ప్రకృతి సాగులో 'అమృతంఫలం'
ఖర్చు తక్కువతో కచ్చితమైన నికరాదాయం పొందుతూ భూసారాన్ని కూడా పెంపొందించుకుంటూ రైతులోకానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు గుంటూరు జిల్లా నాదెండ్ల రైతులు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న ఈ అరటి రైతులు పండిస్తున్న నాణ్యమైన అరటి గెలలను వ్యాపారులు అధిక ధర చెల్లించి మరీ కొనుగోలు చేస్తున్నారు. ఆరేళ్ల నాడు నల్లమోతు సాంబశివరావు అనే రైతు ప్రారంభించిన పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయాన్ని ఇప్పుడు పలువురు రైతులు అనుసరిస్తున్నారు.
సాంబశివరావు 2000 సంవత్సరం నుంచి రసాయనిక వ్యవసాయ పద్ధతిలో కర్పూర అరటి సాగు చేస్తున్నారు. సాగు వ్యయం అంతకంతకూ పెరిగిపోతుండడంతో నికరాదాయం బాగా తగ్గిపోతూ వచ్చిన నేపథ్యంలో.. మహారాష్ట్రకు చెందిన పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ పితామహుడు సుభాష్ పాలేకర్ వద్ద సాగు పద్ధతిలో శిక్షణ పొంది.. ఈ పద్ధతిలో అరటి సాగును కొనసాగిస్తున్నారు. పొలం పనులన్నీ వీలైనంతవరకు సాంబశివరావు దంపతులే స్వయంగా చేసుకుంటారు. ఆవు పేడ, మూత్రం తదితరాలతో జీవామృతం తయారు చేసి పంటలకు వేస్తారు. దగ్గర్లోని గోశాల నుంచి ఆవు పేడ, మూత్రం తెచ్చుకుంటూ ప్రకృతి వ్యవసాయం చేస్తూ.. మనసుంటే మార్గం ఉంటుందన్న సూక్తిని నిజం చేస్తున్నారు.
ఈ గెలలకు మార్కెట్‌లో మంచి గిరాకీ
ఎకరాకు 900 పిలకలు నాటుతారు. మంగళగిరి, మందడం, పెనుమాక వంటి కృష్ణా పరివాహక ప్రాంతం నుంచి మొక్క రూ. 5 చొప్పున కొనుగోలు చేసి నాటుతున్నారు. అయితే, వీటిలో 150 మొక్కల వరకు వివిధ కారణాలతో పాడయిపోతాయి. పొలంలో పిలకలు నాటిన ఏడాదిలోపు కాపు ప్రారంభమౌతుంది. ఈ తోటలకు రసాయనిక పురుగుమందులు, రసాయనిక ఎరువులు వాడకపోవటంతో మార్కెట్‌లో ఈ అరటి గెలలకు మంచి గిరాకీ ఉంది. మంచి రంగు, సైజుతో అరటి కాయలు చాలా ఆకర్షణీయంగా ఉండటంతో వ్యాపారులు అధిక ధర ఇచ్చి కొంటున్నారు. ఎక్కువ రోజులు నిల్వ ఉండడం.. పురుగుమందుల అవశేషాలు లేకపోవటం వలన వినియోగదారులు ఈ అరటి పండ్లను ఇష్టపడుతున్నారు.
ఇదీ సాగు పద్ధతి..
రైతులకు అధిక నికరాదాయం అందిస్తున్న పాలేకర్ ప్రకృతి వ్యవసాయంలో జీవామృతం ముఖ్య భూమిక పోషిస్తోంది. ఎకరా అరటి తోటకు పది కేజీల ఆవుపేడ, పది లీటర్ల ఆవుపంచకం, రెండు కేజీల బెల్లం, రెండు కేజీల అలసంద పిండి (మినపపిండి లేదా శనగపిండి లేదా మరేదైనా పప్పుల పిండి)ని 200 లీటర్ల నీటిలో కలిపి రెండు రోజులు మురగబెడతారు. వాడకానికి సిద్ధమైన జీవామృతాన్ని వడకట్టి విద్యుత్ సౌకర్యం ఉన్న రైతులు డ్రమ్ముకు మోటారు బిగించి డ్రిప్ పద్ధతిలో మొక్కలకు అందిస్తారు. విద్యుత్ సౌకర్యం లేని రైతులు నేరుగా మొక్కకు పావు లీటరు చొప్పున ప్రతి 15 రోజులకోసారి పోస్తారు. ఈ రైతులు రసాయనిక పురుగుమందులు, ఎరువులు వాడకపోవడం వల్ల సాగు ఖర్చు సగం తగ్గింది.
పశువుల ఎరువుకు జీవామృతం కలిపి..
గత ఏడాది అధిక వర్షాల వల్ల నాదెండ్ల ప్రాంత రేగడి భూముల్లో పంటలు ఉరకెత్తి దెబ్బతినే పరిస్థితి వచ్చింది. అప్పుడు కొందరు రైతులు రసాయనిక ఎరువులు చల్లినా.. సాంబశివరావు, ఆయన దాయాది నారాయణస్వామి, పరమేశ్వరరావు తదితర రైతులు మాత్రం కొత్త పద్ధతిని అవలంభించి మంచి ఫలితాలు పొందుతున్నారు. పశువుల ఎరువుకు జీవామృతం కలిపి 15 రోజులు చివికిన తర్వాత.. ఒక్కో అరటి మొక్క డ్రిప్పర్ దగ్గర 200 గ్రాముల చొప్పున వేస్తున్నారు. ఈ పద్ధతిలో ఎకరం అరటి తోటకు ఒక పంటకాలానికి ట్రాక్టర్ ట్రక్కు సరిపోతుంది. దీంతో తోట బ్రహ్మాండంగా తిప్పుకుంది. మొక్కలు బలంగా ఏపుగా పెరిగి, కాయ సైజు బాగా పెరగడంతో మార్కెట్‌లో అత్యధిక ధర పలుకుతున్నదని సాంబశివరావు ఆనందంగా చెబుతున్నారు. గత ఏడాది అధిక వర్షాలు వచ్చినప్పుడు అరటి చెట్ల పక్కన ముందుజాగ్రత్తగా మరో పిలకను కూడా పెరగనిచ్చారు. కొద్ది నెలల్లో రెండో పంట కూడా బోనస్‌గా అందివస్తుందని ఆశిస్తున్నారు. రసాయనిక వ్యవసాయం చేసే పొలాల్లో పెరిగిన అరటి గెలకు ఎనిమిది నుంచి 10 హస్తాల పండ్లు ఉంటాయి. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన గెలకు 15 హస్తాల వరకు ఉంటున్నాయని రైతులు చెప్పారు. వేసవిలో తీవ్ర వడగాలులకు రసాయనిక ఎరువులతో సాగు చేసిన అరటి తోటలు బాగా వడబడి పోతున్నా ప్రకృతి వ్యవసాయంలో ఉన్న తోటలు కళగానే ఉండడాన్ని ఇతర రైతులు సైతం గుర్తించడం విశేషం.
ఒకరిని చూసి మరొకరు..
సాంబశివరావు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రారంభించినప్పుడు ఎగతాళి చేశారు. అయితే, ఈ పద్ధతిలో పండించిన కాయలకు అధిక ధర వస్తుండటంతో గ్రామంలో మరో 10 మంది రైతులు ఈ సాగు పద్ధతిని అనుసరిస్తున్నారు. అరటి సాగు 30 ఎకరాలకు విస్తరించింది. వివిధ జిల్లాలకు చెందిన రైతులు సైతం ఈ అరటి తోటలను చూసి స్ఫూర్తి పొందుతుండడం విశేషం.
- కాట్రు శ్రీనివాసరావు, నాదెండ్ల, గుంటూరు జిల్లా
ఎకరాకు రూ. లక్ష లాభం..
మొదట్లో నేను ఈ పద్ధతిని అవలంభిస్తున్నపుడు తోటి రైతులు హేళన చేశారు. కానీ మూడేళ్లు ఫలితాలు చూశాక కొంతమంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేపట్టారు. ఎకరానికి రసాయనిక ఎరువులు 30-40 బస్తాల వరకు వేస్తున్న రైతులున్నారు. నాకు ఎకరానికి రూ. 15 వేల లోపు ఖర్చవుతోంది. వాళ్ల ఖర్చులో మా ఖర్చు సగమే. అరటి తోట గాలులకు పడిపోకుండా ఉంటే.. ఎకరానికి రూ. లక్ష నికరంగా మిగులుతుంది. మొదట్లో దిగుబడి తక్కువగా ఉంది. ఇప్పుడు రసాయనిక ఎరువులు వేసిన పొలాల్లోకన్నా మిన్నగానే ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా భూమి సారవం తమవుతోంది. మా గెలలకు ధర కూడా ఎక్కువే వస్తున్నది. పాలేకర్ ప్రకృతి వ్యవసాయం పూర్తిగా సక్సెస్ అయ్యిందని నేను అనుకుంటున్నా. పేడతో చేసే పని కాబట్టి.. మార్పు నెమ్మదిగా ఉంది.. వచ్చే పదేళ్లలో రైతులందరూ వాళ్ల పిల్లల కోసమైనా ఈ దారికి రాక తప్పదు. పనులు చేసే అలవాటున్న రైతు దంపతులు పదెకరాల్లో అరటి సాగు చేయొచ్చు.
- నల్లమోతు సాంబశివరావు (93473 84545),
అరటి రైతు, నాదెండ్ల, గుంటూరు జిల్లా
తోట దగ్గరికొచ్చి కొనుక్కెళ్తున్నారు..!
నాకున్న ఎకరం పొలంలో పాలేకర్ పద్ధతిలో కర్పూర అరటి సాగు చేశాను. మొదటి కాపులోనే రూ. లక్ష ఆదాయం వచ్చింది. నీటి సౌకర్యం ఉండటంతో కాయ సైజు బాగా వచ్చింది. మార్కెట్‌లో మంచి ధర లభించింది. వ్యాపారులు తోట దగ్గరకే వచ్చి కొనుక్కెళ్లడంతో రవాణా ఖర్చులూ మిగిలాయి. ప్రకృతి వ్యవసాయంలో శ్రమ ఎక్కువ. ఖర్చు తక్కువ.
- దేవబత్తుని పరమేశ్వరరావు (98666 56665),
రైతు, నాదెండ్ల, గుంటూరు జిల్లా
ఆన్‌లైన్‌లో అమ్ముతా..
ఎకరం 30 సెంట్ల భూమిలో గతేడాది ఈ పద్ధతిలో కూర అరటి, బొప్పాయి పంటలు సాగు చేశా. మొదటి ఏడాది రూ. లక్షన్నర ఆదాయం వచ్చింది. చక్కెరకేళీ కూడా సాగు చేస్తున్నా. త్వరలో సేంద్రియ ఆహార పదార్థాల ధృవీకరణను పొంది ఆన్‌లైన్ బుకింగ్ ద్వారా టోకు వ్యాపారస్తులకు నేరుగా అమ్ముతా. వినియోగదారులకు డోర్ డెలివరీ చేస్తా.
- ఎన్. నారాయణస్వామి (99511 66287),
రైతు, నాదెండ్ల, గుంటూరు జిల్లా