ఆ ధోరణీ ఓ గుణపాఠమే!
రెండో మాట
‘ప్రభుత్వాలను విమర్శించే వారి మీద దేశద్రోహం లేదా పరువునష్టం పేరిట కేసులు/దావాలు నడపడం చట్టవిరుద్ధం. ఆధునిక యుగంలో దేశ ద్రోహం/పరువునష్టం దావాలు పౌరుల నోళ్లు మూసే చర్యలుగా పరిగ ణించవచ్చు’- సుప్రీం కోర్టు (సెప్టెంబర్ 6, 2016)
కక్షాపూరితంగా వ్యవహరించే రాజకీయ నేతలు, పాలకుల మధ్య జండర్ (ఆడ/మగ) తేడాను పాటించవలసిన అవసరం లేదు. విద్వన్మణి, పాలనా దక్షురాలు, తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జె. జయలలిత తన పాలనా కాలంలో పత్రికలపైన ప్రదర్శించిన వివక్ష, కక్ష; విధించిన ఆంక్షలు, పెట్టిన దేశద్రోహం, పరువునష్టం కేసులు బహుశా దేశంలో ఏ కాలంలోనూ అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ఏవీ నడిపి ఉండవు. నడుస్తున్న చరిత్ర, సామాజిక, ఆర్థిక, రాజకీయ, పాలనా వ్యవస్థలలో చోటు చేసుకునే విపరీత పరిణామాలను పాఠకలోకానికి నివేదించే విలేకరుల మీద, వాటిని విశ్లేషించే సంపాదకీయ వ్యాఖ్యాతలపైన, సంపాదకులపైన, పత్రికలపైన విరుచుకు పడేందుకు పాలకులు సదా సిద్ధంగానే ఉంటారు. ఇందుకు సంబంధించిన వాక్, సభా స్వాతంత్య్రాలకు సాక్షాత్తు రాజ్యాంగమే పూచీ పడినప్పటికీ పాల కుల నుంచి ఈ దాడి తప్పడం లేదు. ఊరంతా ఒక దారి, ఉలిపికట్టెది ఒక దారి అన్నట్టు ఏవో వేళ్ల మీద లెక్కించదగిన కొన్ని పత్రికలు మినహా; ప్రధాన స్రవంతి వార్తా పత్రికల ప్రచురణ సంగతి వేరు. వాటి సమాచార సేకరణ తీరు వేరు. ఏదిఏమైనా ఫలానా అంశాన్నే లేదా వార్తనే, లేదా నేను చెప్పిందే పత్రికలలో ప్రచురించాలి. లేకుంటే ప్రచురణ మానుకోవాలి అని శాసించే ఏలికలు ఉన్నచోట సాధికార విశ్లేషణ సాధ్యపడదు.
కొన్ని చేదు నిజాలు
ఇలాంటి పరిస్థితి జయలలిత పాలనా కాలంలో తమిళనాడులో ఏర్పడింది. పత్రికల ఆత్మ స్థయిర్యాన్ని దిగజార్చే యత్నం ఆమె చేశారు. ‘ది హిందు’ వంటి పత్రికలపైన, ప్రతిపక్ష నేతలపైన లెక్కకు మిక్కుటంగా పరువునష్టం, క్రిమినల్, సివిల్ దావాలు జయ నడిపారు. తన ఏలుబడి మీద భిన్నా భిప్రాయాన్నీ, విమర్శనీ సహించలేకే ఈ చర్యకు ఒడిగట్టారు. జయ పాలనా దక్షతను పత్రికలు మెచ్చుకున్న సందర్భాలు లేకపోలేదు. అలాగే, పత్రికల వార్తలు ఆమెకు మోదాన్ని ఇచ్చిన క్షణాలు కూడా ఉన్నాయి. 1989లో జయ ప్రతిపక్ష నాయకురాలిగా ఉన్న కాలంలో డీఎంకే సభ్యుడు సభలోనే ఆమెపైన దుశ్శాసన పర్వానికి పాల్పడ్డాడు. ఆ అనుచిత చర్యను పత్రికలు చీల్చి చెండా డాయి. ఆ విషయమే జయను ఆనందింపచేసింది. అయితే ఆ పత్రికలే తరు వాత పాలనా వ్యవహారాల మీద ఎలాంటి విమర్శను ప్రచురించినా ఆమె మండిపడేవారు.
అందుకుకారణం–ఆమె స్వయంగా అనేక అవినీతి కేసులను ఎదుర్కొంటూ ఉండడమే. ఈ ధోరణికి ప్రధాన కారణాన్ని ‘హిందు’ వ్యాఖ్యాతలు ఎన్. రామకృష్ణన్, ఆర్. బాలాజీ ఇలా విశ్లేషించారు: ‘డీఎంకే, ఏఐఏడీఎంకే– ఏది అధికారంలోకి వచ్చినా ప్రత్యర్థి పార్టీ విధానాల లొసుగు లను ఎండగట్టేందుకే ఉన్న కాలాన్నంతటినీ వృథాగా వెచ్చించేది. రాష్ట్ర ఆర్థిక వనరులను డీఎంకే అవినీతితో విచ్చలవిడిగా ఖర్చు చేసిందని ఏఐఏడీఎంకే విమర్శనాస్త్రాలు దట్టిస్తే, తరువాత అధికారంలోకి వచ్చిన డీఎంకే ప్రభుత్వం జయలలిత, ఆమె మంత్రిమండలి సభ్యుల మీద అవినీతి ఆరోపణల ఆధా రంగానే (1996) కేసులు నమోదు చేయించింది. ఇలా పరస్పరం కేసుల పర్వాలు తెరిచారు. 1987లో ఎంజీఆర్ మరణించినప్పటి నుంచి ఈ రెండు పార్టీల మధ్య స్పర్థలు, కుమ్ములాటలు ఈ తీరున రాష్ట్రాన్ని కుళ్లబొడిచాయి. ముందు ఒక పార్టీ ప్రవేశపెట్టిన పథకాలను తరువాత అధికారంలోకి వచ్చిన పార్టీ రద్దు చేస్తుంది. లేదా అమలులో సాచివేతకు పాల్పడుతుంది.’
ఈ కక్ష సాధింపు ధోరణి ఎక్కడికి దారి తీసింది? జయ హయాంలో మొత్తం 213 కేసులు (ఆగస్ట్ నాటికి) పెట్టారు. అందులో పత్రికల వారి మీద పెట్టిన కేసులు 55. డీఎంకే సహా విపక్ష నేతల మీద పెట్టినవి 85. చిత్రం ఏమిటంటే, 2011లో జయ అధికారం చేపట్టిన సమయంలో మొదటిసారి సచివాలయంలో లాంఛనంగా మీడియా సమావేశం ఒకటి నిర్వహించారు. ఆ సమావేశంలో ఆమె చేసిన ప్రతిపాదన విని జర్నలిస్టులు విస్తుపోయారట. ‘మీరూ, నేనూ ఒక ఒప్పందానికి వద్దాం! మీరు నా వెంటపడుతూ నిరంతరం వేధించకుండా ఉంటే నేను ఎప్పుడూ మిమ్మల్ని కలుసుకుంటూ ఉంటాను’ అని షరతు (బిజినెస్ లైన్ 7–12–‘16)పెట్టారామె. ఇలాంటి షరతుల మధ్య వెలుగు చూసేవి వార్తలు కావు, డిక్టేషన్లే.
బ్రిటిష్ పాలకుల బాటనే
జయ హయాంలోనే కూడంకుళమ్ అణు విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ స్థానిక ప్రజలు ఆందోళనకు దిగితే రాజద్రోహ నేరం మోపి, భిన్నాభిప్రాయాన్ని తొక్కేయడానికి ప్రయత్నించారు. అప్పుడే అశీమ్ త్రివేది అనే వ్యంగ్య చిత్రకారుడిపై సెడిషన్ నేరం మోపారు. సుప్రీంకోర్టు ప్రసిద్ధ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ బ్రిటిష్ పాలకులు భారతీయులపైన, నాయకులపైన ప్రయోగించిన రాజద్రోహ చట్టాన్ని జయ లలిత ప్రభుత్వం స్వేచ్ఛగా వాడుకుంటోందని వివరించాల్సి వచ్చింది. సెడి షన్ లా వినియోగం గురించి 1962లోనే కేదార్ సింగ్ “ బిహార్ స్టేట్ కేసులో ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ప్రస్తావిం చింది. ఈ గందరగోళం వల్లనే సుప్రీంకోర్టు జస్టిస్ జీవన్‌రెడ్డి ధర్మాసనం ‘నక్కీరన్’ (తమిళ పత్రిక) కేసులో తీర్పు చెబుతూ సమాచార సాంకేతిక వ్యవస్థ శరవేగాన విస్తరిస్తున్న నేటికాలంలో పరువునష్టం దావాలను కేవలం సివిల్ దావాలుగానే పరిగణించి, క్రిమినల్ దావాను రద్దు చేయాలని సూచిం చింది.
అయితే ఆ సూచనను మరచి అలాంటి క్రిమినల్ దావాను డీఎండీకే నాయకుడు విజయ్‌కాంత్‌పై (నవంబర్ 6,2015) జయ నడిపారు. ఆ సంద ర్భంగానే సుప్రీం న్యాయమూర్తులు జస్టిస్ దీపక్ మిశ్రా/జస్టిస్ యు.యు. లలిత్ ధర్మాసనం ‘దేశద్రోహ నేరాన్ని, పరువునష్టం దావాలను పౌరుల భిన్నా భిప్రాయాల స్వేచ్ఛకూ, విమర్శనా స్వాతంత్య్రాన్ని అణచడానికీ వినియోగిం చరాద’ని తీర్పు చెప్పవలసివచ్చింది. చివరికి కశ్మీర్ సమస్యపైన చర్చా వేదికను నిర్వహింపజూసిన ‘ఎమ్నెస్టీ ఇండియా’ పైన కూడా ‘దేశద్రోహ’ నేరాన్ని మోపజూశారు. ఇలాంటి కేసులు బీజేపీ–ఆరెస్సెస్ పరివార్ మోదీ పరిపాలనలో మరింతగా పెరిగాయని ‘ఎమ్నెస్టీ ఇండియా’ పేర్కొన్నది. 2014లో 47 సెడిషన్ కేసులు నమోదు కాగా, 58 మందిని అరెస్ట్ చేశారు. కానీ కేవలం ఒకే ఒక్క వ్యక్తిని మాత్రమే ప్రభుత్వం జైలుకు పంపించగలిగింది. అలాంటి సెడిషన్ కేసును ఎదుర్కొన్నవారిలో ప్రసిద్ధ రచయిత్రి అరుంధతీ రాయ్ ఒకరు.
ఇదే సెడిషన్ కేసులో పాలకులు ఇరికించిన వారిలో–మానవ హక్కుల పరిరక్షణ ఉద్యమకారుడు, డాక్టర్ వినాయక్ సేన్, జేఎన్‌యూ విద్యార్థి నాయకుడు కన్హయ్య కుమార్, ఢిల్లీ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఎస్‌ఏఆర్ జిలానీ కూడా ఉన్నారు. ఈ అవకతవక కేసులను దృష్టిలో పెట్టుకునే ముఖ్యమంత్రిగా జయలలితను ఉద్దేశించి–తన రాజకీయ ప్రత్యర్థి/ వ్యతిరేకిపైన క్రిమినల్ పరిహార దావా వేయడానికి, ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రోత్సహించడానికి ఒక ముఖ్యమంత్రి తన పలుకుబడిని ఉపయోగించ వచ్చునా? అని జస్టిస్ మిశ్రా ధర్మాసనం ప్రశ్నించవలసివచ్చింది. స్వయంగా జయలలిత మాత్రమే ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వాలని శాసించింది కూడా. ఈ సందర్భంగానే ధర్మాసనం, ప్రభుత్వ ప్రాసిక్యూటర్ అనేవాడు పోస్ట్‌మ్యాన్ కాదు, అతని ఆఫీసు పోస్టాఫీస్ కాజాలదని కూడా వ్యాఖ్యానించింది. తనకు రుచించని, నచ్చని వార్తల్ని ‘హిందూ’ ప్రచురిస్తున్నందుకు మాజీ సంపాద కుడు ఎన్. రామ్‌కు జయలలిత సమన్లు జారీ చేయించారు.
గుణపాఠాలు నేర్వాలి
పాలకులనుంచి తిట్లు, శాపనార్థాలు, కోపతాపాలు పత్రికలకు మామూలే. అవినీతికి, అసత్యాలకు పాల్పడే పాలకులకూ, కొందరు రాజకీయ నాయ కులకూ ధర్మాధర్మాలు తెలుసు. కానీ అధికార ‘మైకం’, దర్పం, దురహం కారం వారి కళ్ల మీద పొరలు కప్పేస్తుంది. అందుకే ఫ్రెంచి రచయిత బెరాం జర్ (19వ శతాబ్ది) స్వేచ్ఛాకాముకుడిగా ఇలా పాట కట్టాడు: ‘నాకు నచ్చిన పాటలు రాసుకోడానికే నే జీవిస్తా/ఓ నిరంకుశ పాలకా! నా నోరు నొక్క జూస్తే/నేను బతికి బట్ట కట్టడం కోసమే పాటలు రాసి తీరతా!’
ఈ సత్యాన్ని ఉగ్గడిస్తూ కారల్‌మార్క్స్ పత్రికా వ్యవస్థను కేవలం ఒక వ్యాపార సంస్థగా పరిగణించదలిచినా ఆ వ్యాపార నిర్వహణకైనా బుర్ర ఉండాలి, అందుకూ స్వేచ్ఛ కావలసిందే అన్నాడు. ఆ స్వేచ్ఛ కావాలంటే అందుకు అవసరమైన చేతులూ, కాళ్లూ ఉండాల్సిందే. అందుకు తగిన మెదడు ఉండాలి గదా. అలా విముక్తి పొందగలిగిన చేతులూ, కాళ్లూ మాత్రమే మానవతా ప్రమాణాల రీత్యా ప్రయోజనకర శక్తులవుతాయి.
ఈ పరిణామానికి మానవుడి మెదడు చోదకశక్తి అవుతుంది. అలాగే పత్రికా ప్రపంచం తన చైతన్యానికి అనుగుణంగా తన చలనాన్నీ, ఉనికినీ మలచుకోక తప్పదు. కనుకనే పత్రికా రంగం తన స్వేచ్ఛను తానే కాపాడుకోకుండా, వర్తక వ్యాపార సరళికి దిగజారి పోకూడదు. పత్రికా రచయిత బతుకుతూ రాయాలి, బతకడానికి రాస్తూ నాలుగు రాళ్లు సంపాదించుకోవాలి. ‘ఇక్కడ మనకు కావలసింది వ్యాపార సంస్థల, ముద్రణా సంస్థల, పుస్తక విక్రేతల స్వేచ్ఛ కాదు, కావలసింది పత్రికా స్వేచ్ఛ’ అన్నాడు మార్క్స్. ఈ పత్రికా స్వేచ్ఛనే, పాలకశక్తుల దాష్టీకాలకు లొంగని జర్నలిజాన్నే జార్జి బెర్నార్డ్ షా ‘నిత్య నూతనంగా – నవ నవంగా దర్శనమిచ్చే దినపత్రికా లోకం’ (న్యూస్ పేపర్ ఎవ్విరిడేస్) అని అభివర్ణించాడు. మొత్తంగా పత్రికారంగంలో వచ్చిన పరిణామాలతో ‘కత్తెర’, ‘సంకెళ్ల’ బాధలు కలాలకు ఎక్కువయ్యాయి. ఏది ఏమైనా ప్రజలూ, వారి కష్టసుఖాలూ, వారి సమస్యలకు సంబంధించిన అంశాలనే వార్తలుగా పరిగణించడం పత్రికల బాధ్యత.
- ఏబీకే ప్రసాద్
సీనియర్ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in