ఒక్క గుక్కకు... రెండు కిక్కులు! | summer season in cool... cool drinks | Sakshi
Sakshi News home page

ఒక్క గుక్కకు... రెండు కిక్కులు!

Published Fri, May 23 2014 11:14 PM | Last Updated on Sat, Sep 2 2017 7:45 AM

ఆమ్ పన్నా

ఆమ్ పన్నా

పానీయాలు...
ఎండ తీవ్రతను అధిగమించే ఉపాయాలెన్నో. గొడుగులు విప్పి అడుగులు ముందుకేస్తారు కొందరు. మడుగుల్లో దిగి ఈదులాడుతూ సేద దీరుతారు ఇంకొందరు. రుచీ పచీ లేని ఇలాంటి ఉపాయాలు మనకేల? ఎండకు మండే డ్యూటీ కొండలకు వదిలేసి... గ్లాసు నిండా పానీయాలను నింపుకునేలాంటివీ, నోటి నిండా రుచులను ఒంపుకునేలాంటివీ ప్లాన్ చేద్దాం. టెంప్టయిపోయి మగ్గును ఎంప్టీ చేసే ఈ ప్లాన్‌తో ఒక్క గుక్కకు రెండు కిక్కులు!  మొదటిది వడదెబ్బకు, రెండోది రుచులు కోరే జిహ్వకు. జిహ్వకో రుచి అన్న సామెతను అబద్ధం చేస్తూ... షడ్రుచులకు ఒకటి తగ్గించి అచ్చంగా ఐదు రుచుల పానీయాలను ఏర్పాటు చేస్తున్నాం.  నాల్కపై ఒక్కో చుక్క వేస్తూ ఎండను ఏడిపించండి. వడదెబ్బను ఓడించండి. పానీయాల స్విమ్మింగ్ పూల్‌లో  నాల్కలను ఈదులాడిద్దాం రండి.
 
ఆమ్ పన్నా
కావలసినవి: పచ్చి మామిడికాయ - 1 (పెద్దది); జీలకర్ర పొడి - టేబుల్ స్పూను; నల్ల ఉప్పు - టీ స్పూను; పంచదార  / బెల్లం - తగినంత; మిరియాలు - 4; పుదీనా ఆకులు - గుప్పెడు; చల్లటి నీళ్లు - తగినన్ని
 తయారీ: ఒక గిన్నెలో మామిడికాయ, మూడు కప్పుల నీళ్లు పోసి కుకర్‌లో ఉంచి ఉడికించాలి  బయటకు తీసి చల్లారాక మామిడికాయ తొక్క, టెంక వేరు చేసి, గుజ్జును మిక్సీలో వేసి మెత్తగా చేయాలి  ఒక గిన్నెలో ముప్పావు కప్పు నీళ్లు, పావు కప్పు పంచదార వేసి కరిగేవరకు ఉంచి, దించేసి చల్లారాక ఫ్రిజ్‌లో ఉంచాలి.

(బెల్లం వాడుతుంటే కప్పుడు బెల్లం తురుము, రెండు కప్పుల నీళ్లు పోసి బెల్లం కరిగించి, వడపోయాలి. అలా చేయడం వల్ల తుక్కు వంటివి ఉంటే పోతాయి. ఆ తరువాత స్టౌ మీద ఉంచి పాకం చిక్కబడేవరకు సన్నని మంట మీద ఉంచి ఉడికించి, దించేయాలి. చల్లారాక ఫ్రిజ్‌లో ఉంచి సుమారు గంట తరువాత బయటకు తీయాలి. మామిడికాయలో ఉండే పులుపును బట్టి ఉపయోగించే పదార్థాల పరిమాణం పెంచుకోవడం లేదా తగ్గించుకోవడం చేయాలి.

మామిడికాయ మరీ పీచు ఉన్నదైతే రసం తయారుచేసుకున్నాక వడకట్టాలి)  మిక్సీలో నాలుగు టేబుల్ స్పూన్ల మామిడికాయ గుజ్జు, 2 టేబుల్ స్పూన్ల పంచదార పాకం, పావు టీ స్పూను జీలకర్ర పొడి, పావు టీ స్పూను నల్ల ఉప్పు, మిరియాలు, పుదీనా ఆకులు వేసి మెత్తగా చేయాలి పావు కప్పు చల్లటి నీళ్లు జత చేసి, మరో మారు మిక్సీలో తిప్పాలి  గ్లాసులలోకి పోసి చల్లగా అందించాలి.
 
రాగి ఆల్మండ్ డ్రింక్
కావలసినవి: రాగి పిండి - 2 టేబుల్ స్పూన్లు; బాదం పప్పులు - 10 +4 (వేయించి మెత్తగా పొడి చేయాలి); చల్లటి నీళ్లు - అర  కప్పు; బెల్లం తురుము / డేట్స్ సిరప్- 3 టేబుల్ స్పూన్లు; చల్లటి పాలు - గ్లాసు
 తయారీ: ముందుగా కప్పు చల్లటి నీళ్లలో రాగిపిండి, బాదం పప్పుల పొడి వేసి బాగా కలపాలి  నాలుగు కప్పుల నీళ్లలో బె ల్లం తురుము వేసి స్టౌ మీద ఉంచి కరిగించాలి  మంట తగ్గించి రాగి పిండి + బాదం పప్పుల నీళ్లు పోయాలి  సుమారు రెండు మూడు నిమిషాలు ఉడికిస్తే మిశ్రమం చిక్కగా తయారవుతుంది  మంట మీద నుంచి దింపి, చల్లారనివ్వాలి  చల్లబడేసరికి మిశ్రమం బాగా చిక్కగా అవుతుంది  చల్లటి పాలు జత చేసి గిలక్కొట్టాలి  బాదం పలుకులతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి  
 
 
కుకుంబర్ మింట్ స్మూతీ
కావలసినవి: కీర దోసకాయ ముక్కలు - అర కప్పు (దోసకాయ చెక్కు తీసి చిన్న ముక్కలు గా తరగాలి); పుదీనా ఆకులు - 5; ఐస్ క్యూబ్స్ - కొన్ని; గట్టి పెరుగు - రెండు కప్పులు; నీళ్లు - కొద్దిగా; చాట్ మసాలా - చిటికెడు; నల్ల ఉప్పు - కొద్దిగా
 తయారీ: కీరదోసకాయ ముక్కలు, పుదీనా ఆకులను మిక్సీలో వేసి మెత్తగా చేయాలి  ఒక పాత్రలో పెరుగు, నల్ల ఉప్పు, చాట్ మసాలా, టేబుల్ స్పూను నీళ్లు వేసి గిలక్కొట్టాలి  కీరదోస + పుదీనా పేస్ట్ జత చేసి మరోమారు గిలక్కొట్టాలి  గ్లాసులలో ఈ మిశ్రమం వేసి ఐస్ క్యూబ్స్ జత చేసి అందించాలి.
 
ఐస్‌డ్ లెమన్ మింట్ టీ
 కావలసినవి: చల్లటి నీళ్లు - కప్పు; మామూలు నీళ్లు - ఒకటిన్నర కప్పులు; పంచదార / తేనె - 2 టేబుల్ స్పూన్లు; నిమ్మరసం - ఒకటిన్నర టేబుల్ స్పూన్లు; టీ బ్యాగ్ - ఒకటి; ఐస్ క్యూబ్స్ - కొద్దిగా; పుదీనా ఆకులు - 5;
 నిమ్మ చెక్కలు - 2

 తయారీ
ఒక పాత్రలో అర కప్పు నీళ్లు పోసి పంచదార జత చేసి స్టౌ మీద ఉంచి పంచదార కరిగించాలి కిందకు దించి, అందులో ఒక టీ బ్యాగ్ వేసి చల్లారే వరకు ఉంచాలి చల్లబడిన టీకి, చల్లటి  నీళ్లు, నిమ్మరసం జత చేయాలి  పుదీనా ఆకులను చేతితో గట్టిగా నలిపి మెత్తగా చేయాలి  రెండు గ్లాసులు తీసుకుని, ఒక్కో గ్లాసులో పుదీనా ఆకులు, ఐస్ క్యూబ్స్ నిమ్మ చెక్క వేయాలి  నిమ్మరసంతో తయారైన టీని గ్లాసులలో పోసి అందించాలి.
 
స్పైసీ బటర్‌మిల్క్
 కావలసినవి: మజ్జిగ - 4 గ్లాసులు (ఒక భాగం పెరుగు, 3 భాగాలు నీళ్లు పోసి చేయాలి);  ఉప్పు - తగినంత; నిమ్మ రసం -2 టేబుల్ స్పూన్లు;  నూనె - పావు టీ స్పూను; ఆవాలు - పావు టీ స్పూను; కరివేపాకు - రెండు రెమ్మలు; అల్లం తురుము - అర టీ స్పూను; పచ్చి మిర్చి - 4 (చిన్న ముక్కలుగా కట్ చేయాలి); కొత్తిమీర తరుగు - టీ స్పూను; నిమ్మ ఆకులు - 2 (చిన్న ముక్కలుగా చేయాలి)

తయారీ: ఒక పాత్రలో మజ్జిగ, ఉప్పు, నిమ్మ రసం వేసి కవ్వంతో బాగా గిలక్కొట్టాలి  స్టౌ మీద బాణలి ఉంచి నూనె కాగాక ఆవాలు వేసి చిటపటలాడించాలి కొద్దిగా కరివేపాకు జత చేసి దించేయాలి  మజ్జిగ ఉన్న పాత్రలో... వేయించి ఉంచుకున్న ఆవాలు, కరివేపాకు వేయాలి అల్లం తురుము, పచ్చిమిర్చి, నిమ్మ రసం వేసి గిలక్కొట్టాలి  కొత్తిమీర, నిమ్మ ఆకులు వేసి గాజు గ్లాసులలో పోసి అందించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement