సీబీఐ ఓవరాక్షన్! | CBI over action not to follow in proper way on investigation of law | Sakshi
Sakshi News home page

సీబీఐ ఓవరాక్షన్!

Published Sat, Oct 1 2016 12:43 AM | Last Updated on Mon, Sep 4 2017 3:39 PM

నిందితులుగా ఉన్నవారిని ప్రశ్నించడం నేర దర్యాప్తులో ఒక భాగం.

నిందితులుగా ఉన్నవారిని ప్రశ్నించడం నేర దర్యాప్తులో ఒక భాగం. అలాగే వారి ఇళ్లల్లో సోదాలు చేయడం, దర్యాప్తునకు పనికొచ్చే పత్రాలను, ఇతర ఆధారాలను స్వాధీనపరుచుకోవడం సర్వసాధారణం. కానీ ఈ రెండింటి విషయంలో పోలీసులు, నేర దర్యాప్తు విభాగాలు సక్రమంగా వ్యవహరించకపోవడం వల్ల చివరికొచ్చే సరికి నేర నిరూపణ అసాధ్యమవుతున్నది. కొన్ని సందర్భాల్లో నిందితులైనవారు ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు వస్తున్నాయి. కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖలో డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తూ ఒక లంచం కేసులో అరెస్టయిన బాల్‌కిషన్ బన్సల్‌తోపాటు ఆయన కుటుంబం కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే ముగిసిపోయింది.
 
 బన్సల్ నిర్బంధంలో ఉండగా ఆయన భార్య, కుమార్తె రెండు నెలలక్రితం ఆత్మహత్య చేసుకోగా... మూడురోజులక్రితం బన్సల్, ఆయన కుమా రుడు ఉసురు తీసుకున్నారు. మొత్తంగా కుటుంబం మొత్తం కనుమరుగైంది. ఈ లంచం కేసులో బన్సల్ ఒక్కరే నిందితుడు. సీబీఐ ఆయనను అరెస్టు చేయడంతో పాటు ఏడెనిమిదిచోట్ల సోదాలు నిర్వహించింది. బన్సల్‌పై వచ్చిన ఆరోపణ ఆర్ధిక నేరానికి సంబంధించింది. ఆయన భార్య, కుమార్తె, కుమారుడు దీంతో ఏమాత్రం సంబంధం లేనివారు.
 
 అందరూ ఉన్నత విద్యావంతులు. సీబీఐ దర్యాప్తును వారు ఆటంకపరిచారనిగానీ, సోదాలకు అడ్డుతగిలారనిగానీ, సిబ్బందిని దుర్భాషలాడా రనిగానీ ఆరోపణలు రాలేదు. ఈ లంచం ఆరోపణ వచ్చేవరకూ బన్సల్ కుటుంబం సమాజంలో గౌరవప్రదంగా మెలిగింది. ఇన్నేళ్లుగా ఉన్నత పదవులు నిర్వహించిన ఇంటిపెద్ద ఒక్కసారి డబ్బులు తీసుకుంటూ దొరికిపోవడంతో బంధుమిత్రుల్లో, ఇరుగుపొరుగువారిలో తమ పరువు పోయిందని కుటుంబసభ్యులు భావిస్తారు. సహజమే. దాన్నుంచి కోలుకోవడానికి సమయం పడుతుంది. పైగా ఆయన అరెస్టుకు కొన్ని రోజులముందు కుమార్తె వివాహం నిశ్చయమైంది. అదికాస్తా ఈ ఉదంతంతో రద్దయింది.

అయితే కేవలం ఇలాంటి కారణాలతోనే వారు ప్రాణాలు తీసుకున్నారా, మరేదైనా వారిని ప్రభావితం చేసిందా అన్నది దర్యాప్తులో తప్ప బయటపడదు. కానీ బన్సల్, ఆయన కుమారుడు ప్రాణాలు తీసుకుంటూ రాసిన లేఖల్లో తమ కుటుంబ సభ్యులందరినీ సీబీఐ మానసికంగా, శారీరకంగా హింసిం చిందని ఆరోపించారు. సాధారణంగా న్యాయస్థానాలు ఆత్మహత్య చేసుకునేవారు వదిలిపోయిన లేఖలను విశ్వసిస్తాయి. వాటిల్లో ప్రస్తావనకొచ్చిన అంశాలను బలపర్చే ఆధారాలున్నాయేమో పరిశీలిస్తాయి.

ప్రాణం తీసుకోవడానికి సిద్ధపడే వారు అబద్ధాలాడరన్న నమ్మకమే దీనికి ప్రాతిపదిక. నిజానికి ఈ కేసులో బన్సల్‌ను అరెస్టు చేయవలసిన అవసరం లేదని సీబీఐ కోర్టు మొదట్లోనే అభిప్రాయపడింది. అరెస్టులు నిర్వహించినప్పుడు కాస్తంత మానవతా దృక్పథాన్ని ప్రదర్శించాలని హితవు పలికింది. ‘ఇది అత్యాచారం కేసు కాదు. హత్య కేసు అంతకన్నా కాదు. ఆర్ధికపరమైన నేరం. ఇలాంటి కేసుల్లో పత్రాలే సాక్ష్యాధారాలుగా సరిపోతాయి. మరి అరెస్టు ఎందుకు చేశార’ని న్యాయమూర్తి సీబీఐని నిలదీశారు.
 
 తీవ్ర నేర స్వభావమున్న కేసుల్లో నిందితుడు సాక్ష్యాధారాలను ధ్వంసం చేస్తాడని, సాక్షుల్ని బెదిరిస్తాడని లేదా పరారవుతాడని భావించినప్పుడు మాత్రమే అరెస్టు చేయాలని రెండేళ్లక్రితం సుప్రీంకోర్టు సూచించింది. ఏడేళ్ల శిక్ష పడే అవకాశమున్న నేరాల్లో మాత్రమే నిందితులను అరెస్టు చేయాలని స్పష్టమైన మార్గ దర్శకాలిచ్చింది. బన్సల్‌పై మోపిన అభియోగం కూడా ఈ పరిధిలోకే వస్తుంది.  కానీ ఇలాంటి సూచనలన్నీ బేఖాతరవుతున్నాయి.

నిందితులుగా ఉన్నవారిని అరెస్టు చేసి కొన్ని నెలలపాటైనా కటకటాల వెనక్కు నెట్టకపోతే తమ అహంకా రానికి, అధికారానికి, దర్పానికి భంగం వాటిల్లుతుందని...వాటిని ప్రదర్శించుకోవ డానికి వచ్చిన సందర్భాలను చేజార్చుకోకూడదని బలంగా విశ్వసిస్తున్నాయి. ఇలాంటి చవకబారు ఎత్తుగడల విషయంలో ఎంతో శ్రద్ధ కనబరుస్తున్న ఈ సంస్థలు తీరా నిందితులపై మోపిన అభియోగాలను నిరూపించాల్సిన చివరాఖరి ఘట్టంలో ఘోరంగా విఫలమవుతున్నాయి.
 
 నిందితులను అరెస్టు చేయడం, వారి ఇళ్లను సోదా చేయడంలాంటి అంశాల్లో ఆర్భాటాన్ని ప్రదర్శించడం దృశ్య మాధ్యమం వచ్చాక మరీ ముదిరిపోయింది. ఇక దర్యాప్తు పేరిట వారు సాగించే హడావుడి అంతా ఇంతా కాదు.  కేసుల్లో అరెస్టయ్యేవారంతా దోషులు కారు. వారు కేవలం నిందితులు. దర్యాప్తు తర్వాత న్యాయస్థానాల్లో వారు నిర్దోషులుగా బయటపడొచ్చు లేదా నేరస్తులుగా జైలుకు పోవచ్చు. ఈలోగా పోలీసు, దర్యాప్తు విభాగాలు నిందితులపై వచ్చిన ఆరోపణల్లోని నిజానిజాలను నిర్ధారించకుండా నానా యాగీ చేస్తున్నాయి. దర్యాప్తునకు సంబంధించిన నైపుణ్యాన్ని అలవర్చుకోలేని తమ అసమర్ధతను కప్పెట్టుకోవడానికి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిని హింసించి ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నాయి.
 
 బన్సల్ కుటుంబం ప్రాణాలు తీసుకున్న కేసులో ఢిల్లీ పోలీసుల తీరు సైతం అభిశంసనీయమైనది. ఈ కేసులో ముందు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేయాల్సి ఉండగా... బన్సల్, ఆయన కుమారుడు వదిలివెళ్లిన లేఖలను ఒకసారి చూడండంటూ సీబీఐకే వాటిని పంపారు. తగుదునమ్మా అన్నట్టు ఈ కేసు దర్యాప్తు బాధ్యతను సీబీఐ తీసుకుంది. ఆ లేఖల్లో భార్య, కుమార్తె పట్ల అమానుషంగా వ్యవహరించిన మహిళా అధికారుల పేర్లను, వారి చేష్టలను పేర్కొన్నారు.
 
 తన భార్యను వారు అనేకసార్లు కొట్టారని, గోళ్లతో నెత్తురోడేలా గిచ్చారని బన్సల్ చెప్పారు. భార్యనూ, కుమార్తెనూ చచ్చేట్లా కొట్టమని తన ఎదురుగానే సీబీఐ డీఐజీ మహిళా అధికారులను ఆదేశించాడని తెలిపారు. భార్య, కుమార్తెలది కేవలం హత్య లేనని ఘోషించాడు. బన్సల్ కుమారుడు యోగేష్ సైతం తనను చిత్రహింసలు పెట్టిన వైనాన్ని వెల్లడించాడు. ఈ కేసు దర్యాప్తును సీబీఐ నుంచి తప్పించి విశ్వసనీ యత కలిగిన ఉన్నతాధికారులతో కూడిన ప్రత్యేక బృందానికి అప్పగించాలి. ఇలాంటి కేసుల్లో అధికారులు అతిగా వ్యవహరించకుండా మరింత స్పష్టమైన మార్గ దర్శకాలను జారీచేయాలి. వాటిని ఉల్లంఘించిన వారిపై చర్యలుండాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement