడానికి తగినంత.
తయారి: ఒక గిన్నెలో కొద్దిగా నీరు, బెల్లంతురుము వేసి గరిటెతో కలిపి, కరిగించి, వడకట్టాలి అదే పాత్రలో మెత్తగా చేసిన చిలగడదుంప పేస్ట్, ఏలకులపొడి, గోధుమపిండి వేసి బాగా కలపాలి తగినంత నీరు జత చేసి పూరీ పిండి మాదిరిగా కలిపి అరగంట పాటు పక్కన ఉంచాలి పిండిని చిన్న ఉండలుగా చేసి పూరీలు ఒత్తుకోవాలి బాణలిలో తగినంత నూనె పోసి కాగాక, ఒక్కో పూరీ వేసి వేయించి తీసేయాలి.
దహీ బ్రెడ్
కావలసినవి: బ్రెడ్ స్లైస్‌లు - 8, పెరుగు - 2 కప్పులు, పచ్చిమిర్చి + కొత్తిమీర పేస్ట్ - టీ స్పూను, ఉప్పు - తగినంత, అల్లంతురుము - అర టీ స్పూను, ఖర్జూరం + చింతపండు చట్నీ - రెండు టీ స్పూన్లు
తయారి: స్టౌ మీద పెనం ఉంచి కాలాక, బ్రెడ్‌స్లైసులు వేసి బటర్ జత చేసి రెండువైపులా దోరగా కాల్చి తీసేయాలి
మిక్సీలో పెరుగు, పచ్చిమిర్చి+కొత్తిమీర పేస్ట్, ఉప్పు, అల్లం తురుము వేసి మిక్స్ చేయాలి బ్రెడ్‌ను త్రికోణాకారంలో కట్ చేసి, ప్లేట్లో ఉంచి, వాటి మీద మసాలా పెరుగు వేయాలి పైన ఖర్జూరం పచ్చడితో గార్నిష్ చేసి, సర్వ్ చేయాలి.
రవ్వ వేఫిల్స్
కావలసినవి: బొంబాయిరవ్వ - కప్పు, గోధుమపిండి - అర కప్పు, పెరుగు - పావు కప్పు, క్యారట్ తురుము - 2 టేబుల్ స్పూన్లు, ఉల్లితరుగు - 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర తరుగు - 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు - తగినంత, పచ్చిమిర్చి తరుగు - టేబుల్ స్పూను, జీలకర్ర - టీ స్పూను, ఇంగువ - చిటికెడు, ఈనో సాల్ట్ లేదా బేకింగ్ సోడా - టీ స్పూను, నీరు - పిండి కలపడానికి తగినంత, నూనె - టీ స్పూను
తయారి: నీరు, బేకింగ్ సోడా మినహాయించి మిగిలిన పదార్థాలను ఒక పాత్రలో వేసి బాగా కలపాలి మిగతా పదార్థాలను జత చేసి మరోమారు కలపాలి నీరు కొద్దికొద్దిగా జత చేస్తూ మిశ్రమాన్ని గట్టిగా ఉండేలా కలపాలి వేఫిల్ ఐరన్‌ను ముందుగా వేడి చేసి పైన కొద్దిగా నూనె వేయాలి పిండిని తగినంత తీసుకుని వేఫిల్ మీద వేసి మూత బిగించాలి ఇండికేటర్ ఆకుపచ్చ రంగులోకి వచ్చిన తరువాత దించేయాలి చట్నీతో సర్వ్ చేయాలి.
సేకరణ: డా. వైజయంతి