బెర్లిన్‌ టు బెంగళూరు | ABK Prasad writes on Gauri Lankesh murder | Sakshi
Sakshi News home page

బెర్లిన్‌ టు బెంగళూరు

Published Tue, Sep 12 2017 6:34 AM | Last Updated on Fri, May 25 2018 6:35 PM

బెర్లిన్‌ టు బెంగళూరు - Sakshi

బెర్లిన్‌ టు బెంగళూరు

రెండో మాట
గౌరీ హత్య తరువాత కర్ణాటక లింగాయతులు తాము ‘హిందువులం కాద’ని ప్రకటించి, ప్రత్యేక గుర్తింపు కావాలని అన్నందుకు వారిపైన వేధింపులు ప్రారంభమయ్యాయి. దీనితో పాటు ఆ రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధులు, ప్రగతిశీల భావకులైన గిరీశ్‌ కర్నాడ్, పుట్టప్ప, బరాగర్‌ రామచంద్రప్ప తదితర 18 మంది ప్రముఖులకు ప్రభుత్వ ఆదేశాలపైన వ్యక్తిగత భద్రతను ఏర్పాటు చేయవలసి వచ్చిందంటే బీజేపీ కేంద్ర, స్థానిక వర్గాల, పాలకుల ‘హిందూత్వ’ విభజన రాజకీయాలు ఏ స్థాయిలో సాగుతున్నాయో అర్థమవుతోంది.

‘దేశంలోని సకల జాతుల; విభిన్న వర్గ, మత, భాషా, దళిత, మైనారిటీల సంక్షేమం, భద్రతలే లక్ష్యంగా కలిగిన సెక్యులరిజమే నిజమైన జాతీయవాదం. దానిని వ్యతిరేకించడమంటే విభిన్న భావాలను గుర్తించకపోవడమే. అంటే జాతీయవాదాన్ని కుంచింపచేయడమే. జర్మనీలో హిట్లర్‌ నాజీయిజం, ఫాసిజం ఈ సంకుచిత జాతీయతకు పుట్టిన వికారపు లక్షణాలే. ఈ వికార బుద్ధి అసంబద్ధమైనదీ, హేతు విరుద్ధమైనదీ, వెర్రిబాగులతనం కలిగినది. ఇందుకు విరుద్ధమైనవే∙గాంధీ, నెహ్రూల జాతీయవాదం, జాతీయత. ఇది వలస పాలనా వ్యతిరేక పోరాటాల నుంచి జనించింది. దేశంలోని విభిన్న జాతుల, మతాల సమ్మేళనమే వారి జాతీయత. గాంధీ–నెహ్రూల జాతీయవాదం మత ప్రాతిపదికపై ఏర్పడినది కాదు. కానీ నేడు మనం చూస్తున్నది మతం పేరిట బలవంతంగా సాగుతున్న సాంస్కృతిక విద్వేష వ్యాప్తి. గోరక్ష పేరుతో సాగుతున్న గుంపు వేధింపులు.’ – జస్టిస్‌ అజిత్‌ ప్రకాశ్‌ షా, 9–8–17 (ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, భారత లా కమిషన్‌ సభ్యుడు)

‘హేతుబద్ధమైన వాదనాపటిమతో అభిప్రాయాలను చాటే గొంతులను హతమార్చడం పిరికి పందల లక్షణం. మా వాదనలను పూర్వపక్షం చేయగల సత్తా లేని పిరికిపందల లక్షణమది.’ – నరేంద్ర నాయక్‌ (ప్రసిద్ధ హేతువాద ఉద్యమ నాయకుడు)

సుప్రసిద్ధ కన్నడ వారపత్రిక ‘గౌరీ లంకేశ్‌’ సంపాదకురాలు, సీనియర్‌ జర్నలిస్ట్‌ గౌరీ హత్య వార్త విన్న సమయంలో జస్టిస్‌ అజిత్‌ ప్రకాశ్‌షా వ్యాఖ్య గుర్తుకు వచ్చింది. వామపక్షాల వ్యాప్తిలోను, నిశితమైన వ్యాఖ్యాతగానూ ప్రసిద్ధి చెందారు. జస్టిస్‌ ప్రకాశ్‌ షా∙ప్రస్తావించిన నాజీ జర్మనీకీ, ఫాసిజానికీ బెర్లిన్‌ టు బెంగళూరు వాతావరణానికీ మధ్య ఎంతో సంబంధం ఉందని అనిపిస్తుంది. ఈ సారూప్యత పైకి మోకాలికీ, బోడు గుండుకీ ముడిపెట్టినట్టుగా భావింప చేస్తుంది. డెబ్బయ్‌ రెండేళ్ల క్రితం జరిగిన రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఆర్యజాతి సిద్ధాంతానికి నారు పోసి నీరు పెట్టి లక్షలాది మంది యూదు జాతీయులను ఊచకోతకు గురి చేసిన సంగతి మరపునకు రాదు. ఈ ఊచకోతకు చిహ్నంగా మిగిలినది స్వస్తిక్‌ గుర్తు. ఆ గుర్తు ఇప్పటికీ గోడల మీద, క్రీడా మైదానాలు, భవన నిర్మాణాల దగ్గర దర్శనమిస్తూ ఏహ్యభావం కలిగిస్తూనే ఉన్నది. ఆ ఏహ్యతతోనే నేటి తరం ఆ గుర్తును చెరిపివేసే ‘శుద్ధి’ ఉద్యమాన్ని మహోధృతంగా ఆరంభించింది. వీరికి బాసటగా నిలిచిన వారు అక్కడి గ్రాఫిటీ కళాకారులు. స్వస్తిక్‌ గుర్తులను తుడిచివేసి, ఆ స్థానంలో అందమైన పుష్పాలు, వాహనాలు, జంతువుల బొమ్మలు, దృశ్యాలు చిత్రిస్తున్నారు. దీనికి ప్రేరకుడు ఆ కళలో దిట్ట – ఇబో ఓమర్‌. సకల జాతులు నివసించే రాజధాని నగరం బెర్లిన్‌లో జాత్యహంకారానికి చోటు లేదు. నగరానికి వచ్చే పర్యాటకులు స్వస్తిక్‌ గుర్తును చూసి ఇక్కడ ఏం జరుగుతోంది అని, ఇంకా నాజీలు ఉన్నారా అని విస్తుపోతారని ఓమర్‌ వ్యాఖ్యానించారు. అది యువతరం ఉద్యమం స్థాయి దాటి, ప్రజా ఉద్యమం స్థాయికి చేరుకుంది.

ఈ పరిస్థితిని బద్దలు కొట్టాలి
రాడికల్‌ ఉద్యమాల అవసరం ప్రతి దేశానికి ఏదో ఒక దశలో అనివార్యమైనట్టు చరిత్రను బట్టి అర్థమవుతుంది. ప్రగతిశీల శక్తులనూ, హేతువాద ఉద్యమాలనూ దెబ్బ తీయడానికి ప్రగతి నిరోధకశక్తులు సిద్ధమైన ప్రతి సందర్భంలోను సంస్కరణల కోసం రాడికల్‌ ఉద్యమాలు తలెత్తుతాయి. గౌరీ లంకేశ్‌ హత్యకు కొద్దిరోజుల ముందే హైదరాబాద్‌లోని ‘లమకాన్‌’ (బంజారాహిల్స్‌)లో అలాంటి ఓ ఉద్యమానికి అంకురార్పణ జరిగింది. ఆ సందర్భంగా, అంటే హసన్‌ తృతీయ సంస్మరణ కార్యక్రమం కోసం జరిగిన ఈ సభ పెద్దలతో పాటు, యువకులతోనూ కిటకిటలాడింది. షీలా రషీద్, జిగ్నేశ్‌ మేవాని, ప్రతీక్‌ సిన్హా ప్రసంగించారు. నేటి పరిస్థితులలో సమూల (రాడికల్‌) సంస్కరణల కోసం యువత ఉద్యమించవలసిన అవసరం ఉందని ఢిల్లీ విద్యార్థి సంఘ నాయకురాలు షీలా అన్నారు. అంతేకాదు, ఈ దేశంలో ఎన్నికల తంతు ముగిసిపోగానే నాయకులు మళ్లీ కనపడరు, ఇటువైపు చూడరని మరొక కీలకమైన అంశాన్ని ప్రస్తావించడం గమనార్హం: ‘ఎన్నికలు అయిపోగానే కనుమరుగయ్యేవారు పాలకపక్ష నాయకులే కాదు, ఈ జాడ్యం ప్రతిపక్ష నాయకులకూ ఉంది. వారందరి ఆస్తులూ ‘హనుమంతుడి వాలం’లా పెరి గిపోయాయి. ఈ యథాస్థితిని మన యువత బద్దలు చేయవలసిన అవసరం ఉంద’నీ ఆమె చెప్పింది. అందుకని గోవు పరిధినీ, మతతత్వం, కులగొడవలకు అతీతంగా, వాటిని అధిగమించి యువత ఆలోచనలు సమూల సంస్కరణలపైన కేంద్రీకరించాలన్నది ఆమె ఉద్బోధ. ఆ మార్పు కోసం నడుం కట్టగలిగేది యువతేనన్నది సందేశం.

పెరుగుతున్న జాబితా
గుజరాత్‌లో దళితులపైన జరుగుతున్న వేధింపులకు, దాడులకు నిరసనగా ఉద్యమం నిర్వహించిన వ్యక్తి జిగ్నేశ్‌ మేవాని. మేవాని ఉద్యమ నినాదం– ‘ఆవు తోకను మీరే అట్టిపెట్టుకోండి. కానీ రెండు కోట్ల ఉద్యోగాలు మాకివ్వండి’. ఈ ధోరణి వ్యంగ్యంగా ఉన్నా ఒక జీవన వాస్తవమే. బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత ‘పరివార్‌’ సంస్థలు తలపెట్టిన ‘ప్రత్యర్థుల’ హరికిరిలో ‘గుర్తు తెలియని’ హంతకుల జాబితాలు అనేక సందర్భాల్లో పెరిగాయేగానీ తరగలేదు. గౌరీ హత్యానంతరం కర్ణాటకలోను ఇతరచోట్లా ఎన్ని గందరగోళాలకు, వేధింపులకు పరివార్‌ వర్గీయులు కారకులయ్యారో పత్రికా వార్తలు చెప్పకనే చెప్పాయి. అంతకుముందు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హేతవాద నాయకుల హత్య (నరేంద్ర దభోల్కర్‌ 2013, గోవిందపన్సారే 2014, ఎం.ఎం. కల్బుర్గీ 2015) కేసు ‘విచారణ’లో బీజేపీ ప్రభుత్వం గత నాలుగేళ్లలోనూ హంతకులను పట్టుకోలేకపోయింది. కానీ ఈలోగా 2002లో గుజరాత్‌లో రెండువేల మంది మైనారిటీల ఊచకోతలకు కారకులైన కొందరు పాలకవర్గ నాయకులు లేదా కొందరు పోలీసు అధికారులు మోదీ దేశ ప్రధానిగా అధికారంలోకి రాగానే కేసుల నుంచి, జైళ్ల నుంచి వరుసగా విడుదలవుతూ రావడాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.

గౌరీ హత్య తరువాత కర్ణాటక లింగాయతులు తాము ‘హిందువులం కాద’ని ప్రకటించి, తమకు ప్రత్యేక గుర్తింపు కావాలని అన్నందుకు వారిపైన వేధింపులు ప్రారంభమయ్యాయి. దీనితో పాటు ఆ రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధులు, హేతువాదులు, ప్రసిద్ధ నాటక కర్తలు, ప్రగతిశీల భావకులైన గిరీశ్‌ కర్నాడ్, పుట్టప్ప, బరాగర్‌ రామచంద్రప్ప తదితర 18 మంది ప్రముఖులకు ప్రభుత్వ ఆదేశాలపైన వ్యక్తిగత భద్రతను ఏర్పాటు చేయవలసి వచ్చిందంటే (8.9.17) బీజేపీ కేంద్ర, స్థానిక వర్గాల, పాలకుల ‘హిందూత్వ’ విభజన రాజకీయాలు ఏ స్థాయిలో సాగుతున్నాయో అర్థమవుతోంది. నిన్నగాక మొన్న కన్హయ్య కుమార్, రోహిత్‌ వేముల లాంటి ప్రగతిశీల దళిత విద్యార్థి నాయకులపట్ల బీజేపీ నాయకత్వం వేధింపు రాజకీయాలకు పాల్పడి, వాస్తవాల్ని మసిపూసి మారేడుకాయ చేసింది. గౌరీ హత్య కర్ణాటక సరిహద్దులనేగాదు, దేశ సరిహద్దులు దాటి అమెరికా, బ్రిటన్‌లతో పాటు యూరోపియన్‌ సీమాంతరాలకు వ్యాపించి, ప్రజలు నిరసనలకు దిగేటట్టు చేసింది. ప్రపంచ స్థాయిలో అంతర్జాతీయ పాత్రికేయ సమాఖ్యలు భారతదేశంలో వేగంగా అలముకుంటున్న పాలనాపరమైన అవాంఛనీయ పరిణామాలను ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. హరియాణాలో జూనాద్, రాజస్తాన్‌లో పెహ్లూఖాన్, దాద్రీలో అఖ్లిక్, ‘లవ్‌ జీహాద్‌’ పేరిట జరుగుతున్న హత్యలూ సాధారణ ప్రజా బాహుళ్యాన్నీ, పత్రికా స్వేచ్ఛను, భావ ప్రకటనా స్వేచ్ఛను ప్రేమించే మేధావులను కలచివేస్తున్న వాస్తవాన్ని పాలకులు గుర్తించడానికి నిరాకరిస్తున్నారు. అది నిజం కాకపోతే దేశ అత్యున్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) శాసిం చినట్టు ‘గోరక్ష’ముసుగులో సాగుతున్న అరాచక చర్యల్ని అణచే బాధ్యత ‘రాష్ట్రాలదేన’ని చెప్పి కేంద్రం నిర్వహించాల్సిన రాజ్యాంగపరమైన భద్రతా చర్యల నుంచి తప్పించుకోరాదు.

సమాచారహక్కంటే జాతీయ ప్రయోజనమే
యూరోపియన్‌ జర్నలిస్టుల సమాఖ్య అంచనా ప్రకారం గత 39 నెలల్లోనే 11 మంది జర్నలిస్టుల్ని హతమార్చారు. 2016లో హిందీ దినపత్రిక ‘హిందూస్తాన్‌’కు చెందిన రాజీవ్‌ రంజన్‌ను ఒక రాజకీయ ప్రముఖుడు కాల్చి చంపాడు. పత్రికా విలేకరులు, ఎడిటర్లను హతమార్చిన వారిలో కొందరు ఎంపీలూ, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. బొంబాయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ‘శివసేన’ (బీజేపీ జ్ఞాతి) నాయకుడు కూడా తక్కువ తినలేదు. నగర రోడ్లన్నీ గుంతలు పడి జనం ఇబ్బందుల పాలవడం చూసిన మలిష్కా మెండోన్సా రాసిన వ్యంగ్య కవిత ఎఫ్‌.ఎం. రేడియోలో పదే పదే ప్రసారం కావడాన్ని ఆ పార్టీ సహించలేకపోయింది. ఇంతకీ ఆ పార్టీ వ్యవస్థాపకుడు బాల్‌ ఠాక్రే తన కార్టూన్లతో ఎందరినో ఏడిపించినవాడేనన్న ఇంగిత జ్ఞానం ఆ పార్టీ నాయకుడికి లేకపోయింది. ఇంతకన్నా మించిన ఘోర పరిణామం– ప్రతిష్టాత్మక ‘ఎకనమిక్‌ అండ్‌ పొలిటికల్‌ వీక్లీ’ ఎడిటర్‌ పరంజయ్‌ గుహ ఠాకూర్తాను కార్పొరేట్‌ దిగ్గజాలలో ఒకటైన ఆదానీ గ్రూపు జోక్యంవల్ల సంపాదకునిగా తప్పించడం. దానిపైన ఐదుగురు ఉద్దండులు (అభిజిత్‌ బెనర్జీ, రామచంద్ర గుహ, జోయాహసన్‌ వగైరా) ఆ పత్రిక ధర్మకర్తలకు దశాబ్దాలుగా ‘వీక్లీ’ సంతరించుకున్న ప్రతిష్టను పాడు చేయవద్దని విజ్ఞప్తి చేస్తూ సంతకాలు చేసి ఒక లేఖను పంపారు. అందులో వీరు చేసిన హెచ్చరిక ప్రగతిశీల, సమరశీల శక్తులంతా గమనించదగింది: ‘నేడు మన దేశం అంధకార దశలో బతుకుతోంది. ఈ దశలో భావ ప్రకటనా స్వేచ్ఛ, మేధావుల ఆలోచనా స్వాతంత్య్రాల పట్ల విద్వత్‌ రంగానికి చెందినవారూ, జర్నలిస్టులూ ఆందోళన పడటం సహజం. అందులోను బడా కార్పొరేట్‌ సంస్థల అధీనంలోకి పత్రికా సంస్థలు జారుకున్న తరువాత, స్వతంత్రమైన ఆలోచనలను, చర్చలనూ బాహాటంగా, రహస్య పద్ధతులలో అదిరించి బెదిరించే ధోరణులు ప్రబలిపోతున్నాయి. ‘ఈ దేశంలో ఒక వ్యక్తి లేదా ఒక నాయకుడి వ్యక్తిగత ప్రతిష్ట కన్నా సమాచార హక్కు, ఫలానా విషయాన్ని నిగ్గు తేల్చుకునే హక్కు, జాతీయ ప్రయోజనం ముఖ్యం’ అని జస్టిస్‌ దీపక్‌ మిశ్రా ధర్మాసనం స్పష్టం చేసింది గదా. అందుకని ‘ఆశయాలు సంఘర్షించే వేళ ఆయుధం అలీనం కాద’న్నది మహాకవి కవితాపరంగా చెప్పిన బ్రహ్మవాక్కు!


- ఏబీకే ప్రసాద్‌

సీనియర్‌ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement