మొక్కజొన్న
ఖరీఫ్ మొక్కజొన్న పైరు గింజ పాలు పోసుకునే దశలో పక్షుల బెడద తీవ్రంగా ఉంటుంది కాబట్టి కంకులను పక్కనున్న ఆకులతో చుట్టవ లెను. పంట నలువైపులా 2- 3 వరుసలలో ఈ పద్ధతి పాటించాలి. ఎరుపు రంగు మెరిసే రిబ్బన్లను ఉత్తర- దక్షిణ దిక్కుగా పంటకు 0.5 మీటరు ఎత్తులో కట్టాలి. ఇలా చేయడం వల్ల పక్షులు పంటపై వాలవు.
పక్వానికి వచ్చిన పైరులోని కండెలపై పొర ఎండిపోయి, గింజల అడుగు భాగంలో నల్లటి మచ్చ ఏర్పడినప్పుడు కోత చేపట్టాలి. కండెలను ఎండబెట్టి తేమ శాతం 20కి తగ్గిన తర్వాత నూర్పిడి చేయాలి.
పత్తి
పత్తి పూత, మొగ్గ సమయంలో బోరాన్ లోపం వల్ల పూల ఆకారం మారి ఆకర్షణ పత్రాలు చిన్నవై లోపలికి ముడుచుకునిపోతాయి.
లోపం ఎక్కువగా ఉన్నప్పుడు పూత, మొగ్గ దశలో ఎండిపోవడం, చిన్న కాయలు రాలిపోవడం, మొక్కలు గిడసబారిపోవడం, ప్రధాన కాండంపై పగుళ్లు ఏర్పడడం, కాయలు సరిగ్గా అభివృద్ధి చెందకపోవడం, కాయలపై పగుళ్లు ఏర్పడటంలాంటి లక్షణాలను గమనించవచ్చును.
వేరుశనగ..
ఖరీఫ్‌లో విత్తుకొన్న వేరుశనగ పంట ప్రస్తుతం కాయ తవ్వి తీసే దశలో ఉంది. 70-80 శాతం మొక్కల ఆకులు, కొమ్మలు పసుపు వర్ణంగా మారి, కాయ డొల్ల లోపలి భాగం నలుపుగా మారినప్పుడు మాత్రమే కోయాలి.
కోత సమయంలో నేలలో తగినంత తేమ ఉండాలి.
భూమి నుంచి మొక్కలను తీయడానికి ట్రాక్టర్‌తో నడిసే వ్యవసాయ వర్సిటీ రూపొందించిన బ్లేడు గుంటక లేక వేరుశనగ డిగ్గరును వాడుకోవాలి.
విత్తనం కొరకు కావాల్సిన కాయలను నేరుగా ఎండలో ఎండబెట్టి కూడా నీడలో ఆరబెట్టాలి.
కాయల్లో తేమ శాతం 9కి లోపు ఉండేటట్లు ఆరబెట్టి గోనె లేక పాలిథిన్ సంచుల్లో నిల్వ చేయాలి.
చెరకు
సున్నం పాలు ఎక్కువగా ఉన్న నేలల్లోనూ, వర్షాభావ పరిస్థితుల్లోనూ, మరియు అధిక వర్షాలు వచ్చినప్పుడు కూడా బోరాన్ లోపం కనిపిస్తుంది.
బోరాన్ లోప నివారణకు పైరు వేసిన 60 మరియు 90 రోజులప్పుడు లీటర్ నీటికి 1.5 గ్రా. బొరాక్స్ వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయవలెను.
మొర్రం గడ్డ (గెన్సు గడ్డలు)
తెలంగాణ జిల్లాల్లో అక్టోబర్- నవంబర్ మాసాలు ఈ పంట సాగుకు అనుకూలం.
అధిక దిగుబడినిచ్చే రకాలైన సామ్రాట్, కిరణ్. ఆర్‌ఎన్‌ఎస్‌పి-1లను సాగు చేసుకోవాలి.
ఎకరాకు 6-8 టన్నుల దిగుబడిని తక్కువ సాగు ఖర్చుతో పొందవచ్చును.
డాక్టర్ దండ రాజిరెడ్డి, పరిశోధన మరియు విస్తరణ సంచాలకులు
ప్రొ. జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ
విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్, హైదరాబాద్
ఈ వారం వ్యవసాయ సూచనలు
Published Sun, Oct 5 2014 11:47 PM | Last Updated on Sat, Sep 2 2017 2:23 PM
Advertisement
Advertisement