తెల్లబడిన నల్లడబ్బు | Black money has made as white money | Sakshi
Sakshi News home page

తెల్లబడిన నల్లడబ్బు

Published Wed, Oct 5 2016 12:45 AM | Last Updated on Wed, Apr 3 2019 5:16 PM

తెల్లబడిన నల్లడబ్బు - Sakshi

తెల్లబడిన నల్లడబ్బు

చాన్నాళ్ల తర్వాత నల్లడబ్బు మళ్లీ పతాక శీర్షికలకెక్కింది. ఈసారి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నల్ల ధనం వెల్లడి పథకం గడువు ముగిసిన సెప్టెంబర్ 30 నాటికి రూ. 65,250 కోట్ల డబ్బు ‘స్వచ్ఛందం’గా బయటికొచ్చిందని కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. ఇందులో పన్ను, జరిమానాల రూపంలో ప్రభుత్వ ఖజానాకు 45 శాతం అంటే...రూ. 29,362 కోట్లు జమవుతాయి.

అయితే ఈ లెక్కలు స్థూలమైనవే. తుది మదింపు తర్వాత వెల్లడైన నల్లధనం మరో పది వేల కోట్ల రూపాయల మేర పెరగవచ్చునని ఆశిస్తున్నారు. ఖజానాకు సమకూడిన ఈ డబ్బును సంక్షేమ పథకాలకు వెచ్చిస్తామని జైట్లీ తెలిపారు. పథకం ముగియడానికి ముందు దాదాపు పక్షం రోజులు ఆదాయపన్ను విభాగం బాగా శ్రమించింది.
 
 గడువు ముగిశాక కఠిన చర్యలుంటాయన్న సంకేతాలు పంపింది. అది ఫలించినట్టుంది. గతంలో ఇలాంటి పథకాల సందర్భంగా వెల్లడైన నల్లడబ్బుతో పోలిస్తే ఈసారి బయపడింది చాలా ఎక్కువే. జూన్ నుంచి మూడునెలలపాటు అమల్లో ఉన్న ఈ పథకంలో 64,000మంది పౌరులు లెక్కలు చూపని తమ ఆదాయాన్ని వెల్లడించారు. సగటున ఒక్కొక్కరు కోటి రూపాయలు మించి నల్లడబ్బును బయటపెట్టారని చెప్పొచ్చు. ఇది గతంలో అమలు చేసిన క్షమాదాన పథకం లాంటిది కాదని, ఈసారి పన్నుతోపాటు జరిమానా సైతం వసూలు చేశామని జైట్లీ గుర్తు చేస్తున్నారు. అది నిజమే కావొచ్చుగానీ...ఇలాంటి పథకాలు నిజాయితీగా ఎప్పటికప్పుడు ఆదాయ పన్ను చెల్లిస్తున్న పౌరుల్ని నిస్సందేహంగా ఉస్సూరనిపిస్తాయి.
 
 ఠంచనుగా పన్ను చెల్లించేవారు ఎప్పుడేమవుతుందోనని జడిసో, అలా చెల్లించడం తమ బాధ్యతగా భావించడంవల్లనో ఆ పని చేస్తారు. గతంలో ఒక సందర్భంలో ఇలా ఆదాయ వెల్లడి పథకం అమలైనప్పుడు దాన్ని వ్యతిరేకిస్తూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైతే ఇకపై ఇలాంటివి అమలు చేయవద్దని ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. లెక్కకు చూపకుండా ఎంతైనా పోగేసుకోవచ్చునని, దాంతో వ్యాపార వ్యవహారాలు చక్కబెట్టుకోవచ్చునని... క్షమాపథకం ఏదైనా అమలు చేసినప్పుడు వెల్లడించి సులభంగా బయటపడవచ్చునని పౌరులు అనుకుంటే దానివల్ల ఒకరకమైన నిర్లిప్త ధోరణి అలవడుతుందని హెచ్చరించింది.   
 
 ఈ నల్లడబ్బు బ్రహ్మ పదార్థం లాంటిది. దాన్ని గురించి పొంతనలేని అంచనాలే తప్ప శాస్త్రీయమైన లెక్కలు లేవు. స్విస్ బ్యాంకుల్లో రూ. 30 లక్షల కోట్లున్నదని అంచనా వేస్తున్నామని 2011లో ఆనాటి సీబీఐ డెరైక్టర్ చెప్పారు. 2009 ఎన్నికల సభల్లో బీజేపీ సీనియర్ నేత ఎల్.కె. అద్వానీ అది రూ. 75 లక్షల కోట్లుంటుందని చెప్పేవారు. నల్లడబ్బు విషయంలో మన ప్రభుత్వాల ఆలోచన తీరులోనే లోపం ఉన్నదని సుప్రీంకోర్టు గతంలో వ్యాఖ్యానించింది. దాన్ని ఎంతసేపూ పన్ను ఎగవేతగా పరిగణిస్తున్నారు తప్ప దేశ ఆర్ధిక వ్యవస్థను ఛిద్రం చేసే జాతిద్రోహంగా గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది.
 
 ఆర్ధిక నేరాలు, పన్ను ఎగవేతలు, అవినీతి వగైరాల కారణంగా విదేశాలకు లెక్కకు మిక్కిలి డబ్బు తరలిపోతున్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో ఉన్నదని గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటెగ్రిటీ(జీఎఫ్‌ఐ) బృందం అధ్యయనం నిరుడు వెల్లడించింది. తొలి మూడు స్థానాల్లో చైనా, రష్యా, మెక్సికో దేశాలున్నాయి. ఇలా బయటి దేశాలకు తరలిపోయే డబ్బు భారత్‌లో ఆనాటికానాటికి పెరుగుతున్నదని ఆ బృందం అంటున్నది. ఇది ఏటా దాదాపు లక్ష కోట్లుంటుందని నిపుణుల అంచనా. ఎన్నిసార్లు ఖండించినా అతుక్కునే రావణాసురుడి తలల్లా...అరికట్టాలనుకున్న కొద్దీ నల్లడబ్బు పెరిగిపోతూ ప్రభుత్వాలను పరిహసిస్తున్నది. ఇంచుమించు ఏటా వేసే కొత్త కొత్త పన్నులతోపాటే వాటిని రాబట్టడానికి అనుసరించబోయే కొత్త మార్గాలను కూడా ప్రభుత్వాలు అన్వేషిస్తుంటాయి.
 
  ఏ మార్గంలో మరింత ఎక్కువ రాబట్టవచ్చునో, ఏం చేస్తే పన్ను ఎగవేతను అరికట్టవచ్చునో ప్రభుత్వంలోనివారు వెదుకుతారు. కానీ నల్ల కుబేరులు దానికి దీటుగా ఎత్తులు వేస్తున్నారు. వారిని అధిగమించే స్థాయిలో ఉన్నతాధికారులు ఆలోచిస్తే తప్ప దేశం నుంచి అక్రమంగా నిధులు తరలిపోవడం ఆగదని నల్లడబ్బు వ్యవహారాలపై సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధినేత జస్టిస్ అరిజిత్ పశాయత్ ఇటీవల అన్నారు. రియల్ ఎస్టేట్ లావాదేవీలన్నీ ఇకపై చెక్కుల ద్వారానే ఉండాలన్న నియమం పెట్టినా అందుకు విరుద్ధంగా ఇప్పటికీ ప్రధానంగా డబ్బులే చేతులు మారుతున్నాయి. రియల్‌ఎస్టేట్ లావాదేవీలతోపాటు మద్యం, విద్య తదితర వ్యాపారాల్లో గుట్టలకొద్దీ డబ్బు పోగుపడుతోంది. అదును చూసుకుని సరిహద్దులు దాటుతోంది. చట్టసభలకు జరిగే ఎన్నికలు నల్లడబ్బు చలామణికి రాచమార్గమవుతున్నాయి. ఎన్నికల వ్యయానికి సంబంధించి పరిమితులకు లోబడి లెక్కలు చూపే నేతలు ఈమధ్య కాలంలో నిజాన్ని దాచలేక అప్పుడప్పుడు నోరు జారుతున్నారు.
 
 సామాన్యులు గుండెలు బాదుకునేలా కోట్ల రూపాయలు ఖర్చు చేశామని కెమెరాల సాక్షిగా వెల్లడిస్తున్నారు. మరోపక్క రూ. 50 లక్షలకు మించి ఆదాయాన్ని చూపుతున్నవారు దేశంలో లక్షన్నరమందికి మించి లేరని గణాంకాలు చెబుతున్నాయి. 125 కోట్ల జనాభా ఉన్న దేశంలో ఇలాంటి గణాంకాలు వింతగా అనిపిస్తాయి. దేశంలోని ఏ ప్రధాన నగరంలో చూసినా కోటిన్నర, రెండు కోట్ల రూపాయల విలువ చేసే భవంతులు పెద్ద సంఖ్యలో ఉంటాయి. కానీ ఆదాయాన్ని చూపవలసి వచ్చేసరికి అందరూ ముఖం చాటేస్తున్నారు.
 
 ఉగ్రవాదం పెరుగుతున్న వైనాన్ని చూసి కావొచ్చు, మొత్తంగా వివిధ దేశాలనుంచి వస్తున్న ఒత్తిళ్ల వల్ల కావొచ్చు... ఒకప్పుడు నల్లడబ్బుకు స్వర్గధామాలుగా పేరుబడ్డ చాలా దేశాలు ఇప్పుడు నల్ల కుబేరుల వివరాలివ్వడానికి ముందుకొస్తున్నాయి. మన దేశం విషయానికొస్తే గతంతో పోలిస్తే ఇప్పుడు కఠినమైన చట్టాలున్నాయి. నిఘా సైతం పెరిగింది. అయితే పన్నులను పూర్తి స్థాయిలో హేతుబద్ధీకరిస్తే తప్ప పరిస్థితి మెరుగుపడదని కేంద్ర ప్రభుత్వం గుర్తించాలి. అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement