మన రైతుల ఆవిష్కరణలు పనికిరావా? | The discoveries of our farmers to come to work? | Sakshi
Sakshi News home page

మన రైతుల ఆవిష్కరణలు పనికిరావా?

Published Wed, Nov 12 2014 11:24 PM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM

మన రైతుల  ఆవిష్కరణలు  పనికిరావా? - Sakshi

మన రైతుల ఆవిష్కరణలు పనికిరావా?

రైతాంగాన్ని కుంగదీస్తున్న ముఖ్య సమస్యల్లో కూలీల కొరత ఒకటి. రైతుల ఆర్థిక స్తోమతకు, వారి ప్రత్యేక అవసరాలకు తగిన యంత్ర పరికరాలను అందుబాటులోకి తేవడం ముఖ్యం. ప్రస్తుతం మార్కెట్లోని యంత్ర పరికరాల్లో అత్యధికం ఆర్థిక స్తోమత ఉన్న పెద్ద, మధ్యతరగతి రైతులకు అందుబాటులో ఉండేవే. చిన్న, సన్నకారు రైతులు సొంతంగా కొని తమ చిన్న కమతాల్లో ఉపయోగించుకోగలిగే చిన్నతరహా యంత్ర పరికరాలను, పనిముట్లను.. తక్కువ ధరకు అందుబాటులోకి తేవాలి. ప్రొ. జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇటీవల నిర్వహించిన సమావేశంలో యువ రైతులు ఇదే కోరారు. చైనా నుంచి ఇటువంటి యంత్ర పరికరాలు, పనిముట్ల ప్రొటోటైప్‌లను దిగుమతి చేసుకొని, స్థానికంగా వాటిని తయారుచేసి రైతులకిస్తామని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య ఈ సందర్భంగా చెప్పారు. అయితే, దేశవ్యాప్తంగా మట్టిలో ఉన్న మాణిక్యాల్లాంటి మన ‘రైతు శాస్త్రవేత్త’లు సొంత తెలివితేటలు, సృజనాత్మకతలను కలబోసి ఆవిష్కరించిన యంత్ర పరికరాలెన్నో అందుబాటులో ఉన్న విషయమై ఎవరూ గుర్తుకు రాలేదు! ఇటువంటి అమూల్యమైన మన ‘రైతు శాస్త్రవేత్త’ల ఆవిష్కరణలను ‘సాక్షి’ దినపత్రిక ‘సాగుబడి’ పేజీ ద్వారా సామాజిక బాధ్యతతో వెలుగులోకి తెచ్చింది.. తెస్తోంది!  అవసరమైన యంత్ర పరికరాలను చైనా నుంచైనా తెచ్చుకోవడంలో తప్పులేదు. అయితే, అంతకన్నా ముందు మన ‘రైతు శాస్త్రవేత్త’ల ఆవిష్కరణలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవడం సముచితం.
 
రైతులోకం నుంచి అపూర్వ స్పందన


రైతుల కోసం రైతులే స్వయంగా రూపొందించిన సృజనశీలమైన ఈ యంత్ర పరికరాలు స్థానిక వ్యవసాయ అవసరాలకు ఎంతో అనువైనవి. తక్కువ పెట్టుబడితో తయారు చేసుకోదగినవి. వీటిలో చాలా యంత్ర పరికరాలను కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖకు అనుబంధంగా ఉన్న నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ (ఎన్.ఐ.ఎఫ్.) గుర్తించింది. ‘హనీబీ నెట్‌వర్క్’, ‘పల్లెసృజన’ వంటి సంస్థల తోడ్పాటుతో ఈ అజ్ఞాత సూర్యుల్లో కొందరు రాష్ట్రపతి పురస్కారాలనూ అందుకున్నారు. ‘సాక్షి’ సాగుబడి పేజీ ద్వారా ఈ ఆవిష్కరణల గురించి  తెలుసుకున్న రైతులోకం అపూర్వ రీతిలో స్పందించడమే వీటి ఆవశ్యకతను తెలియజెప్తున్నది. మచ్చుకు కొన్ని ఆవిష్కరణల వివరాలను టూకీగా ఇక్కడ  పొందుపరుస్తున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఇప్పటికైనా ఇటువంటి అమూల్యమైన ఆవిష్కరణలపై దృష్టి సారిస్తాయనుకోవడం అత్యాశ కాదేమో..
 
గ్రామీణ ఆవిష్కరణలకు  ‘నారమ్’ సలామ్!

భారతదేశపు వ్యవసాయ రంగంలో నిశ్శబ్దంగా రూపుదిద్దుకుంటున్న గ్రామీణ సృజనాత్మక ఆవిష్కరణల విప్లవాన్ని వ్యవసాయ శాస్త్రవేత్తల దృష్టికి తేవడానికి హైదరాబాద్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్‌మెంట్(నారమ్) సంస్థ ఇటీవల ఒక సంకలనాన్ని ప్రచురించింది. 13 మంది రైతులు, ఇతర గ్రామీణ వృత్తిదారుల అమూల్యమైన సృజనాత్మక ఆవిష్కరణల గురించి ఈ పుస్తకం వివరిస్తుంది. సీనియర్ మహిళా శాస్త్రవేత్తలు డా. ఆర్. కల్పనా శాస్త్రి, ఓ.కె. తార సంయుక్తంగా ‘రూరల్ ఇన్నోవేషన్స్ ః గ్రాస్‌రూట్స్’ పేరిట ఈ సంకలనాన్ని వెలువరించారు. గ్రామీణ ఇన్నోవేటర్లు దేశ వ్యవసాయాభ్యుదయంలో ఒక ముఖ్యమైన పాత్రను నిర్వహిస్తున్నారని చాటిచెప్పటమే ఈ పుస్తకం ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు కూడా. గ్రామాల్లోని ఈ సృజనశీలురకున్న సహజ, సంప్రదాయ, క్రియాశీల జ్ఞానాన్ని.. సమస్యల అవగాహనా శక్తిని వ్యవసాయ పరిశోధనాశాలలు, శాస్త్రజ్ఞులు గుర్తించి శాస్త్రీయ పరిశోధనకు వినియోగించుకోవాలని ఆకాంక్షించారు. శాస్త్రవేత్తలకు, రైతు శాస్త్రవేత్తలకు మధ్య అనుసంధానం ఏర్పడడానికి ఈ గ్రంథం ఉపకరిస్తుందని ఆశిద్దాం.
 
మహిపాల్ వీడర్‌తో కలుపు కష్టాలకు చెక్!

కూరగాయ పంటలు, ఉద్యాన తోటల్లో కలుపు నివారణ రైతులకు తీవ్ర సమస్యగా మారింది. ఈ సమస్య పరిష్కారానికి మెట్ట పంటల్లో చేతితో నడిపే వీడర్లను తయారు చేశాడు కడివెండి మహిపాల్‌చారి. ఆయన స్వగ్రామం వరంగల్ జిల్లా పరకాల మండలంలోని సీతారాంపురం. రూ. 28 వేల ధరలో కూరగాయ పంటలకు 4 హెచ్‌పీ సామర్థ్యం కలిగిన వీడర్‌ను.. పత్తి, మామిడి, అరటి, మల్బరీ తదితర తోటలకు 5 హెచ్‌పీ వీడర్‌ను తయారు చేశాడు. లీటరు డీజిల్‌తో 3 గంటల్లో ఎకరం పొలంలో నిలువు, అడ్డం దున్నేయవచ్చు. ఇప్పటికి 62 మంది రైతులకు తయారు చేసిచ్చాడు. ఆ రైతు భూమి తీరుకు అనుగుణంగా వీడర్‌ను తయారుచేయడం విశేషం. ప్రభుత్వం తలచుకుంటే వీటిని పెద్ద సంఖ్యలో రైతులకు అందుబాటులోకి తేవచ్చు. తెల్లకుసుమ పూరేకులను సేకరించే చేతి పరికరాన్ని కూడా రూపొందించాడు. మహిపాల్ మొబైల్: 98669 22168 (‘సాగుబడి’ కథనం తేదీ: 17-02-2014)
 
 వాయువేగం..  సుభానీ స్ప్రేయర్లు!

అత్యంత వేగంగా పొలాలకు పురుగుమందులు/ జీవామృతం / కషాయాలు పిచికారీ చేసే స్ప్రేయర్లను తయారు చేసిన సృజనశీలి సయ్యద్ సుభానీ. కరువు కాలంలో పంటలపై నీటిని పిచికారీ చేయడానికి కూడా ఈ స్ప్రేయర్లు ఉపకరిస్తాయి. ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలంలోని నాగభైరవపాలెం. సుభానీ వృత్తిరీత్యా వడ్రంగి. ట్రాక్టర్‌కు బిగించి శరవేగంతో పని పూర్తిచేసేందుకు 50 నుంచి 100 అడుగుల వెడల్పు రెక్కలు కలిగిన వేర్వేరు స్ప్రేయర్లను రూపొందించాడు. భారీ కమతాలున్న రైతుల కోసం పది నిమిషాల్లో హెక్టారులో పిచికారీని పూర్తి చేయగల స్ప్రేయర్ కూడా ఇందులో ఉంది. చిన్న, సన్నకారు రైతుల కోసం.. మోటారు సైకిల్‌కు అమర్చి 30 అడుగుల వెడల్పున పిచికారీ చేసే స్ప్రేయర్‌ను ఇటీవల తయారు చేశాడు. మహిళలు కూడా వినియోగించడానికి అనువుగా దీన్ని తయారు చేయడం విశేషం.  
 సుభానీ మొబైల్: 98486 13687
 (‘సాగుబడి’ కథనం తేదీ: 10-03-2014)
 
 
గురవయ్య గొర్రు

కూలీల కొరత సమస్యకు పరిష్కారం వెదుకుతూ రైతు తొండపి గురవయ్య అద్భుతమైన గొర్రును రూపొందించాడు. ఆయన స్వగ్రామం గుంటూరు జిల్లా నకరికల్లు మండలంలోని రూపెనగుంట్ల. ఖరీఫ్‌లో వరి కోసిన వెంటనే మళ్లీ దుక్కి చేయకుండా.. తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో రెండో పంట వేయడానికి రైతులకు ఈ గొర్రు ఎంతో ఉపయోగపడుతోంది. విత్తనం, ఎరువు, కలుపు మందులను ఏకకాలంలో వేయడం దీని ప్రత్యేకత. విత్తనాన్ని ఒకటిన్నర సెంటీమీటర్ల దూరంలో వేసి, మట్టి కప్పుతుంది. ఐదో తరగతి చదివి 40 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్న గురవయ్య చేతల్లో మెరిసిన సృజనాత్మకత శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరచింది. బాపట్ల, లాం వ్యవసాయ శాస్త్రవేత్తలతోపాటు  రైతుల సూచనలు తీసుకొని దీన్ని పరిపూర్ణంగా తీర్చిదిద్దడం విశేషం. రైతులు, ‘ఆత్మ’, నాబార్డు నిపుణులూ జేజేలు పలికారు. రూ. 3 లక్షల నగదుతో కూడిన ప్రతిష్టాత్మక ‘శాంసంగ్ ఇన్నోవేషన్ కోషంట్’ అవార్డు సహా అనేక అవార్డులు గురవయ్యను వెతుక్కుంటూ వచ్చాయి. ప్రభుత్వమే దీన్ని తయారుచేసి సబ్సిడీపై రైతులకివ్వాలి. గురవయ్య మొబైల్: 99890 87931 (‘సాగుబడి’ కథనం తేదీ: 27-01-2014)
 
బోర్లు రెండు.. మోటారు ఒకటే!

విద్యుత్ కొరత రైతుల మూలుగలు పీల్చేస్తోంది. ఇటువంటి తరుణంలో రెండు బోర్లున్న రైతు 50% మేరకు విద్యుత్‌ను ఆదా చేసుకోవడానికి ఉపకరించే అద్భుత టెక్నిక్‌ను కనుగొన్నాడు పందిరి పుల్లారెడ్డి. పదో తరగతి వరకు చదువుకొని వ్యవసాయం చేస్తున్న ఆయన స్వగ్రామం నల్లగొండ జిల్లా మునగాల మండలంలోని ముకుందాపురం. ఉన్న రెండు బోర్లలో నీరు అరకొరగా వస్తున్న నేపథ్యంలో ఈ రెంటిని కలిపి ఒకే మోటారుతో తోడాలన్న సృజనాత్మక ఆలోచన.. గొప్ప ఆవిష్కరణకు కారణభూతమైంది. అరకొరగా నీళ్లున్న రెండు బోర్లను కలిపి ఒకే మోటారుతో నడిపించడం వల్ల విద్యుత్ ఖర్చు, మోటార్లపై పెట్టుబడి సగానికి సగం తగ్గింది. ‘సాక్షి’ ఈ టెక్నిక్‌ను వెలుగులోకి తేవడంతో వేలాది మంది రైతులు పుల్లారెడ్డిని సంప్రదించారు. కొందరు ఆయన సేవలను వినియోగిం చుకున్నారు. 50% వ్యవసాయ విద్యుత్‌ను పొదుపు చేస్తున్న జ్ఞాని పుల్లారెడ్డి. ప్రభుత్వం తగిన రాయల్టీ చెల్లించి.. యువ రైతులకు ఈ టెక్నిక్ నేర్పించవచ్చు. పుల్లారెడ్డి మొబైల్: 9963239182 (‘సాగుబడి’ కథనం తేదీ: 3-3-2014)
 
 
రాథోడ్ సైకిల్ పంపు!


చెరువు, నీటి గుంట, కాలువల్లో నీరుండి.. పక్కనే చేను ఉన్నా నీటిని తోడుకోవాలంటే ఆయిల్ ఇంజినో, కరెంటు మోటారో ఉండాల్సిందే. చిన్న, సన్నకారు రైతులకు వీటిని సమకూర్చుకోవడం తలకుమించిన భారమే. ఇంజిన్, మోటారు, విద్యుత్ అవసరం లేకుండానే పంటకు నీరు అందించుకునేందుకు ఉపయోగపడే సైకిల్ పంపును తయారు చేశాడు ఆదివాసీ రైతు విక్రమ్ రాథోడ్. దీనిపైన కూర్చొని సైకిల్‌ను తొక్కినట్లే తొక్కుతూ ఉంటే పొలంలోకి నీరు పారుతుంది. ఎన్నడూ బడికెళ్లి ఎరుగని రాథోడ్‌కు నాలుగెకరాల చెలక(మెట్ట) భూమి ఉంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం జైత్‌రాంతండా నవాస్‌పూర్ ఆయన స్వగ్రామం. ఐటీడీఏ, పల్లెసృజన, హనీబీ నెట్‌వర్క్ తోడ్పాటుతో ఈ విషయం నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్(ఎన్‌ఐఎఫ్) దృష్టికి వెళ్లడంతో రాథోడ్‌కు  2003లోనే పేటెంట్ వచ్చింది.      అప్పటి రాష్ట్రపతి కలామ్ నుంచి అవార్డు అందుకున్నాడు. ఈ సైకిల్ పంపులను పెద్దసంఖ్యలో ఉత్పత్తి చేయడానికి రాథోడ్‌కు ఏ బ్యాంకూ రుణం ఇవ్వలేదు.  ప్రభుత్వం పట్టించుకోవాలి.
 విక్రమ్ రాథోడ్ మొబైల్: 98660 01678
 (‘సాగుబడి’ కథనం తేదీ: 20-01-2014)
 
 
శివప్రసాద్ ఆటో ఇంజిన్!

చైనా పంపుసెట్లు రిపేరు చేసే అలవాటున్న రామ శివప్రసాద్ రైతుల బాధలు చూడలేక తక్కువ ఖర్చులో శక్తివంతమైన ఆయిల్ ఇంజిన్‌ను రూపొందించాడు. శివప్రసాద్ స్వస్థలం వరంగల్ జిల్లా శాయంపేట. బావులు, కాలువల్లో నుంచి తరచూ రిపేర్‌కొచ్చే చైనా పంపుసెట్లతో నీటిని తోడుకునే రైతులు నిత్యం ఎదుర్కొంటున్న ఇబ్బందులు తీర్చడానికి ఈ ఆవిష్కరణ పనికొచ్చింది. 24 గంటలు నడచినా వేడెక్కకుండా ఉండేలా ఆటో ఇంజిన్‌ను వాడి దీన్ని తయారు చేశాడు. ఇది 7.5 హెచ్‌పీ ఇంజిన్‌కన్నా ఎక్కువ నీటిని తోడుతుంది. గంటన్నర, 2 గంటలపాటు లీటర్ డీజిల్‌తో నడుస్తుంది. రూ. 22 వేల ఖర్చుతోనే ఇది తయారవుతుంది. దీనికి డైనమో బిగించి విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటే.. ఆ విద్యుత్‌తో రెండు మోటార్లు నడపొచ్చంటున్నాడు శివప్రసాద్. ప్రభుత్వం దృష్టిపెట్టి వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి చేయిస్తే మేలు. శివప్రసాద్ మొబైల్ : 95054 08937
 (‘సాగుబడి’ కథనం తేదీ: 03-02-2014)    
 
రైతుల ప్రజ్ఞను సాంకేతికతకు జోడించాలి!

రైతుల కోసం రైతులు, గ్రామీణ వృత్తిదారులు కనుగొన్న సృజనాత్మక యంత్ర పరికరాలు అట్టడుగున ఉన్న చిన్న కమతాలున్న చిన్న, సన్నకారు రైతుల అవసరాలను తీర్చడానికి బాగా ఉపయోగపడతాయి. ప్రజల ప్రజ్ఞ, జ్ఞానం మీద ఆధారపడిన పరిష్కారాలను పాలకులు విస్మరించడం వల్ల సమాజాభివృద్ధి కుంటుపడింది. ప్రభుత్వ పరిశోధనాశాలలు, ప్రైవేటు పరిశోధనా సంస్థలు చిన్న, సన్నకారు రైతుల సమస్యలను పట్టించుకోవటం లేదు. పరిశోధనలన్నీ పారిశ్రామిక క్షేత్రం వైపు, ధనం వెచ్చించే తాహతు కలిగిన వర్గాలవైపే మొగ్గు చూపుతున్నాయి. దీంతో కోట్లకొద్దీ చిన్న, సన్నకారు రైతులు, గ్రామీణులు(కనీసం 60% మంది) సమస్యలతో జీవిస్తున్నారు. పల్లె జ్ఞానాన్ని ప్రభుత్వాలు గుర్తించి, ప్రోత్సహించాలి. సాంకేతికతకు రైతుల ప్రజ్ఞను తోడుచేస్తే వారి అభివృద్ధి సునాయాసంగా సాధ్యమవుతుంది. బడుగు రైతులకు అవసరమైన యంత్ర పరికరాలకు, అందుబాటులోకి వస్తున్న యంత్ర పరికరాలకు మధ్య ఎంతో అంతరం ఉంది. దీన్ని గుర్తించి పూరించడానికి ప్రత్యేక యంత్రాంగాన్ని ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలి. అమూల్యమైన గ్రామీణ ఇన్నోవేషన్లను విస్తృతంగా వినియోగంలోకి తేవాలి.    - బ్రిగేడియర్(రిటైర్డ్) పి. గణేశం (98660 01678),
 బీడీఎల్ మాజీ డెరైక్టర్, అధ్యక్షులు, హనీబీ ఏపీ-పల్లెసృజన
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement