
ప్రత్యేకహోదా ద్రోహులు ఆ ఇద్దరే!
కొమ్మినేని శ్రీనివాసరావుతో సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ
మనసులో మాట
'ఆంధ్ర ప్రజానీకాన్ని పట్టపగలే మోసం చేసిన ఘటన ఏదైనా ఉందంటే అది ప్రత్యేకహోదానే. అధికారంలోకి రాగానే హోదా ఇచ్చేస్తామని చెప్పి 13 జిల్లాల్లో తిరిగి సన్మానాలు చేయించుకున్న వెంకయ్య, 15 ఏళ్లు హోదా సాధిస్తానన్న చంద్రబాబు చివరకు సన్మానాలే సిగ్గుపడే స్థాయిలో ప్రచార యావలో మునిగి ప్రజలను నిండా ముంచేశారు.'
వామపక్ష ఉద్యమనేతగా పదునైన భాష, పరుషమైన వ్యాఖ్యలతో తనదైన శైలిలో రాజకీయాలు చేసే సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ అధికారంలో లేనప్పుడు ఒకలా, అధికారం వచ్చిన ప్పుడు మరొకలా మాట్లాడటం మొదట్నుంచి చంద్రబాబు నైజమ న్నారు. ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్ర ప్రజలను నిండా ముంచింది అటు వెంకయ్య, ఇటు బాబేనన్నారు. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మాట్లాడితేనే నిర్భందిస్తున్నారనీ, మాట తప్పిన తర్వాత కేంద్రమంత్రైనా, సీఎంనయినా కడిగి పారేసే హక్కు ప్రజల కుందంటున్న నారాయణ మనసులోని మాట ఆయన మాటల్లోనే...
మీ రాజకీయ ప్రస్థానం ఎలా ఆరంభమైంది?
మాది చిత్తూరు జిల్లా. పూర్తిగా రాజకీయేతర కుటుంబంలోనే పుట్టి పెరిగాను. మదనపల్లిలో బీటీ కాలేజీలో పీయూసీ చదివాను. ఆయుర్వేదిక్ మెడిసిన్ చేయమని మా డాక్టర్ సలహా ఇస్తే నాన్న నన్ను గుంటూరుకు పంపించారు. అక్కడ యూనియన్లలో తిరగడం, ఏఐఎస్‌ఎఫ్‌తో పరిచయం, ఎస్‌ఎఫ్ కార్యదర్శిగా, జిల్లాకార్యదర్శిగా అయ్యాను. తర్వాత పార్టీ ఆదేశానుసారం చిత్తూరుకు వచ్చేశాను.
ఎన్టీరామారావు, రాజశేఖరరెడ్డిపై మీ అభిప్రాయం?
రామారావు రాజకీయేతర రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. లాభనష్టాలతో పనిలేకుండా భావోద్వేగంతో నిర్ణయం తీసుకునేవాడు. అది తప్పు కావచ్చు రైటు కావచ్చు. కరణాల వ్యవస్థను ఎన్టీఆర్ కాకపోతే మరె వరైనా రద్దు చేసేవారా? ఎవరికైనా సాధ్యం అయ్యేదా? ఇక రాజశేఖర రెడ్డి.. రాజకీయాల్లో ఉండతగిన వ్యక్తి. సాక్షి టీవీ కోసం ఇలా చెప్పడం లేదు. వ్యక్తిత్వంలో, స్పందనల్లో, సంబంధాల్లో, రాజకీయ భాషలో ఆయన నిఖార్సైన వ్యక్తి. సహాయ పడే తత్వం. అందరితో మాట్లాడి పనులు చేసుకునే విషయంలో వైఎస్సార్‌ను బాగా ఇష్టపడతాను.
గత రెండున్నరేళ్ల బాబు పాలనపై మీ వ్యాఖ్య?
మాటలెక్కువ చేతలు తక్కువ. మైకు పట్టుకుంటే విసుగు కలిగిస్తూ, గంటల తరబడి మాట్లాడతాడు. లోపల సరుకుంటే రెండు మాటలు చాలు. సరుకు లేనప్పుడు ఎక్కువ చెప్పు కోవాలి. రకరకాల పద్ధతుల్లో బుకాయించాలి.
మొత్తం రుణాలు మాఫీ చేసేశానంటున్నాడు. కదా?
మాఫీ కాలేదు. కాకపోగా రైతులపై వడ్డీలు కూడా వసూలు చేసే పరిస్థితి వచ్చింది. ఒకేసారి రుణాలు మాఫీలు చేయాలని కొట్లాడితే నాలుగు దఫాలుగా మాఫీ చేస్తానని పెట్టాడు. ఎన్నికల ప్రణాళికలో మొదట చెప్పింది టీడీపీయే. ఇచ్చిన హామీని అమలు చేయలేదు.
రాజధాని సమస్యపై మీ వ్యాఖ్య ఏమిటి?
30 వేల ఎకరాలు సేకరించినట్లు చెప్పినప్పడు మేం వ్యతిరే కించాం. అన్ని వేల ఎకరాలు నీకెందుకు అని ప్రశ్నించాం. బిల్డర్ల అభివృద్ధికి ఈ భూములను ఇవ్వడాన్ని ఒప్పుకోమన్నాం. రెండు లేక మూడువేల ఎకరాలకు మించి తీసుకుంటే కుదరదన్నాం.
రెండేళ్లలోపే హైదరాబాద్ వదిలి వెళ్లవలసిన అవసరం ఏంటి?
నా ఉద్దేశంలో ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే తరలి పోయి ఉండాలి. ఎంత ముందుగా వెళ్లితే అంత మంచిని నా భావన. కానీ బాబు వెళ్లలేదు. ఇక్కడే పదిహేనేళ్లపాటు తిష్ట వేసుకుని కూర్చో వాలనుకున్నాడు. తర్వాత అనేక ఇబ్బందులు వచ్చాయి. చివరకు తప్పనిసరై వెళ్లిపోవాల్సి వచ్చింది.
మీరు గుర్తించిన ఇబ్బందులు ఏమిటి?
ఒకటి అడ్మినిస్ట్రేషన్ సమస్య. ఇక్కడ కూర్చుని అక్కడ పాలన చేస్తే పట్టు రాదు. అభివృద్ధి కాదు. పని చేయలేడు. రెండోది ఓటుకు కోట్లు కేసు గొడవ. నోటీసులు, కేసులు.. అంటూ ముఖ్యమంత్రి వెంట పోలీసులు పడుతూంటే ఎంత భయశనంగా ఉంటుంది?
విపక్ష ఎమ్మెల్యేలను బాబు లాగేసుకున్నారు కదా..?
ఇలాంటి పనులు బాబు అధికారంలోకి రాకముందే మొదలు పెట్టాడు. జేసీ దివాకర్ రెడ్డివంటి వారికి ఎంపీ సీటు ఇచ్చాడంటేనే అర్థమవుతుంది కదా. తర్వాత అవసరమైన ఎమ్మెల్యేల బలం ఉండి కూడా, ప్రతిపక్షమే ఉండకూడదనే పద్ధతుల్లో రకరకాలుగా ఫిరాయింపులకు దిగాడు.
ప్రత్యేక హోదా పరిణామాలపై మీ వ్యాఖ్య?
పట్టపగలే ఆంధ్ర ప్రజానీకాన్ని మోసం చేసిన ఘటన ఏదైనా ఉందంటే అది ప్రత్యేక హోదానే. రాజ్యసభ చర్చలో వెంకయ్య నేరుగా పాల్గొన్నాడు. సాంకేతిక కారణాలతో దాన్ని బిల్లులో పెట్టలేదు. వెంకయ్య ఒత్తిడి పెడితే నాటి ప్రధాని 5ఏళ్లపాటు హోదా ప్రకటించారు. వెంటనే వెంకయ్య లేచి మాకు పదేళ్లు కావాల న్నాడు. బయటికి వచ్చి మేము అధికారంలోకి రాబోతున్నాం. రాగానే హోదా ఇచ్చేస్తాం అని కూడా మీసాలు తిప్పాడు. ఇక్కడేమో 13 జిల్లాల్లో తిరిగి వెంకయ్య మనకు దేవుడు అని బేజీపీ వాళ్లు ప్రచారం చేసుకు న్నారు. ఊరేగించారు. వెంకయ్యకే పేరు వచ్చే స్తోందే అని దుగ్ధతో తాను 15 ఏళ్ల హోదా తెచ్చేస్తానని బాబు ప్రకటించేశారు. ఇప్పుడైతే హోదా అనేది సంజీవని మూలికా.. అదొక మేక లింగాల వంటింది అనే మాట చెబుతారు. ఆరోజు హోదా పేరుతో సన్మానం మీద సన్మానం చేయించుకున్నోళ్లు, ఇప్పుడు మాత్రం ప్రత్యేక ప్యాకేజీ తెస్తున్నామంటూ మరొక సన్మానం చేయించుకుంటున్నారు. అంటే సన్మానాలే అవమానపడే పరిస్థితి వచ్చేసింది.
హోదానడిగితే కేసులు పెడతామంటున్నారే?
ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మాట్లాడితేనే మూసేస్తున్నారు. అందరూ కలిసి అనుకుని, ఆమోదించిన ప్రత్యేక హోదాను అడిగితే కూడా మమ్మల్ని జైల్లో పెడుతున్నారు. చివరకు వెంకయ్య సన్మానం చేసుకోవాలంటే అర్థరాత్రి కమ్యూనిస్టులను లోపల పడేశారు.
రెండు రాష్ట్రాల ప్రజలకు మీ సందేశం?
రెండు రాష్ట్రాల్లో కూడా ప్రజానీకం ప్రజావ్యతిరేక విధానాలపైన మరింతగా పోరాడాల్సి ఉంది. పాలకవర్గాలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, హక్కుల్ని హరిస్తున్నాయి. వీటన్నింటిపై అప్రతిహ తంగా ఫైట్ చేయాల్సినటువంటి అవసరం ప్రజాస్వామ్య, వామపక్ష శక్తులకు ఉంది. కలసి రమ్మని కోరుతున్నాం.