సంతానలక్ష్మి సాహివాల్!
ఈతకు డజను దూడలకు జన్మనిచ్చే పద్ధతిని కనుగొన్న పంజాబ్ శాస్త్రవేత్తలు
అంతరించిపోతున్న దేశీయ గో జాతుల పరిరక్షణ, వాటి సంఖ్యను పెంచేందుకు జరుగుతున్న కృషిలో ఇది మేలిమలుపు. ఆవు సాధారణంగా ఒక ఈతలో ఒకే దూడను పెడుతుంది. అయితే, అండాల మార్పిడి విధానం ద్వారా ఒకే ఈతలో ఎక్కువ సంఖ్యలో దూడలను పుట్టించేందుకు పంజాబ్ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధన సత్ఫలితాలనిచ్చింది. దేశీ ఆవు సాహివాల్ ఇటీవల ఒకే ఈతలో నాలుగు దూడలకు జన్మనిచ్చింది. లూధియానాలోని గురు అంగద్‌దేవ్ పశువైద్య విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఈ అద్భుతాన్ని సాధించారు. ఈ పద్ధతి ద్వారా ఒకే ఈతలో పన్నెండు దూడలు జన్మించే వీలుందని వారు చెపుతుండటం అత్యంత ఆశ్చర్యం కలిగించే విషయం. ఈ ప్రయోగం కోసం శాస్త్రవేత్తలు జలంధర్ జిల్లాలోని నూర్‌మహల్ దివ్యజ్యోతి జాగృతి సంస్థాన్‌కు చెందిన సాహివాల్ జాతి ఆవులను ఎంపిక చేశారు.
కృత్రిమ గర్భధారణ ద్వారా ఆవుకు ఒక ఈతలో నాలుగు దూడలు జన్మించాయి. ఆవు, దూడలు ఆరోగ్యంగా ఉన్నాయి. మంచి పాలసార కలిగినది సాహివాల్ ఆవు. రోజుకు 20 లీటర్లకు పైగా పాలు ఇస్తుండడంతో 4 దూడలకు సరిపోతున్నాయి. ఆవు ఎద సమయంలో సాధారణంగా ఒక అండాన్ని మాత్రమే విడుదల చేస్తుంది. కానీ శాస్త్రవేత్తలు ప్రత్యేక పద్ధతిలో హార్మోన్‌లను ప్రభావితం చేయటం ద్వారా ఎక్కువ సంఖ్యలో అండాలు విడుదలయ్యేలా చేస్తారు. కనిష్టంగా 25 - 30 వరకు, గరిష్టంగా 90 వరకు అండాలు విడుదలవుతాయి. ఇలా విడుదలైన అండాలతో కృత్రిమ గర్భధారణ చేయించి, ఆవు గర్భంలోకి ప్రవేశపెడతారు. శస్త్రచికిత్స అవసరం లేకుండానే ఈ ప్రక్రియను పూర్తి చేయడం మరో విశేషం. ఇందుకయ్యే ఖర్చు రూ.1,000- 1,200 మాత్రమే.
అధిక పాలసార (రోజుకు 20 లీటర్లకు పైగా) కలిగిన పంజాబీ ఆవుల జాతి కావడంతో సంకరం కాని సాహివాల్ ఆవులు, ఆంబోతులకు అధిక డిమాండ్ ఉంది. ప్రతికూల వాతావ రణ పరిస్థితుల్లోనూ సాహివాల్ ఆవులు అధిక పాల దిగుబడిని ఇస్తాయి. పోషణ ఖర్చు తక్కువ, పాల దిగుబడి ఎక్కువ. అయినా చాలా కాలంగా పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈ జాతి పశువులు అంతరించిపోయే దశలో ఉన్నాయి. అయితే, శాస్త్రవేత్తలు తాజాగా కనుగొన్న అండాల మార్పిడి పద్ధతి ద్వారా ఈ జాతి సంతతిని పెంపొందించడం సులభతరం కానుంది.
- దండేల కృష్ణ, సాగుబడి డెస్క్